వాషింగ్టన్‌లో వైయస్‌ఆర్‌ వర్ధంతి

వాషింగ్టన్‌ డీసీ: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మూడవ వర్ధంతి సభను అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ‌15న నిర్వహించారు. వర్జీనియాలోని ఫ్రయింగ్ పాన్ఫారం పార్క్ ఆడిటోరియంలో ఆ రోజు ఉదయం 10.30 గంటలకు వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమం ప్రారంభమైంది. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు సభ కొనసాగింది. సభ అనంతరం ఆహూతులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైయస్‌ఆర్‌ 400 మందికి పైగా అభిమానులు హాజరై నివాళులు అర్పించారు.
మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి ముఖ్యఅతిథి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి, వైయస్‌ఆర్ కాంగ్రెస్ నంద్యాల ఇ‌న్‌చార్జి ఎ.వి. సుబ్బారెడ్డి, ఎ.వి. ప్రసాద్, రమే‌ష్‌రెడ్డి వల్లూరు జ్యోతి ప్రజ్వలన చేసి నివాళి అర్పించి, కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జననేత వైయస్ రాజశేఖరరెడ్డి జీవిత‌ విశేషాలపై ప్రత్యకంగా రూపొందించిన 'వైయస్‌ఆర్ - ఒక చరిత్ర' వీడియోను‌ ఈ సందర్భంగా ప్రదర్శించారు. వైయస్‌ఆర్‌ అభిమానులంతా తమ నేత లేని లోటును స్మరించుకుని కన్నీటితో నివాళులు అర్పించారు.
సామాన్య ప్రజల గుండెల్లో వైయస్‌ఆర్ ఎలా కొలువు దీరారన్నది 'బ్రతికున్నా... మీ గుండెల్లో!' అంటూ రమేష్‌రెడ్డి వివరించారు. వైయస్ మరణాన్ని తాము ఇప్పటి‌కీ జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. చిరునవ్వు చెరగని ముఖం. మడత నలగని పంచె కట్టు. నేనున్నానని భరోసా కలిగించే మాట తీరు. ఆరు నూరైనా మాటపై నిలబడే వ్యక్తిత్వం. ఒక్క మాటలో తెలుగుదనానికి నిలువెత్తు సంతకం. మనిషి మరణించాక కూడా బతికే ఉండాలని నమ్మిన మహా మనీషి వైయస్ రాజశేఖరరెడ్డి‌ అని కొనియాడారు.
మహానేత, దివంగత ముఖ్య మంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించి మూడేళ్లు గడిచినా ఆయన జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువు తీరాయని వాషింగ్టన్‌ డీసీలోని ఎన్నారైలు గుర్తు చేసుకున్నారు. ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆంధ్ర ప్రజలదరి నుంచి నేటికీ దివంగత నేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి నిత్య నీరాజనాలు అందుకుంటున్నారని తెలిపారు.
వైయస్‌ఆర్‌ రాజసం గురించి రఘు కడసాని ఆహూతులకు సోదాహరణంగా వర్ణిచారు. ఎంతో మంది పేద ప్రజల అభ్యున్నతి కోసం వైయస్ అహర్నిశలు శ్రమించారని సుధాకర్‌రెడ్డి, నర్సిరెడ్డి, శశి బండ్లపల్లి తెలిపారు. మహానేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన తుదిశ్వాస విడిచే వరకు ప్రజలకు అందించేందుకు కృషి చేశారని ‌ప్రవాసాంధ్రులు కీర్తించారు. పరిపాలనాదక్షతకు, రాజనీతిజ్ఞతకు దివంగత మహానేత నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. 
వైయస్ రాజశేఖరరెడ్డి మరణించి అప్పుడే మూడేళ్లు గడుస్తున్నా ఆయన లేరనే విషయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నా‌రని జ్ఞానేంద్రరెడ్డి నివాళులు అర్పించారు. ప్రజలు ఆయనను తమ మనసులోనే గుడి కట్టుకుని, పదిలంగా పూజించుకుంటున్నారని అన్నారు.
