వైద్య అనారోగ్యశాఖ స్పెషల్..

*వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేనికి తన శాఖ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనిపించింది. పిఎని పిలిచి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇమ్మన్నాడు.

*"సార్ మన శాఖ పేరులోనే లొసుగులున్నాయి. వైద్యం వల్ల అనారోగ్యం..అనారోగ్యం వల్ల వైద్యం అభివృద్ధి చెందుతున్నాయి. మన పాలనలో వైద్యం, ఆరోగ్యం రెండూ వేర్వేరు విషయాలైనప్పుడు వైద్య ఆరోగ్యశాఖ అనడం ఎంతవరకూ న్యాయం?" అని అడిగాడు పిఎ.

ఇప్పుడు నేను అర్థాలు అడగలేదు, ఆస్పత్రులు ఎలా ఉన్నాయని అడుగుతున్నాను అన్నారు మంత్రి.

*"పదండి చూద్దురుగానీ" అని ఒక ప్రభుత్వాసుపత్రికి ఇద్దరూ మారు వేషంలో వెళ్లారు. ఎంట్రన్స్ లోనే ఒకాయన ఆస్పత్రిని బండబూతులు
తిడుతూ కనిపించాడు. 

"ఏం జరిగింది" అని అడిగాడు మంత్రి

*"కుక్క కరిచింది సార్, ఇంజక్షన్ లేవంటున్నారు" అని చెప్పాడు కుక్క బాధితుడు.

"కుక్క ఎక్కడ కరిచింది"

*"ఆస్పత్రిలోనే కరిచింది సార్ జ్వరానికి మందుకోసం వస్తే కరిచింది"

*"ఆస్పత్రిలోకి కుక్కలు కూడా వస్తున్నాయా..? "అడిగాడు మంత్రి పిఎని

*వెటర్నరీ డిపార్ట్ మెంట్ పబ్లిక్ హెల్త్ తో కలిసిపోయింది సార్. ఆస్పత్రుల్లో కుక్కలు, పిల్లులు,బల్లులు ,నల్లులు సర్వసాధారణం సార్ అని చెప్పాడు పిఎ.

*ఇద్దరూ జనరల్ వార్డులోకి వెళ్లారు. అక్కడ బోలెడన్ని ఎలుకలు శిఖరాగ్రసమావేశంలో ఉన్నాయి. మంత్రిని చూసి కూడా భయపడకుండా మీటింగ్ ని కంటిన్యూ చేసాయి.

"ఏంటవి..?" భయంగా అడిగాడు.

*"ఎలుకలు సార్, ఒకప్పుడు ఆఫీసుల్లోనే ఉండేవి. ఇప్పుడు  ఆస్పత్రుల్లోకి కూడా వచ్చేసాయి."

"వాటికేమైనా జబ్బా..?"

*జనంలా, అవి తెలివి తక్కువ్వి కావు. జబ్బు చేస్తే ఆస్పత్రికి రావడానికి. ఆర్థోవార్డుకి వెళదాం పదండి. అక్కడ పందికొక్కులు కూడా వుంటాయి. చెయ్యి విరిగితే వేసే కట్టుతో పాటు పందికొక్కు కరిస్తే కట్టేకట్టు బోనస్

ఇంతలో ఒక పిల్లి వచ్చి వార్డంతా రౌండ్స్ వేసింది.

*"పిల్లిసార్, డాక్టర్ వచ్చినా రాకపోయినా అది మాత్రం రెగ్యులర్ గా రౌండ్స్ కి వస్తుంది."

తొందరగా వెళదాం పద, లేదంటే అది మనల్ని కరచినా కరుస్తుంది.

*"మన గవర్నమెంట్ లాగా, దానికేం పిచ్చెక్కలేదు సార్, పాలు దొరకనప్పుడే అది కరుస్తుంది."

*ఇంకో వార్డుకెళితే అక్కడో రోగి కాళ్లు చేతులు కొట్టుకుంటున్నాడు

ఆయనకి సుగర్ లేకపోయినా సుగర్ ఉందని  తేల్చిచెప్పారు. కమిషన్ల కోసం కొన్న గ్లూకోమీటర్లలో రీడింగ్ అలాగే వుంటుంది సార్, వాటిని  నమ్మి ట్రీట్ మెంట్ తీసుకున్న ఎందరో షాక్ ట్రీట్ మెంట్ కి గురయ్యారు. అని చెప్పాడు పిఎ.

*"తొందరగా ఇక్కన్నుంచి వెళదాం పద" అన్నాడు మంత్రి

*"కార్పొరేట్ ఆస్పత్రులే తప్ప,  మామూలు ఆస్పత్రులు ఎలా వుంటాయో మీకు చూపిద్దామని ఇక్కడకు తెచ్చాను సార్. రైతులు అనవసరంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ ఒక్కసారి  మన ఆస్పత్రికి వస్తే ఖర్చులేకుండా కోరిక నెరవేరుతుంది"

*మంత్రి షాక్ తో పడిపోతే, ఆయన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో  చేర్చకుండా పిఎ జాగ్రత్త పడ్డాడు.
Back to Top