వేరుపురుగు చూడ...

చెద పురుగుల సమావేశం జరుగుతోంది. దానికి అధ్యక్షత వహించమని వేరు పురుగును పిలిచారు. పంటలనాశించే  చీడపురుగులన్నీ సభలో వచ్చి కూర్చున్నాయి. వేరు పురుగు తన ప్రసంగం మొదలెట్టింది. ఈ సమావేశం  చాలా ముఖ్యమైనది. మన మీద పెత్తనం చెలాయిస్తున్న మనుషులకు వ్యతిరేకంగా మనం ఒక్కటవ్వాలి. మనం ఎంత కష్టపడుతున్నామో, ఎంత శ్రమిస్తున్నామో అయినా మనుషులు మనను మెచ్చుకోవడం లేదు. మహా మహా దూలాలని మట్టి చేయగల చెద పురుగులను తిడుతున్నారు. ఎట్టాంటి పంటనైనా పాడుచేయగల చీడలను ఛీ కొడుతున్నారు. మహా వృక్షాలనే కూల్చేసే నాలాంటి వేరు పురుగుకు విలువ లేకుండా పోతోంది. మనుషలందరి ప్రేమా ఒక్క గొంగళిపురుగుపై మాత్రమే ఉంటోంది. ఆ గొంగళిపురుగే రేపటి మా సీతాకోక చిలుక అని మురిసిపోతున్నారు.

రంగురంగుల కలలు కంటున్నారు. అందమైన రేపటిని ఊహించుకుంటున్నారు. మన ఉనికే ప్రమాదంలో పడబోతోంది. మన పురుగు సంతతికి పోయేకాలం దాపురించేలా ఉంది. కనుక మనమంతా ఒక్కటిగా నిలిచి గొంగళిపురుగు అంతానికి కృషిచేద్దాం. అది ఎదిగి సీతాకోకై మనుషుల మనసులు గెలిచేలోపే చిదిమేద్దాం అని ఆవేశంగా ప్రసంగించింది వేరుపురుగు. మిగిలిన పురుగులన్నీ దానికి వంతపాడాయి. అవును అలాగే చేద్దాం అన్నాయి. ఈ ఆపరేషన్ కు మనం ఓ పేరుపెట్టాలి అంది ఆ పురుగుల్లో కొత్తగా చేరిన పేడపురుగు. అదేమిటో నువ్వే చెప్పు అంది వేరుపురుగు. ఆపరేషన్ గొల్లభామ...గొల్లభామ ద్వారానే మనం ఆ గొంగళిపురుగుకు చెక్ పెడదాం. ఎలాగూ జాతి వైరం ఉంది కనుక ఎవ్వరూ పట్టించుకోరు అంది పేడపురుగు. 

వెంటనే గొల్లభామను సంప్రదించారు. దాని చేతికి ఈతముల్లు ఇచ్చారు. దాంతో గొంగళిపురుగును ఎలా చంపాలో ట్రైనింగ్ ఇచ్చారు. సరేనంది గొల్లభామ. రోజూ గొంగళిపురుగు వెళ్లే దారిలో కాపు కాసి కదలికలు కనిపెట్టింది. ఓరోజు హఠాత్తుగా మీదపడి ముల్లుదింపబోయింది. కానీ ఆ గొంగళిపురుగు తృటిలో తప్పించుకుంది. పారిపోవాలనుకున్న గొల్లభామ కాస్తా హడావిడిలో సాలె గూటిలో చిక్కుకుపోయింది. ఏ నిమిషమైనా సాలీడుకు ఆహారం అయిపోయే పరిస్థితి వచ్చింది. దాడి నుంచి తప్పించుకున్న గొంగళిపురుగు సీతాకోకగా మారేదిశగా...తన ప్రయాణం సాగించింది. 
 

Back to Top