కేసును తప్పుదోవ పట్టించిన వారికి శిక్ష తప్పదు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఏపీ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

 డీజీపీకి కనీసం జ్ఞానం లేదు

 కేసును తప్పుదారి పట్టించేందుకు టీడీపీ నేతలు కుట్రలు

 ఎన్‌ఐఏకి సీఎం, డీజీపీ, టీడీపీ నేతల కాల్‌డేటా ఇవ్వాలి 

 

హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్న పరిజ్ఞానం లేని వ్యక్తిని డీజీపీగా నియమించారన్నారు. ఈ కేసులో ఎవరున్నా తప్పించుకోలేరని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటన కేసును ఎన్‌ఐఏకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం పట్ల వైయస్‌ఆర్‌సీపీ స్వాగతించింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటన కేసు ఎన్‌ఐఏకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.

ఈ కేసును విచారణ చేపడుతామని కోర్టుకు ఎన్‌ఐఏ కూడా  అఫిడవిట్‌ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని టీడీపీ ప్రభుత్వం రాజకీయాలకు వాడుకుందన్నారు. చంద్రబాబు, రాష్ట్ర డీజీపీ, కోడికత్తి అని ఎగతాళి చేసిన వారిని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు. ఎన్‌ఐఏ జనవరి 1వ తేదీన వైయస్‌ జగన్‌ కేసును విచారణకు స్వీకరిస్తున్నామని చెప్పడం నిజంగా న్యాయానికి న్యాయం జరిగిందన్నారు. డీజీపీకి కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడారన్నారు. ఎవరిపై విచారణ చేయాలో పరిజ్ఞానం లేని అధికారిని డీజీపీగా నియమించారన్నారు. ఈ కేసును కచ్చితంగా ఎన్‌ఐఏ విచారణ చేయాలని మేం మొదటి నుంచి చెబుతున్నామన్నారు. ఈ విషయం మీకు తెలుసా..తెలియదా అని నిలదీశారు. ఎన్‌ఐఏకి ఈ కేసును అప్పగించాలని చెబితే కనీసం డీజీపీ పరిజ్ఞానం లేదన్నారు.

ఈ కేసును తప్పుదారి పట్టించడానికి కావాలనే టీడీపీ నేతలు కుట్రలు చేశారన్నారు. ఈ కుట్ర వెనుక ఎవరు ఉన్నారో బయటకు రాకుడదనే వారే విచారణ చేయించి కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారన్నారు. సీఎం, డీజీపీ, మరికొందరు అధికారులు ఈ కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందన్నారు. ఈ కేసుపై ఎవరు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాల్సి ఉందన్నారు. డీజీపీ ప్రెస్‌మీట్‌ పెట్టడంలో చూపిన శ్రద్ధ కేసు నమోదు చేయడంపై పెట్టలేదన్నారు. ఈ కేసును పరిగణలోకి తీసుకోకపోతే తాను, టీడీపీ నేతలందరూ బయటకు వస్తారని డీజీపీ స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టి కుట్రలు చేశారన్నారు. ఈ కేసులోని తప్పులన్నీటిని ఎన్‌ఐఏ ముందు పెడతామన్నారు. పోలీసులు కూడా స్వయంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయవచ్చు అని చట్టంలో ఉంటే ఆ పని ఎందుకు చేయలేదన్నారు.

వైయస్‌ జగన్‌ అభిమాని అని, ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి అని చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు. కచ్చితంగా ఎన్‌ఐఏ మెట్లు ఎక్కి డీజీపీ, చంద్రబాబు కాల్‌డేటాను అడుగుతానని చెప్పారు. వారి కాల్‌ డేటాను కచ్చితంగా ఎన్‌ఐఏకి అప్పగించాలన్నారు. రాష్ట్ర డీజీపీకి కనీస బుద్ధిజ్ఞానం లేకుండా ఈ కేసులో వ్యవహరించారన్నారు. అడ్వకేట్‌ జనరల్‌ కూడా చంద్రబాబు చెప్పినట్లు వ్యవహరించారన్నారు. అందరిని ఎన్‌ఐఏ ముందు నిలబెడతామని హెచ్చరించారు. ఒక సెక్షన్‌కు బదులు మరో సెక్షన్‌పై కేసు పెడితే ఏడాది జైల్‌ శిక్ష పడుతుందన్నారు. కేసును తప్పుదారి పట్టించాలని ప్రయత్నించిన అందరికీ శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇకనైనా చంద్రబాబు పోలీసులపై ఒత్తిడి చేయవద్దని, వారి విధులు వారు చేసుకోనివ్వాలని సూచించారు. పోలీసు వ్యవస్థను తప్పుదారి పట్టించొద్దని హితవు పలికారు. త్వరలోనే రాజన్న రాజ్యం రాబోతుందని, పేదలకు న్యాయం జరుగుతుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top