ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా..?

పిట్టాపురంలో పోలీసుల అత్యుత్సాహం

ఎమ్మెల్యే వర్మ ప్రోద్బలంతో వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణుల అక్రమ అరెస్టు

పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పీఎస్‌ ఎదుట వైయస్‌ఆర్‌ సీపీ ఆందోళన

తూర్పుగోదావరి: ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిట్టాపురం నియోజకవర్గ కన్వీనర్‌ పెండెం దొరబాబు ధ్వజమెత్తారు. ఇటీవల వన్నెపూడి జన్మభూమి సభలో ఇళ్ల పట్టాల విషయంలో అధికారులను ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టారు. ఈ మేరకు పిట్టాపురం గొల్లప్రోలు పీఎస్‌ ఎదుట పెండెం దొరబాబు ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే వర్మ ప్రోద్బలంతోనే పోలీసులు వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. కేసులను వెంటనే ఎత్తివేయాలని దొరబాబు డిమాండ్‌ చేశారు.

పిట్టాపురం నియోజకవర్గంలో ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు. ఇరు పక్షాల వారు పీఎస్‌లో ఫిర్యాదులు చేస్తే స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో పోలీసులు అత్యుత్సాహం చూపుతూ వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులను ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో 353 సెక్షన్‌ పెట్టారన్నారు. ఏరకంగా 353 సెక్షన్‌ పెట్టారని పోలీసులను ప్రశ్నిస్తే ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నామని, నాలుగు రోజుల్లో కేసులు ఎత్తివేస్తామని చెబుతున్నారన్నారు. నీచ రాజకీయాలు చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే వర్మకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. 

 

Back to Top