5జీ మొబైల్‌ సర్వీసుల ట్రయల్‌కు సన్నాహాలు

న్యూఢిల్లీ : దేశంలో 5జీ మొబైల్‌ సేవల ట్రయల్‌ రన్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి సంజయ్‌ ధోత్రే తెలిపారు. రాజ్యసభలో గురువారం  వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 5జీ ట్రయల్‌ రన్‌లో భాగంగా భారత్‌కు మాత్రమే పరిమితం అయ్యే యూజ్డ్‌ కేసులను పరీక్షించేందుకు ఇతర మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరుపుతోందని అన్నారు. పరిమిత భౌగోళిక ప్రాంతంలో, నిర్దేశించిన కాలపరిమితిలో, ఐసోలేటెడ్‌ నెట్‌వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌లో 5జీ యూజ్డ్‌ కేసులను పరీక్షించేందుకు టెలికామ్‌ సర్వీసు ప్రొవైడర్లను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు భారతీ ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌, రిలయన్స్‌ జియో, వోడాఫోన్‌ ఇండియా నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని చెప్పారు. 5జీ మొబైల్‌ సర్వీసెస్‌కు అవసరమైన ఎక్విప్‌మెంట్‌ సమకూర్చేందుకు స్వీడన్‌కు చెందిన ఎరిక్‌సన్‌, ఫిన్లాండ్‌కు చెందిన నోకియా, అమెరికాకు చెందిన మానెనిర్‌ కంపెనీలు దరఖాస్తు చేశాయి. 5జీ మొబైల్‌ సర్వీసులు క్రమేపీ ప్రారంభమై దానికి తగిన సాంకేతిక వాతావరణం అభివృద్ధి చెందుతూ డిమాండ్‌ పెరిగే కొద్దీ 5జీ సేవలను విస్తృతం చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
 

Back to Top