ప్రజానేత వైయస్‌ మరణించిన మూడేళ్లకే రాష్ట్రంలో ఎంత మార్పు వచ్చిందని ఎ.వి. సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ హయాంలో అభివృద్ధి పరుగులు తీసిందన్నారు. ప్రజా సంక్షేమం విరాజిల్లిందని, పరిపాలన ఆదర్శవంతంగా సాగిందన్నారు. మహానేత వైయస్ శ్వాస, ధ్యాస ప్రజా సంక్షేమమే ‌అన్నారు. ఊపిరి ఆగిపోయేంతవరకు ప్రజల కోసమే పరితపించారన్నారు. అందుకే జనం హృదయాల్లో వైయస్‌ దేవుడిలా కొలువు దీరారని కీర్తించారు. ఆగిపోయిన ఆ మహర్షి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని పిలుపునిచ్చారు.
చరిత్రలో తెలుగుజాతి ఉన్నంతకాలం మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని భూమా నాగిరెడ్డి అంజలి ఘటించారు. ప్రజలకు పెద్దాయన చాలా చేయాలనుకున్నారు. వారికేం చేయాలనుకున్నా వేగంగా ఆలోచించేవారు. పేదలకు మేలు జరిగే ఏ నిర్ణయంలోనూ ఆలస్యం కూడదన్న గాంధీ హితవే ఆయనకు స్ఫూర్తి అన్నారు. 1978లో వైయస్‌ రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. 1983 తర్వాత 21 ఏళ్లు పెద్దగా పదవులేమీ లేవు. అయినా ఏనాడూ ఆయన ప్రజలకు దూరం కాలేదు. రాష్ట్రంలో ఆయన తిరగని ప్రాంతమే లేదు. ఏ ఊరికి ఏ రోడ్డు వెళ్తుందో తెలుసాయనకు. చిన్న చిన్న ఊళ్లన్నీ ఆయనకు గుర్తే. కొన్ని లక్షల మందిని పేర్లు పెట్టి పిలిచేంత జ్ఞాపకశక్తి. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండుసార్ల ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొచ్చిన వైయస్ కుటుంబంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‌చేస్తున్న దుర్మార్గాలను తప్పు పట్టారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషిచేసిన దివంగత సీఎం వైయస్‌ఆర్ అడుగుజాడల్లో న‌డవాలని పిలుపునిచ్చారు.
వైయస్ తనయుడు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తన సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి చేస్తారని ఆకాంక్షించారు. ప్రజల అండతో 2014లో వై‌యస్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ ఆంధ్రప్రదే‌శ్‌లో అధికారంలోకి వస్తుందన్న ధీమాను భూమా వ్యక్తం చేశారు. వైయస్ హయంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ‌పేర్కొన్నారు.
వైయస్‌ఆర్, జగ‌న్మోహన్‌రెడ్డి మీద శ్రీనివాసరెడ్డి సోమవరపు పాటలు పాడి, కవితలు చదివి వినిపించారు. వర్జీనియా, మేరీలాండ్, వాషింగ్ట‌న్ డీసీ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు ‌'వైయస్ రాజశేఖరరెడ్డి అమ‌ర్ రహే, జై జగ‌న్‌' నినాదాలతో సందడి చేశారు. వందలాది మంది ప్రవాసాంధ్రులు యువనేత వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి స్థాపించిన వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మహానేత డాక్ట‌ర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి పేరిట ‌త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వాషింగ్టన్‌ డిసీలోని ప్రవాసాంధ్రులు తెలిపారు.
వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించిన రమేష్‌రెడ్డి వల్లూరు, రఘు కడసాని, నినాద్ అన్నవరం, రాజీ‌వ్ రాజోలు, అమ‌ర్ కటికరెడ్డి, శ్రీనివా‌స్ అనుగులకు ప్ర‌త్యేక ధన్యవాదాలు తెలిపారు. చివరిగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ వాషింగ్ట‌న్ డిసి చాప్ట‌ర్ నాయకుడు రమే‌ష్‌ రెడ్డి వల్లూరు వందన సమర్పణ చేశారు.
Back to Top