తిక్కల మేళం - తప్పుల తాళం

తిక్కల మేళం - తప్పుల తాళం గురించి
వినే ఉంటారు. చంద్రబాబు మాటలకు చేతలకు అది చక్కగా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ
దినోత్సవం జరపనని ముఖ్యమంత్రిగారే నిర్ణయం తీసేసుకున్నారు. ప్రజలకు ఉండే రాజ్యాగ
పరమైన హక్కును కాలరాసే అధికారం ఓ ముఖ్యమంత్రికి మాత్రం ఉంటుందా? చూడబోతే మొన్నాయన చెప్పుకున్నట్టు
బ్రిటిష్ వారితో, పోరాడిన వారి జాబితాలో, తెలుగుదేశం పేరు లేనందుకు అలిగి స్వాతంత్ర్యదినోత్సవ
వేడుకలు కూడా చేయను పొమ్మంటాడేమో మరి.

ఈ సంగతులలా ఉంచితే అసలు
నవ్యాంధ్రప్రదేశ్ అవరణ దినోత్సవాన్ని ప్రకటించింది చంద్రబాబే. అక్కడ తెలంగాణా రాష్ట్రం
కొత్తగా ఏర్పడి జూన్ 2 ను రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జురుపుకుంటుంటే, తగుదునమ్మా అంటూ మాదీ
కొత్తరాష్ట్రమే, మేమూ అదే రోజు జరుపుతాం అన్నది ఈ డ్యాష్ బోర్డు సిఎమ్.గారే. నేడు ఈ అవతరణ దినోత్సవం
జరపడం అసమంజసం అంటున్నదీ ఇదే సిఎమ్.గారు. రాష్ట్రానికి అన్యాయం జరిగినందుకు గాను రాష్ట్ర అవతరణ
దినోత్సవాన్ని జరపడం సమంజసం కాదని ఈ అభినవ బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యిందట. అసలు ఆంధ్రప్రదేశ్ కొత్త
రాష్ట్రం ఎలా అవుతుంది? మద్రాసునుంచి విడిపోయి ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది అక్టోబర్ 1, 1953న. తెలంగాణాతో కలిసి ఆంధ్రప్రదేశ్
గా అవతరించింది నవంబర్ 1, 1956న. తెలంగాణా ప్రాంతం ఆంధ్రరాష్ట్రంతో కలిసి, తిరిగి ఓ రాష్ట్రంగా
విడిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం అలాగే ఉంది. అందులోని కొద్ది భాగం విడివడితే, విడిపడ్డ ప్రాంతం కొత్తగా
అవతరణదినోత్సవాన్ని జరుపుకుందంటే అర్థం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ను కూడా కొత్త రాష్ట్రంగా పరిగణించి, తెలంగాణా అవతరణ దినోత్సవం
రోజునే ఎపికి కూడా అవతరణ దినోత్సవంగా పరిగణిస్తామని చంద్రబాబు మంత్రివర్గ భేటీలో నిర్ణయం
తీసుకోవడం తుగ్లక్ తరహా నిర్ణయం కాకపోతే మరేమిటి.

పోనీ ఆంధ్రప్రదేశ్ ను
కూడా కొత్త రాష్ట్రంగానే పరిగణించినా నవంబర్ 1నే అవతరణ దినోత్సవంగా జరుపుకోవడం వల్ల వచ్చే నష్టం
ఏమిటి? కానీ చంద్రబాబు కు ఏదో ఒక కొత్త విషయం కావాలి. దాన్ని అడ్డుపెట్టుకుని
రాజకీయం నడపాలి. ఇది మాత్రమే ఆయన ఆలోచనలకు మూలం. చరిత్ర, దాని ప్రాధాన్యత, ప్రజల మనోభావాలు, సెంటిమెంట్ ఇవేమీ ఆయనకు అక్కర్లేదు. ఇప్పుడు కూడా అందుకే
జూన్ 2 అని తాను నిర్ణయించిన అవతరణ దినోత్సవాన్ని కూడా జరపనంటూ కొత్త ప్రచారానికి
తెరతీస్తున్నాడు. అసలు రాష్ట్రవిభజన పాపంలో చంద్రబాబు భాగస్వామ్యం చాలా పెద్దది. తాను చేసిన అన్యాయానికి, నేడు తానే విపరీతంగా
బాధపడుతున్నట్టు నటించడం ఆయనకే చెల్లింది. నాలుగేళ్లు ఎపికి అన్యాయం జరుగుతోందని వగస్తున్న చంద్రబాబు, ఎన్డీఎతో కలిసి, రాష్ట్ర ప్రయోజనాలను
కాలరాసింది తన నిర్లక్ష్యంతోనే అన్న విషయాన్ని మరుగు పరచాలని శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. దీక్షలు, ధర్నాలు, ర్యాలీల నాటకాలు రక్తి
కట్టకపోవడంతో, మళ్లీ నవనిర్మాణ దీక్ష పాటందుకున్నాడు. ఓ పక్క రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెబుతూ అవతరణ
దినోత్సవం జరపను అన్న నోటితోనే, నాలుగేళ్లుగా 
జరిగినఅభివృద్ధిని ప్రజలకు అంకితమిస్తానంటున్నాడు. జూన్  2 నుంచీ 8 వరకూ నవనిర్మాణ దీక్షలో భాగంగా 12000 గ్రామాల్లో ప్రతిరోజూ
ఒక్కో అంశం మీద వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని హుకుం జారీ
చేసాడు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అవతరణ దినోత్సవం మానేసి, ఊరూరా వేడుకలు చేద్దామనే
ముఖ్యమంత్రిని ఒక్క ఎపిలోనే చూడగలం. తుగ్లక్ కి తమ్ముడిలా, ఔరంగజేబుకు అన్నయ్యలా
చంద్రబాబు తీరు రెండు నాల్కల సిద్ధాంతానికి నిలువెత్తు నిదర్శనంలా ఉందనడంలో అబద్ధం
ఏముంది చెప్పండి!!!

Back to Top