అమ‌రావ‌తి అంటే ఇంట్లో ఫంక్ష‌నా..!


హైదరాబాద్ :అమరావతి మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లేవనెత్తిన అనుమానాలే నిజం అయ్యాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటిరాంబాబు వ్యాఖ్యానించారు.  శంకుస్థాపన చంద్రబాబు నాయుడు ఇంట్లో ఫంక్షన్లా జరిగిందని  విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. 

నరేంద్ర మోదీ-చంద్రబాబు నాయుడు జోడీ ప్రజలను మోసం చేసిందని అంబటి ఆరోపించారు. ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తారని తెలుగు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని... వారి ఆశలపై గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు జల్లి వెళ్లిపోయారని ఆయన ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల ఆకాంక్షలను మోదీకి చెప్పడంలో చంద్రబాబు విఫలం అయ్యారన్నారు.

కేసుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టారని అంబటి వ్యాఖ్యానించారు. నిన్న జరిగింది రెండు పండుగలు కాదని...రెండు వంచనలంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పాపాలకు పవిత్రత ఆపాదించే ప్రయత్నం చేశారని, వేదికపై దళితుడు గానీ, రైతుకు గానీ అవకాశం ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు.
Back to Top