ఓటుకు నోటులో ఇరుక్కుపోయి ఆటుపోట్లకు గురవడానికి కారణం వాస్తులోపమేనని చంద్రబాబుకి అనుమానమొచ్చింది. సెక్రట్రిని పిలిచి `` పార్టీలో ఎందరికో వాయిస్ లేకుండా చేసిన నేను వాయిస్ టెస్ట్‌లో ఇరుక్కోవడం ఆశ్చర్యంగా ఉంది కదా..!`` అన్నాడు
బాబు మనసుని గ్రహించిన పిఏ `` సార్, ముందు నుంచి మీరు వాస్తుని నమ్ముకున్నారు. అదిప్పుడు వాంపైర్‌లా మన మీద తిరగబడింది. మీకు ఉత్తరం, దక్షిణం దిక్కులు కలిసొచ్చాయి. ఉత్తరమంటే రికమెండేషన్. ఎన్టీయార్ అల్లుడు అనే రికమెండేషన్ వల్ల పార్టీలో మీరు దశమగ్రహంగా తిష్ట వేశారు. దక్షిణం గురించి మీకు చెబితే తాతకు దగ్గులు నేర్పించినట్టు అన్నమాట. ఎవర్నయినా డబ్బుతో కొనవచ్చనేది మీ సిద్దాంతం, మొన్నకూడా ఇదే సిద్దాంతాన్ని అమలు చేసి రేవంత్‌రెడ్డిని జైలుకి పంపారు. ఇక తూర్పు..... మీరు తప్పుచేసి ఎదుటివాళ్ళని తూర్పార పట్టడం మీకు వెన్నతో పెట్టిన విద్య, పడమర మీకు కలిసొచ్చిన దిక్కు ఎన్టీయార్ దగ్గర చేరి ఎందరో రాజకీయ జీవితాల్ని మీరు పడమటికి పంపారు. చివరికి ఎన్టీయార్ కూడా అర్ధాంతరంగా పడమర అస్తమించాల్సి వచ్చింది`` అన్నాడు.
``చరిత్ర కాదు, వర్తమానం చెప్పు`` అన్నాడు బాబు విసుగ్గా.
`` ఇంట్లో నుంచి బయటకి వచ్చేటపుడు నైరుతి దిశలోంచి వస్తే బాగుంటుంది. మతి వున్నవాడికి నైరుతి అయినా ఒకటే ఆగ్నేయమైనా ఒకటే, మీరు దీనికి మినహాయింపు, మీరు ఎట్నుంచి ఎటు అడుగులేసినా రాష్ట్రం ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదని అందరికీ తెలుసు. సంవత్సరం నుంచి ఒకటే మాట.. లేస్తే మనిషిని కానని అంటున్నారు. మీరు పైకి లేవరని అందరికీ అర్తమైంది. ఇక ఆగ్నేయ దిశగా ప్రయోగాలు చేయండి. రాష్ట్రం చీకట్లో ప్రయోగిస్తునపుడు మీరు ఏ దిశగా ప్రయోణించినా ఒరిగేదేమీలేదు.
కారులో ఎక్కేటపుడు ఈశాన్యానికి దండం పెట్టి ఎక్కండి. దండం దశగుణం అన్నారు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరు కోదండం వేయించబోతున్నారు. వాయవ్యం మనకు అన్ని విధాల అచ్చు వచ్చిన దిశ, వాయువు అంటే గాలి అంటే గ్యాస్, గ్యాస్ మాటలు చెప్పడం మనల్ని మించిన వాడులేడు. సినిమాల్లోడబ్బింగ్ చెప్పినట్టు మనల్ని మించినవాడులేడు. సినిమాల్లో డబ్బింగ్ చెప్పినట్టు స్టీఫన్‌సన్ తో గంభీరంగా మాట్లాడీ అది నా గొంతు కాదు కట్ అండ్ పేస్ట్ అంటున్నారే... దీనికి మించిన గ్యాస్ వుంటుందా?`` అన్నాడు సదరు సెక్రట్రీ.
`` వాస్తు గురించి అడిగితే వాస్తవాలు చెబుతావా?`` అని కర్ర తీసుకున్నాడు బాబు.
- రాహుల్