122వ రోజు షర్మిల పాదయాత్ర ప్రారంభం

మైలవరం (కృష్ణాజిల్లా), 16 ఏప్రిల్‌ 2013: కృష్ణాజిల్లాలో శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర అభిమానుల ఆదరాభిమానాల మధ్య దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆమె చేపట్టిన పాదయాత్ర నేటికి 122వ రోజుకు చేరింది. శ్రీమతి షర్మిల మంగళవారం చెరువు మాధవవరం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ప్రజాకంటక కాంగ్రెస్‌ ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తీరుకు నిరసనగా, కష్టాల్లో ఉన్న ప్రజలకు మేమున్నాం అంటూ భరోసానిచ్చేందుకు మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సుదీర్ఘమైన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు.

మరో ప్రజాప్రస్థానం 122వ రోజు మంగళవారం పాదయాత్ర వివరాలను పార్టీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను వెల్లడించారు. శ్రీమతి షర్మిల మునగపాడు వరకు పాదయాత్ర చేసిన తరువాత మధ్యాహ్న భోజన  విరామం ఉంటుందని తెలిపారు. అనంతరం సాయంత్రం సున్నంపాడు, తెల్లదేవరపాడు, గంగినేని, దుగిరాలపాడు వరకు పాదయాత్ర చేస్తారు. అనంతరం మంగళవారం రాత్రికి శ్రీమతి షర్మిల బస చేస్తారని చెప్పారు.

సోమవారం 14.5 కిలోమీటర్లు యాత్ర :
‌కాగా, పాదయాత్ర 121వ రోజు సోమవారం శ్రీమతి షర్మిల కృష్ణా జిల్లా మైలవరం నుంచి యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కుంటుముక్కల అడ్డరోడ్డు, వెంకటాపురం, చెవుటూరు, జి.కొండూరు, గడ్డమణుగు వరకు యాత్ర సాగింది. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు ఆమె చేరుకున్నారు. సోమవారం మొత్తం 14.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,638.2 కి.మీ యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు జోగి రమేష్, కొడాలి నాని, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే జేష్ట రమే‌ష్ బాబు, స్థానిక నాయకులు కాజా రా‌జ్‌కుమార్, అప్పిడి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, వేజెండ్ల శివకుమార్, కె. గురువయ్య తదితరులున్నారు.


Back to Top