ఏమి వింత?


రాబందు రాగం తీయడం మీరెప్పుడన్నా విన్నారా?  పోనీ నక్క కోడి పిల్లలతో ఆడుకోవడం చూసారా? పెద్దపులి గడ్డి తినడం అయినా మీరు ఎరుగుదురా? కనీసం పాము పాయసం తినడం గురించైనా ఐడియా ఉందా? అలా ఎక్కడైనా జరుగుతుందా ఛస్తే జరగదు. అన్నీ విడ్డూరాలు చెబుతున్నామనుకుంటున్నారేమో లేదు లేదు. భవిష్యత్ లో అలాంటి రోజులు చూస్తామని కాలజ్ఞానం చెబుతోంది. చంద్రబాబు తాను రైతు అవతారం ఎత్తి, వ్యవసాయం చేస్తూ కనిపించడం చూసి తెలుగు ప్రాంత ప్రజలు విచిత్రంగా చెప్పుకుంటున్నారు. పై ఉదాహరణలను సోదాహరణంగా చర్చించుకుంటున్నారు.
మారిన మనిషిని అని చంద్రబాబు 2014లో చెబితే ఏమో అనుకున్నారు. సూటు బూటు నుంచి పంచె, చెప్పులకు మారి మార్పు అంటే ఇది అని చూపించారు చంద్రబాబు. అంతేకాదు ఆయనకు వ్యవసాయం అంటే ఎంత ప్రేమో కూడా నిన్నటి ఏరువాకలో స్వయంగా నాట్లు వేసి మరీ చూపించారు. అది చూసి ఆయన అనుచరులు, వెనకున్న టిడిపి నేతలు, అధికారులు కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేసారు. ఇట్టాంటి రైతు ముఖ్యమంత్రిని ఇంకెక్కడా చూడలేం. చూడబోం అంటూ కళ్లొత్తుకున్నారు. 
సిల్కు చొక్కా, పట్టంచు తెల్ల పంచె, జరీ తలపాగా, కాళ్లకు సాక్సులు ప్లస్ చెప్పులతో పొడి నేలలో వరినాట్లు వేస్తూ చంద్రబాబు తనకు వ్యవసాయం అంటే ఎంత ప్రేమో చెప్పకనే చెప్పారు. ఆయన ఉద్దేశ్యంలో మట్టిలో మొక్క గుచ్చితే అది వ్యవసాయమే. తన్ను మించిన వ్యవసాయదారుడు, రైతు బాంధవుడు రాష్ట్రంలో కాదు గదా దేశంలోనే లేడు అన్నంతగా ఏరువాక కార్యక్రమాన్ని జయప్రదం చేసాడు చంద్రబాబు. బాబుకు లాగే రైతులు, కూలీలంతా కాలికి మట్టంటకుండా, ఎండకు కందిపోకుండా, ధగధగలాడే దుస్తుల్లో వ్యవసాయం చేసే రోజు రావాలని, కోటేసుకుని నాట్లేసే రోజులు రానున్నాయని అనుకోవాలి. ఇంతకు మించిన అభివృద్ధి ఎక్కడైనా ఉంటుందా? 
వ్యవసాయం అంటే ప్రేమ అని నిరూపించుకోడానికి చంద్రబాబు పడే పాట్లు, వేసే నాట్లు చూసి జనాలు నవ్వాపుకోలేక పోతున్నారు. కాళ్లకు, చేతులకు మట్టే అంటనివ్వని మనిషి, మట్టి మనుషుల కష్టాలను ఏం తీరుస్తాడని అంటున్నారు. రైతుల రుణ మాఫీ విషయంలో కమిటీలు వేసి, కొర్రీలు వేసి దగా చేసిన ముఖ్యమంత్రి ఏరువాక అంటుంటే ఎలా నమ్మాలని అంటున్నారు. నాలుగేళ్లుగా రైతులు మద్దతు ధర లేక, పంట బీమాలు అందక, నకిలీ విత్తనాల తో నష్టపోయి అల్లాడుతుంటే ఒక్కరోజూ పంట్టించుకోని ముఖ్యమంత్రి నేడు వరినాట్లు వేస్తే రైతు బాంధవుడైపోతాడా అని మండిపడుతున్నారు. 


 

తాజా వీడియోలు

Back to Top