ప్రతీ గుండెలో వైయస్‌ఆర్‌ బతికే ఉన్నారు



డల్లాస్‌లో సెలబ్రేటింగ్‌ డాక్టర్‌ వైయస్‌ఆర్‌ లైఫ్‌ అండ్‌ లెగసీ
నివాళులర్పించిన చిరకాల మిత్రులు, వక్తలు, వైయస్‌ఆర్‌ సీపీ నేతలు
అమెరికా: వైయస్‌ రాజశేఖరరెడ్డి మన మధ్య లేకపోయినా ఆయన చేపట్టిన పథకాలతో నిరంతరం ప్రజల మదిలో మెదులుతూనే ఉన్నారని మహానేత వైయస్‌ఆర్‌ చిరకాల మిత్రులు డాక్టర్‌ ప్రేమసాగర్‌రెడ్డి గుర్తు చేశారు. అమెరికా డల్లాస్‌ మహానగరంలో ఏటీసీ తెలుగు మహాసభ ఉత్సవాల చివరి రోజు సెలబ్రేటింగ్‌ డాక్టర్‌ వైయస్‌ఆర్‌ లైఫ్‌ అండ్‌ లెగసీ ప్రోగ్రాం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అనేక మంది వ్యక్తులు పాల్గొని వైయస్‌ఆర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రేమసాగర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు ఉండేవని, సుదీర్థ పోరాటం తరువాత వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. పరిపాలనలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు అనేకం చేశారన్నారు. వైయస్‌ఆర్‌ మరణం తెలుగు ప్రజలకి తీరని లోటని, ఇప్పటికీ ప్రతీ సందర్భంలో ఆయన లోటు కనిపిస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

చిన్న పరిచయాన్ని కూడా జీవితాంతం గుర్తు పెట్టుకునే అరుదైన వ్యక్తి వైయస్‌ఆర్‌ అని తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టాటా) అడ్వైజరీ కమిటీ చైర్మన్‌ మల్లారెడ్డి గుర్తు చేశారు. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా వైయస్‌ఆర్‌ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని, లేదు.. కాదు.. అని చెప్పడం తెలియని మనసున్న మహారాజు వైయస్‌ఆర్‌ అని కొనియాడారు. 

స్నేహానికి ప్రాణమిచ్చే అరుదైన మంచి మనిషి వైయస్‌ఆర్‌ అని అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) అడ్వైజరీ కౌన్సిల్‌ చైర్మన్‌ హనుమంతరెడ్డి గుర్తు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది వక్తలు మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ మరణం ఇప్పటికీ పీడకలలా వెంటాడుతుందన్నారు. వైయస్‌ జగన్‌ ప్రతీ నిత్యం ప్రజల కసం పోరాడుతూ తండ్రి వైయస్‌ఆర్‌ని గుర్తు చేస్తున్నారన్నారు. తండ్రిని మించిన తనయుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆకాంక్షించారు. వైయస్‌ఆర్‌ ఆశయాలను సాధించే సత్తా ఒక్క వైయస్‌ జగన్‌కే ఉన్నాయని, అందుకే తెలుగు ప్రజలు జననేతకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. 

కార్యక్రమంలో పద్మభూషన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, సీనియర్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ లక్కిరెడ్డి హనిమిరెడ్డి, ఎంఎస్‌రెడ్డి, రవి సన్నారెడ్డిలతో పాటు వైయస్‌ఆర్‌ చిరకాల మిత్రులు రాఘవరెడ్డి, నిజామాబాద్‌ మాజీ ఎంపీ ఆత్మచరణ్‌రెడ్డి, పరమేష్‌ భీంరెడ్డి, డాక్టర్‌ మోహన్‌ మల్లం, డాక్టర్‌ హరినాథ్, రాజేశ్వరరెడ్డి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అమెరికా కన్వీనర్లు డాక్టర్‌ శ్రీధర్‌ కొర్సపాటి, డాక్టర్‌ వాసుదేవ పాల్గొన్నారు. 
 
Back to Top