ప్రజా సంకల్పయాత్ర ఒక యజ్ఞం

పాదయాత్ర అందరికీ ఆదర్శణీయం

నవరత్నాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం

ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసేలా జననేత అడుగులు

వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఒంటరిగానే పోటీకి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

శ్రీకాకుళం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు 14 నెలలుగా పాదయాత్ర పేరుతో ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యజ్ఞం చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పాదయాత్ర దారి గుండా ప్రతి గ్రామాన్ని పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు భరోసా ఇస్తూ 340 రోజులుగా 3600 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర సాగుతోందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆఖరి అంకానికి చేరుకున్న ప్రజా సంకల్పయాత్రలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నో అవగాహన సదస్సులు, బహిరంగ సభలు, ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టి ప్రజలందరి సమస్యలు తెలుసుకున్నారన్నారు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 

నవరత్నాలతో వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రైతుల పట్ల ప్రేమతో వారిని ఆదుకునేందుకు వైయస్‌ జగన్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రకటించారని, వైయస్‌ జగన్‌ పథకాన్ని తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ప్రవేశపెట్టిందన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తన పాలనలో ఏ విధంగా వినూత్నంగా ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలను చూసి దేశమంతా హర్షించిందన్నారు. వైయస్‌ఆర్‌ తనయడిగా వైయస్‌ జగన్‌ ప్రజల కోసం నవరత్నాలను ప్రవేశపెట్టారన్నారు. వైయస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ గురించి స్టడీ చేసేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబమా ఏపీకి సర్వే టీమ్‌ను కూడా పంపించారన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని అందరూ అమలు చేసే పరిస్థితిని వైయస్‌ఆర్‌ తీసుకువచ్చారన్నారు. 

చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీ పథకం నీరుగారిపోయిందని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు వైద్య సేవలు అందించే పరిస్థితి లేదన్నారు. మళ్లీ ఆరోగ్యశ్రీకి జీవం పోయడానికి రూ. వెయ్యికి పైగా ఖర్చు అయ్యే ఆరోగ్య సమస్యలన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని వైయస్‌ జగన్‌ ఇప్పటికే ప్రకటించారన్నారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ఒంటరిగానే పోరుకు సిద్ధమవుతున్నామని పెద్దిరెడ్డి చెప్పారు. చంద్రబాబు ఏదో రకంగా వైయస్‌ఆర్‌ సీపీపై బురదజల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి చంద్రబాబు ఎంత లాభపడ్డాడో ప్రజలకు తెలుసన్నారు. చంద్రబాబు దోపిడీపై వైయస్‌ జగన్‌ అవినీతి చక్రవర్తి అనే పుస్తకం కూడా రిలీజ్‌ చేశారన్నారు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం తరువాత మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌తో కాపురం చేస్తున్నాడన్నారు. చంద్రబాబు తన బురద తానే ఉంచుకోవాలని, బురదలో కూరుకుపోయిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ 135 నుంచి 140 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

 

తాజా వీడియోలు

Back to Top