జగన్‌ కోసం వాషింగ్టన్‌ డిసిలో కొవ్వొత్తుల ప్రదర్శన

వాషింగ్టన్ డిసి‌ :

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత, కడప ఎం.పి. జగన్మోహన్‌రెడ్డి నిర్భంధానికి నిరసనగా ఆయన అభిమానులు, కార్యకర్తలు వాషింగ్టన్ డిసిలో సోమవారం సాయంత్ర‌ం కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. వెస్టు ఒక్ష్ రోడ్డులోని ఫ్రయింగ్‌ పాన్ ఫా‌ర్ము పార్కులో కొవ్వొత్తుల ర్యాలీ, మౌన ప్రదర్శన నిర్వహించారు.

‌ఈ సందర్బంగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌ప్రవాసాంధ్ర విభాగం కో ఆర్డినేటర్ వల్లూరు రమేష్‌రెడ్డి మాట్లాడుతూ, జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి జనంలో ఉంటే తమ ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందనే భయంతో కాంగ్రెస్, ‌టిడిపిలు కుమ్మక్కై సిబిఐని పావులా వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఏడాది కాలంగా శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలులో నిర్బంధించారన్నారు. తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు.

శ్రీ జగన్ను వేధించడం వెనుక ఢిల్లీ స్థాయిలో రాజకీయ కుట్ర జరుగు‌తున్నదని రమేష్‌రెడ్డి ఆరోపించారు. దీనిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ‌టిడిపి ప్రధాన ప్రతిపక్షమైనప్పటికీ, ప్రజా సమస్యలపై నిబద్ధతతో పోరాడుతున్నది వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీయే‌నని ప్రజలు గుర్తించారన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఎంతగా అణచివేయాలని చూస్తే అంతకు లక్ష రెట్లు ప్రజల అభిమానంతో మహాశక్తిగా, తిరుగులేని నాయకుడిగా ఎదుగుతారని చెప్పారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి రాజన్న సువర్ణ రాజ్యాన్ని తప్పక తెస్తారన్న ఆశాభావాన్ని రమేష్‌రెడ్డి వ్యక్తం చేశారు.

Back to Top