చంద్రన్న పేరు ...కథా కమామిషూ!

నీ పేరేంటి? అని అడిగితే నాయుడుగారు అన్నాడట ఎనకటికొకడు. అదేంటి..! గారు అని కూడా పేరులోనే ఉందా? అని అడిగాడట ఆ పెద్దమనిషి. కాదు కాదు అది నాకు గౌరవం కోసం చెప్పా అన్నాడట. ఓరి నీ తెలివితేటలు అమరావతి సంతకెళ్ల..! గౌరవం అనేది ఒకరు ఇచ్చేది కానీ మనకి మనమే పేరు పక్కన తగిలించుకునేది కాదు, బలవంతంగా పిలిపించుకునేది కూడా కాదు అని గడ్డి పెట్టాడట డబ్బా నాయుడికి. ఆ నాయుడుగోరు అంతటితో ఆగకుండా ఎవరూ నన్ను అలా గౌరవంగా పిలవడం లేదు మరి, ఏం చెయ్యమంటావు? అందుకే నేనే నా పేరు పక్కన తగిలించి చెబుతున్నా అన్నాడట. ఆ పెద్ద మనిషి తల పట్టుకుని ఒరే ఎర్రినాయుడూ! గౌరవం, ప్రేమ, అభిమానం అనేవి మనమీద అవతలివారికి కలగాలే గానీ!.. మనం అడిగిమరీ వసూలు చేసుకునేవి కాదురా! అని చెప్పి పంపించాడట.

ఇప్పుడు ఎపి సిఎం చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే అచ్చం ఆ నాయుడు కథే గుర్తొస్తోంది. అందరూ నన్ను హైటెక్కు సిఎం, జిమ్మిక్కుల సిఎం, వెన్నుపోటు నాయకుడు, మోసకారి బాబు అంటున్నారే తప్ప ప్రేమగా, అభిమానంగా పిలవడం లేదని రోజూ తెల్లవారుజామున తెగ బాధపడిపోతున్నాడట బాబు. దీనికోసం ఏదో ఒకటి చెయ్యాల్సిందే అని తీవ్రంగా ఆలోచించగా ఆలోచించగా ఒకరోజు బ్రహ్మాండమైన దురాలోచన తట్టిందట. ఎన్టీఆర్ ను అన్నా అని పిలిచిన అభిమానులు, వైయస్సార్ ను రాజన్నా అని గుండెలకు హత్తుకున్న తెలుగు ప్రజలు, వైయస్ జగన్మోహనరెడ్డిని జగనన్నా అని ప్రేమగా కుటుంబంలో కలిపేసుకుంటున్న జనం నన్ను మాత్రం ఎందుకు చంద్రన్నా! అనరు? అని ఆలోచించాడట బాబు. అలా అనిపించిందే తడవు ఇక ఆపిలుపును అమలులో పెట్టాల్సిందే! అని తీర్మానించుకున్నాడట. వెంటనే తన భజన బృందాన్ని పిలిపించాడు. 
హాజరైన అమాత్య బృందం సార్! అంటూ వరుసలో నిలబడ్డారు. వెంటనే బాబుకి చిర్రెత్తుకొచ్చింది. ఇకపై నన్ను సార్, అయ్యా! బాబు గారూ! అని పిలవద్దు అని గట్టిగా గదమాయించాడు. అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. వెంటనే లోకేష్ ని అందరూ పిలుచుకుంటున్న ‘పప్పు’ పేరు గుర్తొచ్చింది అక్కడున్నవారందరికీ. ఫ్రెండ్ షిప్ కొద్దీ ఏమని పిలవమంటాడో ఏమో! పొరపాటున అమరావతి అని పిలవమనడు కదా! అనుకున్నారు. 
చంద్రబాబు సీరియస్ గా చూస్తూం ఇకపై నన్ను అందరూ 'చంద్రన్నా'! అని పిలవాలి అన్నాడు. అందరూ గుడ్డిలో మెల్ల అనుకుని ఊపిరిపీల్చుకున్నారు. నేను పిలిచినా అలాగే పలకాలి, నన్ను పిలిచినా అలాగే పిలవాలి. నాగురించి జనంలో మాట్లాడినా అలాగే సంబోధించాలి అని హుకుం జారీ చేశాడు బాబు. విషయం అర్థమైన బృందం అలాగే సార్! అనబోయి నాలుక్కరుచుకుని.. అలాగే చంద్రన్నా అన్నారు. ఆ పిలుపు విని రాజధాని కట్టినంత ఆనంద పడిపోయాడు బాబు.
కథ అక్కడితో ఆగలేదు. అలా చెప్పినప్పటినుంచి తనను ఆమాత్రం పలకరించేవాళ్లు కూడా తగ్గిపోయారు. బాబుకి అనుమానం వచ్చింది. ఇక తప్పనిసరి చేయాలంటే ప్రభుత్వ పథకాలకు చంద్రన్న అనే పేరు తగిలిస్తే సరి అనుకున్నాడు. అప్పుడు తప్పనిసరిగా అందరూ తనను చంద్రన్నా అని పిలవాల్సిందే కదా! అని ప్లాన్ వేశాడు. మొత్తానికి పిల్లనిచ్చిన అన్నగారి బొమ్మ, పేరు కూడా అటకెక్కించి ఆ స్థానంలో తన ఒక్కగానొక్క చిరునవ్వుల ఫొటోని ముద్రించి చంద్రన్న పేరుతో పథకాలను ప్రచారం చేయడం మొదలుపెట్టించాడు. 
అయినాసరే బాబుగారికి ఎక్కడా ప్రజల్లో ఆపేరు వినిపించడంలేదు. ఇంతకు ముందు బాగా పాపులర్ అయిన పిలుపులే తప్ప చంద్రన్నా అనే పిలుపు జనంలో ఎక్కడా సడిలేదు. 
అన్నా అని, అమ్మా అని, తండ్రీ అని పిలవాలనేది ప్రజల మనసులోంచి రావాలని, మనసులు గెలుచుకుంటే వచ్చేదని గ్రహించని  బాబు వాతలు పెట్టుకుంటూ ఉన్నాడు. ఆ మచ్చలే పులిచారలనుకుని భ్రమపడుతూ, అప్పుడప్పుడూ తెల్లవారుజామున నిజం తెలిసి బాధపడుతూ గడిపేస్తున్నాడు. 
Back to Top