కనీస గౌరవ వేతనం ఇప్పించాలి

కృష్ణా జిల్లా :‘గత పదేళ్లుగా మేము పశు గణాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నాం. గోపాల మిత్రలుగా పిలువబడే మేము 24 గంటలూ రైతులకు అందుబాటులో ఉంటూ, పశువులకు కృత్రిమ గర్భధారణ, ప్రథమ చికిత్స వంటి సేవలను అందిస్తూ.. రోజంతా కష్ట పడుతుంటే కనీసం మాకు గౌవర వేతనం కూడా సక్రమంగా అందడం లేదన్నా’ అంటూ కృష్ణాజిల్లా గోపాల మిత్రల సంఘ సభ్యులు జననేత వైయ‌స్ జ‌గ‌న్ ఎదుట      ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయ‌స్ జగన్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2000 మంది గోపాల మిత్రలు పనిచేస్తున్నారని, నెలంతా కష్టపడితే కేవలం రూ.3500 మాత్రమే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల కుటుంబ పోషణ భారంగా మారి అప్పులపాలవుతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. తమకు కనీస గౌరవ వేతనం ఇప్పించాలని, వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లలో ఖాళీగా ఉన్న అటెండర్‌ పోస్టులను అర్హులైన గోపాల మిత్రలకు కేటాయించి తమ ఉద్యోగ భద్రతకు భరోసా ఇవ్వాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీర భద్రయ్య, సభ్యులు వేణుగోపాలరావు, రామకృష్ణ, వినయ్‌   కుమార్‌ తదితరులు జగన్‌ను కలిశారు.
Back to Top