వైయస్సార్సీపీలోకి 100 మైనారిటీ కుటుంబాలు

కర్నూలు: నంద్యాల ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాటకాలాడుతున్నారని వైయస్సార్‌ సీపీ మైనార్టీ నేతలు సాధిక్‌, ఇస్మాయిల్‌ విమర్శించారు. కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, నంద్యాలలో మాత్రం బీజేపీ జెండాలు లేకుండా ప్రచారం చేయమంటున్నారని ఆరోపించారు. బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే నంద్యాలలో నాటకాలకు తెర తీశారని మండిపడ్డారు. మైనార్టీ నేతలంతా చంద్రబాబు డ్రామాలను గమనిస్తున్నారని హెచ్చరించారు. మరోవైపు నంద్యాలలో వైయస్సార్‌ సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. శిల్పా చక్రపాణిరెడ్డి సమక్షంలో 100 మైనారిటీ కుటుంబాలు మంగళవారం వైయస్సార్‌ సీపీలో చేరాయి. కాగా, వైయస్సార్‌ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. 26వ వార్డులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి కుమార్తె శిల్పారెడ్డి, కౌన్సిలర్‌ లక్ష్మీదేవి, కృష్ణమోహన్‌ తదితరులు ప్రచారం చేశారు.

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినందుకు గర్వపడుతున్నానని  శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. రాజకీయాల్లో విలువల కోసం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన రాజీనామా కోరారని వెల్లడించారు. విలువలకు తమ కుటుంబం కట్టుబడివుంటుందని, తన రాజీనామాతో ఈ విషయం నిరూపితమైందని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి భూమా అఖిలప్రియ ముందు రాజీనామా చేసి తర్వాత ఓట్లు అడిగితే గౌరవంగా ఉంటుందని అన్నారు. నైతిక విలువలు ఎవరికున్నాయో తన రాజీనామాతో తేలిందని చక్రపాణిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారానికి రాజీనామాతో సరైన సమాధానం చెప్పామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఆమోదింపజేసుకోవాలని మరోసారి డిమాండ్‌ చేశారు.

తాజా వీడియోలు

Back to Top