<br/>నాటకాల ట్రూపులు ఉండేవి పూర్వం. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. ఆ నాటక సంస్థలు నవరసాలు ఒలికిస్తూ ప్రతి ఊర్లోనూ నాటకాలు వేసేవి. ప్రజలు తండోపతండాలుగా వచ్చి, వాటిని చూసి ఆనందిస్తే చిల్లర చదివింపులు, విసిగిస్తే చెప్పులు విసిరేవారు. ఇప్పుడు ఆ నాటక సమాజాలు దాదాపుగా కనుమరుగయిపోయాయి. కానీ నారావారి డ్రామా కంపెనీ మాత్రం తిరుగులేకుండా ఊరూరా ఆడేస్తోంది. ఈమధ్య ధర్మపోరాట దీక్ష అనే నాటకాన్ని ప్రతి జిల్లాలోనూ ఆడించేస్తున్నాడు చంద్రబాబు. ఈ ధర్మపోరాట దీక్ష నాటకంలో ప్రతి పాత్రా ఓ ఆస్కార్ అందుకోగల పాత్రే. ఒకే నాటకాన్ని ఊరూరా ఆడించి ఉత్తమ నందులు గెలుచుకున్నట్టు, చంద్రబాబు కూడా ఒకే నాటకాన్ని రాష్ట్రమంతా ఆడి ఆడియన్స్ అసహనాన్ని మూటకట్టుకుంటున్నాడు. ప్రతి నాటకంలో ముందు భగవంతుణ్ణి స్తుతిస్తారు. బాబుగారి ధర్మపోరాట దీక్ష అనే నాటకంలో బాబునే భగవంతుడిగా భావించి తెలుగు తమ్ముళ్లు వివిధ రకాల స్తోత్రపాఠాలతో కీర్తిస్తుంటారు. కొన్ని నాటకాల్లో నిందాస్తుతితో పద్యాలుంటాయి. అంటే తిడుతూ పొగడటం అన్నమాట. ఇలాంటి ప్రత్యేకమైన పాత్రకోసం జెసి దివాకర్ రెడ్డి ఫేమస్. స్టేజ్ మీద నిలబడి చంద్రబాబును తెగ పొగుడుతూ తెగడుతూ సన్నివేశాన్ని రక్తి కట్టిస్తుంటాడు. మిగిలిన పాత్రలు కూడా పాత్రోచితంగా బాబును పొగడుట, కేంద్రాన్ని తెగడుట, ప్రతిపక్షాన్ని దుమ్మెత్తిపోయుట అనే స్క్రిప్టును బట్టీపట్టి పొల్లుపోకుండా అప్పజెబుతుంటాయి. రకరకాల పాత్రల పరిచయ ప్రహసనం తర్వాత ముఖ్యపాత్రల రంగప్రవేశం జరుగుతుంది. ముందు లోకేషు, ఆ తర్వాత చంద్రబాబు తమ తమ నట విశ్వరూపాన్ని నందమూరి తారకరామారావును తలదన్నేలా ప్రదర్శిస్తారు. కేంద్రం చేస్తున్న మోసం పై మొసలి కన్నీళ్లతో కరుణ రసం, మోదీపై యద్ధంతో రౌద్రరసం, సమరశంఖం పూరించండి తమ్ముళ్లూ అంటూ వీర రసం, చిత్రమైన హావభావాలతో, విచిత్రమైన పదాలతో, తలతిక్కల భావాలతో అద్భుత రసం, అతిశయాలు, నాలుకమడతల హాస్యరసం, ప్రతిపక్ష నాయకుడిపై కన్నెర్ర చేస్తూ భయానక రసం, ఇలా నవరసాలు ఒలికిస్తూ నాటకాన్ని రక్తి కట్టిస్తారు.నారాట్రూపు వారి ఈ నవరస నాటకానికి కడప జిల్లా ఈసారి వేదికైంది. పాపం గత కొన్నాళ్లుగా ఇక్కడ ఏర్పాటు చేద్దామనుకుంటున్న ధర్మపోరాట దీక్షా నాటకానికి ప్రకృతి పరిస్థితులూ చాన్నాళ్లుగా అనుకూలించలేదు. చివరకి పెద్ద తుఫానుతో కట్టిన వేదిక కూడా కూలిపోయింది. కానీ పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపై ఉన్న శవాన్ని భుజాన వేసుకున్నట్టు, చంద్రబాబు కూడా దీక్షా నాటకాన్ని ఎలాగైనా ప్రదర్శించాలని కంకణం కట్టుకుని, పొద్దుటూరులో సభ పెట్టనే పెట్టారు. ఎప్పటిలాగే ఈ ప్రాంతంలోనూ తన నటనాచాతుర్యంతో ఆహుతులను అలరించారు. నాటకం పూర్తి అయ్యాక నటీనటుల్లో చాలా బాగా నటించిన వారికి చదివింపులు ఉంటాయి. బాగా పద్యాలు పాడిన వారికి అభినందనలు, సత్కారాలు దక్కుతాయి. నారాట్రూపుకు కూడా అలాంటి కళాభినందనలు దక్కుతున్నాయి. ఇంతటి నటనాచాతుర్యం చంద్రబాబులో ఉందా అని ఆహుతులతో పాటు ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఓట్లతో రేపు బాబు సీట్లను చింపేసి ఈ నటనకు తగ్గ బహుమతి అందిస్తామంటున్నారు..<br/>