ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారు

కృష్ణా జిల్లా : ‘అన్నా.. నాకు ముగ్గురు బిడ్డలు. నా భర్త చనిపోయి పదేళ్లవుతుంది. అప్పటి నుంచి నా కుటుంబాన్ని పోషించుకునేందుకు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. అయితే గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో నా కాలు విరిగిపోయింది. దీంతో కుటుంబ పరిస్థితి దారుణంగా తయారైంది’ అంటూ ఈదర ప్రాంతానికి చెందిన లక్కపల్లి విజయరాణి ప్రజా సంకల్పయాత్రలో వైయ‌స్‌ జగన్‌ను కలిసి కన్నీరుమున్నీరయ్యారు. కాలు విరగడం వల్ల ఏ పనికి వెళ్లలేకపోతున్నానని, ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయించుకున్నా.. కాలు సరిగా బాగవ్వలేదని చెప్పారు. మళ్లీ చూపించుకోవాలన్నా, కాలులో ఆపరేషన్‌ సమయంలో వేసిన రాడ్డును తీయించుకోవాలన్నా ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీని మాలాంటి నిరుపేదలకు ఉపయోగపడేలా మార్పులు చేయాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.


Back to Top