నివ‌ర్ తుఫాన్‌పై అధికారుల అప్ర‌మ‌త్తం

నెల్లూరు, చిత్తూరులో భారీ వర్షాలు  


చిత్తూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారింది.  తీవ్ర తుఫాన్ ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.  ఈరోజు సాయంత్రానికి కరైకల్,  మహాబలిపురం ప్రాంతంలో తీరం దాటుతుంది.  దీనిప్రభావం తమిళనాడు, పుదుచ్చేరితో పాటుగా ఆంధ్రప్రదేశ్ పై కూడా తీవ్రంగా ఉన్నది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.  ఈరోజు రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.  ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.   

 బుధవారం ఉదయం నుండి తిరుమలలో ఎడతెరిపి లేకుం​డా వర్షం కురుస్తుంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కాంప్లెక్స్‌కు వెళ్లే భక్తులతో పాటు దర్శనం తర్వాత వచ్చే భక్తులు తడిసిపోతున్నారు. దీంతో భక్తుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. జలాశయాలలో వర్షం నీరు చేరుతుంది. మరోపక్క ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహన దారులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచిస్తున్నారు. ఆగకుండా కురుస్తోన్న వర్షానికి సప్తగిరులు తడిసి ముద్దవుతున్నాయి. 

నెల్లూరులో భారీ వర్షాలు
నివర్‌ తుపాన్‌ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో తీరప్రాంత గ్రామల్లోనూ, నదులు పొంగే ప్రాంతాల్లోను ఎన్డీఆర్ఎఫ్,ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది మోహరించారు. జిల్లాలో 100 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతల్లో ప్రజలను సురక్షిత కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లుతో సహా జిల్లాలో 5000 మంది సిబ్బంది తుఫాన్ రెస్క్యూ చర్యల్లో పాల్గొంటున్నారు. ఇవాళ రేపు జిల్లాలో భారీ వర్షాలు కురిస్తాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు హెచ్చరించారు.

నది పరివాహక ప్రజలను అప్రమత్తం చేశాం. సాధ్యమైనంత వరకు, అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దు. ఆపదలో ఉన్న వారు 1077 కి కాల్ చేసి సాయం పొందవచ్చు అని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top