దసపల్లాహిల్స్‌లో రూ.1500 కోట్ల కుంభకోణం

  • ప్రభుత్వ భూమి కాజేసేందుకు లోకేష్‌ కుట్ర
  • బినామీ పేర్లతో దోచుకోవడానికి రంగం సిద్ధం
  • కోర్టు పరిధిలో ఉన్న భూమిలో టీడీపీ కార్యాలయమా?
  • లోకేష్‌ షాడో సీఎంగా తయారయ్యాడు
  • సుప్రీం కోర్టుకు వెళ్లైనా సరే భూమిని కాపాడుకుంటాం
  • వైయస్‌ఆర్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌
హైదరాబాద్‌: విశాఖపట్నంలోని ‘రాణి కమల దేవి‘ ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌ కుట్రలు పన్నుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. దాదాపు రూ. 15 వందల కోట్ల విలువైన భూమిని దోచుకోవడానికి లోకేష్‌ తన బినామీలతో 52 దొంగ డాక్యుమెంట్లను సృష్టించారని తెలిపారు. విశాఖ నడిబొడ్డున అధికార పార్టీ చేస్తున్న అవినీతిపై అమర్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా విశాఖ దసపల్లా హిల్స్‌లో రూ. 15 వందల కోట్ల కుంభకోణం జరుగుతుందని ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని లోకేష్‌ బినామీ పేర్లతో దోచుకోవడానికి రంగం సిద్ధం చేశారని విమర్శించారు. కోర్టు తగదాల్లో ఉన్న 18.3 ఎకరాల భూమిలో టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి గతంలో చంద్రబాబు జీవో 556 విడుదల చేశారని గుర్తు చేశారు. గత ఏప్రిల్‌ నెలలో నారా లోకేష్‌ కార్యాలయానికి శంకుస్థాపన చేయడం కూడా జరిగిందన్నారు. కోర్టు వ్యవహారంలో ఉన్న భూమిలో టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. 

నిజాయితీగా ఉంటే ట్రాన్స్‌ఫర్లు, సస్పెండ్సా?
దసపల్లా హిల్స్‌లోని 1196 సర్వే నెంబర్‌లోని 18.3 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగా కలెక్టర్‌ యువరాజ్‌ ధృవీకరించారని అమర్‌ గుర్తు చేశారు. నిజాయితీగా ఎంక్వైరీ చేసి ప్రభుత్వ భూమిగా గుర్తించినందుకు నాలుగు నెలల్లోనే ఆయనను ట్రాన్స్‌పర్‌ చేశారన్నారు. అదే విధంగా 50 మంది లోకేష్‌ బినామీలు ప్రైవేట్‌ భూమిగా చూపేందుకు పోరాటం చేస్తున్న తరుణంలో మరో అధికారి ప్రభుత్వ భూమి అని అఫిడవిట్‌ ఫైల్‌ చేసినందుకు ఆయనపై ఏసీబీ రైడ్ చేయించి సస్పెండ్‌ చేయించారని ఫైరయ్యారు. కలెక్టర్‌ యువరాజ్‌ గెజిట్‌ నోటిపై చేసిన 1196 సర్వే నెంబర్‌ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రవీణ్ కుమార్ తొలగించడంతో ఆయన్ను కలెక్టర్‌గా నియమించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాయితీగా వ్యవహరించే అధికారులను ట్రాన్స్‌ఫర్‌లు, సస్పెండ్‌ చూస్తూ ప్రభుత్వానికి కొమ్మకాసే వ్యక్తులకు పదోన్నతులు కల్పించి అందలం ఎక్కిస్తుందని విమర్శించారు. విలువైన భూమికి సంబంధించి ఎఫ్‌ఎంబీ, ఎస్‌ఎఫ్‌ఏ అడిగితే మా దగ్గర సమాచారం లేదని చెప్పడం ఎంత వరకు సమంజసం అని ఆర్టీఏ అధికారులను  ప్రశ్నించారు.  రూ. 1500 కోట్లు విలువ చేసే భూమి పత్రాలు ప్రభుత్వం దగ్గర లేవని చెప్పడం సిగ్గుచేటన్నారు. 

నోట్లపై బాబు ప్రకటన విడ్డూరం
ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్‌ షాడో సీఎంగా తయారయ్యారని అమర్‌నాథ్‌ విమర్శించారు. లోకేష్‌ దృష్టంతా విలువైన భూములు, అవినీతి మూటలపై పెట్టారని ఆరోపించారు. రాజధాని భూ కుంబకోణం మాదిరిగా విశాఖలోని దసపల్లా, ఎన్‌ఎండీఏ భూములు కూడా కాజేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఎన్‌ఎండీఏ ప్రతినిధులకు ఇళ్ల కోసం కేటాయించిన స్థలాన్ని హుడా అధికారులతో మాట్లాడి కాజేసి ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. మరో పక్క సీఎం చంద్రబాబు రూ. 500, వెయ్యి నోట్లను రద్దు చేయాలని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అంటే దానర్థం రెండు వేలు, ఐదు వేల నోట్లను ప్రింట్‌ చేస్తే అవినీతికి సులువుగా ఉంటుందనేనా అని చంద్రబాబును ప్రశ్నించారు. విశాఖ భూములపై చంద్రబాబు, లోకేష్‌ చేస్తున్న అరాచకాలను వైయస్‌ఆర్‌ సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఆయన భూమి విషయాన్ని ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించామని చెప్పారు. విలువైన భూమిని కాపాడుకోవడానికి సుప్రీం కోర్టుకు వెళ్లి పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ లిటికేషన్‌ పిల్‌ వేస్తామని చెప్పారు. కలెక్టర్‌ గెజిట్‌ నోటిపై ఆధారంగా కోర్టును ఆశ్రయిస్తామన్నారు. ప్రజా అవసరాల కోసం ఉపయోగించాల్సిన భూమిని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తే సహించేది లేదని, ఎంతటి పోరాటమైనా చేస్తామని హెచ్చరించారు. 
 
Back to Top