పార్లమెంట్‌ మెట్లను తాకే అర్హత ఉందా బాబూ?

03–04–2018, మంగళవారం
కింగ్‌ హోటల్‌ సెంటర్‌(గుంటూరు ఈస్ట్‌), గుంటూరు జిల్లా

ఈ రోజు కిక్కిరిసిన జన సందోహం మధ్య గుంటూరు నగరంలో పాదయాత్ర సాగింది. చుక్కా ప్రమీల అనే దివ్యాంగురాలైన చెల్లెమ్మ కలిసింది. ఏఎన్‌ఎం కోర్సు పూర్తిచేసిందట. ‘అన్నా.. 2016లో మా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇంటర్వ్యూలు కూడా చేశారు. పోస్టుకు సెలెక్ట్‌ అయినట్లు చెప్పారు. నాకు క్రోసూరు ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగమన్నారు. ఇంతకాలమైంది.. ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందం సైతం ఆవిరైపోయింది. నిరాశే మిగిలింది’ అని ఆ చెల్లి ఎంతో మథనపడుతూ చెప్పింది. ఆమెతో పాటు సెలెక్ట్‌ అయిన 34 మందిదీ ఇదే పరిస్థితట. కేవలం ఉద్యోగాలు ఇచ్చేస్తున్నామన్న భ్రమలు కలిగించడం కోసం నోటిఫికేషన్‌లు ఇచ్చి, ఇంటర్వ్యూలు నిర్వహించి.. ఉద్యోగాలివ్వకుండా నిరాశలో ముంచడం మోసం కాక మరేంటి? అటు వేరే ఉద్యోగాలకు పోలేక.. ఇటు వచ్చిన ఉద్యోగంలో చేరడం కోసం ఎదురుచూస్తూ.. విలువైన కాలాన్ని నష్టపోతున్నారు ప్రమీల లాంటి దురదృష్టవంతులు. ఇలాంటి నిర్భాగ్యుల జీవితాలతో ఆడుకునే హక్కు ఈ పాలకులకు ఎవరిచ్చారు?

పేదింట్లో పుట్టిన విద్యాకుసుమాలు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువులకు దూరమై వాడిపోకూడదన్న మహదాశయంతో నాన్నగారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం పెట్టారు. ఆ పథకం ఎంత మొక్కుబడిగా సాగుతోందో వివరించారు.. గుంటూరు జిల్లా ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీల అసోసియేషన్‌ వాళ్లు. 2016–17, 2017–18 సంవత్సరాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఇంతవరకూ చెల్లించలేదట. ప్రతి సంవత్సరం కాలేజీ ఫీజులు పెరుగుతున్నాయి తప్ప.. ప్రభుత్వం చేసే రీయింబర్స్‌మెంట్‌ మాత్రం పెరగడం లేదు. ఆ భారమంతా విద్యార్థులపై పడుతోంది.

ఆ భారాన్ని పేదింటి బిడ్డలు ఎలా మోయగలరు? చదువుకొనసాగించాలంటే అప్పో సప్పో చేయాల్సిన పరిస్థితి. ఇచ్చే అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా సమయానికి అందక విద్యార్థులపై, వారి తల్లిదండ్రులపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఆ ఒత్తిళ్లకు తట్టుకోలేక చదువు ఆగిపోతుందన్న మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులు ఎందరెందరో. స్వలాభమే పరమావధిగా అక్రమార్జనలో మునిగితేలుతున్న ఈ పాలకులకు పేద విద్యార్థుల కన్నీటి వెతలు కనిపిస్తాయా? మరోవైపు యూనివర్సిటీకి కట్టాల్సిన డబ్బు వెంటనే చెల్లించకపోతే కాలేజీలకు అఫిలియేషన్‌ నిలిపివేస్తామంటూ నోటీసులు అందుతున్నాయట. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకపోగా.. అఫిలియేషన్‌ డబ్బు కట్టాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసం?

ఈ రోజు చంద్రబాబునాయుడు గారు పార్లమెంట్‌ మెట్లకు మొక్కుతూ సినిమా షూటింగ్‌ను తలపించే విధంగా నిమిషాల తరబడి ఫొటోలకు, వీడియోలకు ఫోజులివ్వడం చూస్తుంటే నవ్వొచ్చింది. చట్టాలను బేఖాతర్‌ చేసే వ్యక్తి.. రాజకీయ విలువలను దిగజార్చిన వ్యక్తి.. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పే వ్యక్తి.. రాజ్యాంగం అంటే గౌరవం లేని వ్యక్తి.. ప్రజాస్వామ్య విలువలను మంటగలిపిన వ్యక్తి.. పార్లమెంటరీ వ్యవస్థపై నమ్మకమే లేని వ్యక్తి.. పార్లమెంట్‌ మెట్లకు మొక్కడమంటే.. దెయ్యం దేవుడి పూజ చేసినట్టే. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ.. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన ఎంపీలను, ఎమ్మెల్యేలను నల్లధనంతో నిస్సిగ్గుగా కొని, వారిపై అనర్హత వేటు పడకుండా కాపాడుతూ.. వారిలో కొందరికి మంత్రి పదవులు సైతం కట్టబెట్టి.. చట్ట సభల పవిత్రతకు  భంగం కలిగించిన మీకు పార్లమెంట్‌ మెట్లను తాకే అర్హత ఉందా?  
                                                         

Back to Top