నీరు-చెట్టులో రూ.150 కోట్ల అవినీతి

విజయనగరం : తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన నీరు, చెట్టు కార్యక్రమంలో రూ.150 కోట్ల మేర అవినీతి, అక్రమాలు జరిగాయని వైయస్సార్‌సీపీ జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. తక్షణమే వాటిపై విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సత్య కార్యాలయంలో ఏర్పాటు  చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  విజయనగరం, పార్వతీపురం డివిజన్లలో రూ.150కోట్ల మేర దేశం  నేతలు దర్జాగా దోపిడీ చేస్తున్నారని అన్నారు.

జిల్లాలో ఒక తెలుగుదేశం నాయకుడు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు స్వాహా చేశాడని శ్రీనివాసరావు చెప్పారు.  ఈ సంఘటన వెలుగులోకి  వచ్చినా కలెక్టరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దేశం నేతల అక్రమ దోపిడీని ఇప్పటికే విజిలెన్సు అధికారుల దృష్టికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లిందని చెప్పారు. పార్టీ నేత యడ్ల రమణమూర్తి మాట్లాడుతూ.. విజయనగరం నియోజకవర్గంలో అభివృద్ధి వెతికినా కనిపించడం లేదని విమర్శించారు. 

కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, ఎమ్మెల్యే  మీసాలగీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణలు పట్టణంలో అభివృద్ధి వెలిగిపోతోందని చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పిళ్లా విజయ్‌కుమార్, యువజ విభాగం రాష్ట్ర కార్యదర్శి అవనాపు విజయ్, నాయకులు ఉప్పు ప్రకాష్, గాడు అప్పారావు, పిన్నింటి చంద్రమౌళి, పిలకా శ్రీనివాస్, కరుమజ్జి సాయికుమార్ పాల్గొన్నారు
Back to Top