పేదవాడికి పెద్ద జబ్బు వస్తే.. ఆశలు వదులుకునే పరిస్థితులు పోవాలి


 
01–05–2018, మంగళవారం
మచిలీపట్నం, కృష్ణా జిల్లా


ప్రపంచ కార్మికులారా ఏకంకండి.. అంటూ ఓ నినాదం శ్రామిక లోకానికి కొత్త వెలుగులు తెచ్చింది. మేడే సందర్భంగా ఉదయం.. కార్మికలోకం వర్థిల్లాలి.. అన్న జనం జేజేల మధ్య జెండాను ఎగురవేసి పాదయాత్ర ప్రారంభించాను. అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి అశోక్‌ అనే సోదరుడు తన బిడ్డ ఆరేళ్ల ఆదిత్యతో వచ్చి కలిశాడు. ‘అన్నా.. పుట్టుమూగ, చెవిటివాడైన నా బిడ్డకు మీ పుణ్యాన లక్షల విలువైన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ జరిగింది. కూలిపని చేసుకునే నేను.. కలలో సైతం ఊహించని సాయాన్ని అందించి, నా బిడ్డకు వినికిడి, మాట్లాడే శక్తిని అందించిన మీ రుణం ఏమిచ్చి తీర్చుకోగలను?’ అంటూ ఆ సోదరుడు చెబుతుంటే.. పేదవాడికి సాయం చేసి, వారి జీవితాల్లో వెలుగు నింపడంకన్నా తృప్తి ఏముంటుంది.. అనిపించింది. 

తాడేపల్లికి చెందిన గరుగు కృష్ణారెడ్డి, అతని సోదరి ఇరువురూ పుట్టుకతోనే మూగ, చెవుడు అట. ఆ సోదరుడు జాతీయ బధిరుల చెస్‌ చాంపియన్‌. తను గెలిచిన ట్రోఫీని తీసుకొచ్చి నాకు చూపిస్తూ ఆనందాన్ని పంచుకున్నాడు. చిన్ననాడే తండ్రిని కోల్పోతే.. వారి తల్లి అష్టకష్టాలూ పడి ఆ బిడ్డల్ని సాకిందట. అటువంటి ఆ తల్లికి గుండెపోటు రావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారట. ఆ సమయంలో నాన్నగారి చలవతో ఉచితంగా ఆపరేషన్‌ జరిగిందట. ఆ సోదరుడితో వచ్చిన వారి బంధువు రవిశంకర్‌ నాతో మాట్లాడుతూ ‘అన్నా.. ఆ అన్నాచెల్లెళ్లు అనాథలు కాకుండా మీ నాన్నగారు కాపాడారు. ఆ కుటుంబానికి మీరంటే ప్రాణం. నాన్నగారు చేసిన సాయాన్ని ఆ తల్లీబిడ్డలు తలవని రోజంటూ లేదు’ అన్నాడు. జూలై నెలలో లండన్‌లో జరిగే అంతర్జాతీయ బధిరుల చెస్‌ చాంపియన్‌షిప్‌లోనూ ట్రోఫీ గెలిచి.. నన్ను కలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడట ఆ సోదరుడు. అతని ఆత్మవిశ్వాసం అభినందనీయం. అతని అభిమానం అనిర్వచనీయం. 


గన్నవరం నుంచి వచ్చిన జ్యోతి అనే అక్క.. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూ.. ముఖంలో చిరునవ్వును పులుముకునే ప్రయత్నం చేస్తూ ‘అన్నా నేను ఓ బస్సు డ్రైవర్‌ భార్యను. నాకు రొమ్ము క్యాన్సర్‌. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయించుకున్నాను. కొంతకాలానికి గొంతు కింద గడ్డ రూపంలో క్యాన్సర్‌ మళ్లీ వచ్చింది. ఈసారి ఆరోగ్యశ్రీ వర్తించదన్నారు. రూ.లక్ష దాకా ఖర్చు చేసి మళ్లీ వైద్యం చేయించుకున్నా. ఇప్పుడు మళ్లీ క్యాన్సర్‌ తిరగబెట్టింది. ఇక పోరాడే శక్తి, ఆర్థిక స్థోమతా మాకు లేవు. అన్నా.. నాకు ఏ సాయం అవసరంలేదు. నాలాంటి వారు మీ పాలనలో ఇలాంటి క్షోభ పడరాదు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యానికి దూరం కారాదు. అంతటి మంచి పాలన మీరు అందివ్వగలరనే నమ్మకం నాకుంది. ఆ రోజులు త్వరగా రావాలని ఆ దేవుడిని రోజూ ప్రార్థిస్తున్నానయ్యా’ అంటూ ఆ అక్క ఉద్వేగంగా చెప్పింది. తను ఎంతటి విషమ పరిస్థితుల్లో ఉన్నా.. పరులకోసం పరితపిస్తున్న ఆ అక్క పెద్ద మనసుకు మనస్సులోనే నమస్కరించుకున్నాను. పేదవాడికి పెద్ద జబ్బు వస్తే.. ఆశలు వదులుకునే పరిస్థితులు పోవాలి. ఇటువంటి పరిస్థితులు చూశాకే.. శక్తి వంచన లేకుండా ఆపన్నులను ఆదుకోవాలన్న నా సంకల్పం మరింత బలోపేతమైంది. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మీ పాలనలో ప్రభుత్వాస్పత్రులను పట్టించుకోవడం లేదు. 104, 108 పథకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. పేదవాని ఆరోగ్యం పట్ల ఎందుకింత నిర్లక్ష్యం? ప్రజారోగ్యాన్ని గాలికొదిలేయడం ధర్మమేనా?   
- వైయ‌స్‌ జగన్‌  
 

Back to Top