అమరావతి: ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించనుంది. కాగా, ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అయిదు రోజుల పాటు జరగనున్నట్లు ప్రాథమిక సమాచారం. అవసరాన్ని బట్టి మరో రెండు రోజులు పెంచే అవకాశముంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది.