వీళ్లు తేడా

అనగనగా ఓ రాష్ట్రం. ఆ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, ఇంకొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు ప్రజలు ఉన్నారు. ఏ రాష్ట్రంలోనైనా వీళ్లేగా ఉంటారు అని డౌట్ పడకండి. అన్ని రాష్ట్రాల్లోలా ఈ రాష్ట్రంలోనూ ప్రజలున్నారు. కానీ ఏ రాష్ట్రంలోనూ లేనట్టున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు ఇంకా ఎమ్మెల్యేలు. అలా ఎందుకంటున్నామో మీరే చూడండి. వీళ్లు తేడా అని మీరే ఒప్పుకుంటారు.

వెనకాపల్లి విత్తనమేళాకు వచ్చేడు వ్యవసాయ శాఖామంత్రి సోదిరెడ్డి. ఆయనే ఆ కార్యక్రమంలో ముఖ్య అతిధి. మంత్రిగారొస్తున్నారని తెలిసి తమ కష్టాలు చెప్పుకుందామని వచ్చారు కొందరు. ఆయన వేదిక ఎక్కబోతుంటే వచ్చి తమ కష్టాలు చెప్పుకున్నారు. సార్ పక్కూళ్లో ఉన్న చక్కెర ఫ్యాక్టరీ కార్మికులం సర్, మూడు నెల్లుగా మాకు జీతాలు ఇవ్వడం లేదు, ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నారు కాస్త చూడండి సార్ బ్రతిమాలారు కార్మికులు. సరే సరే మాట్లాడదాం అని వేదికెక్కేశారు మంత్రిగారు. తమ సమస్య గురించి బహిరంగంగా మాట్లాడి హామీ ఇస్తారని ఎదురు చూస్తున్నారు కార్మికులు. మంత్రిగారు తను రాసి తెచ్చుకున్న స్పీచ్ చదివేసి వేదిక దిగి వెళ్లిపోతున్నారు. అది చూసి ఆశ్చర్యపోయారు కార్మికులు. సార్ మంత్రిగారో సోదిరెడ్డి గారో..మా గొడవ సంగతేంజేసారు. మాకు న్యాయం చేస్తారా లేదా అని గట్టిగా కేకలు పెట్టారు. కారెక్కబోతున్న సోదిరెడ్డి ఆగి వెనక్కి తిరిగారు. ఇదిగో నాకసలే తిక్కెక్కువ. కదిపితే సోదెక్కువ. ఆట్టే మాట్లాడారంటే మీకసలు జీతాలే రాకుండా చేస్తా ఏమనుకున్నారో...అని కారెక్కి చక్కాపోయాడు.
తాగండి తైతక్కలాడండి వైన్ షాప్ ప్రారంభోత్సవానికి వచ్చాడు ఎమ్మెల్యే గూండా రమ. వారం రోజులుగా తిరుగుతున్నా దొరకని ఎమ్మెల్యే కోసం అక్కడ కాచుకుని ఉన్న ఓ కుటుంబం వెళ్లి ఆయన్ని కలిసారు. సార్ మీ అనుచరులంట మా స్థలం చుట్టూ ప్రహరీ కట్టి, లోపల షెడ్డు వేసి కూర్చున్నారు. అది మా తాతయ్య స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్నందుకు ప్రభుత్వం ఆయనకిచ్చిన స్థలం. మాకదే ఆధారం. మా స్థలంలోకి వెళితే మమ్మల్ని బెదిరిస్తున్నారు, కాస్త మీరైనా చెప్పండి సారూ అంటూ మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రభుత్వంలో ఉండేది ఎవరు? ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరు. అదంతా మేమే కదా. కనుక ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వంలో ఉన్న నాయకుడు తీసుకుంటే తప్పేం కాదు. మీరు బయల్దేరండి. కాదని గొడవ చేస్తే అంతు చూస్తా అని వెళ్లిపోయాడు ఎమ్మెల్యే గూండా రమ.
’నీరు మీరు మధ్యలో కాంట్రాక్టరు’ కార్యక్రమానికి విచ్చేశారు ముఖ్యమంత్రి కంత్రీబాబు రాయడు. ఆయన ప్రసంగం మొదలయ్యే లోపే కొందరు లేచి అడ్డు తగిలారు. ఎన్నికలప్పుడు మీరిచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరలేదు అని అడిగారు. మా రిజర్వేషన్ల సంగతేం చేసారు ఇంకొదరు అడిగారు. లక్షల ఉద్యోగాలన్నారూ ఒక్కటీ రాలేదు ఆవేశపడ్డారు ఇంకొందరు. ముఖ్యమంత్రికి కోపం ముంచుకొచ్చింది. అంతే కస్సుమని లేచారు ’ఏం మాట్లాడుతున్నారు. తమాషాలు చేయకండి. నా దగ్గర వేషాలేయకండి. నన్నే ప్రశ్నిస్తారా. అలా అయితే నే వేసే రోడ్డుమీద నడవొద్దు. నేనిచ్చే ఫించన్లు తీసుకోవద్దు. అట్టే మాట్లాడితే మిమ్మల్ని ఓట్లే వేయనీయను. పోన్లే ఏదో నాకే ఓటేస్తారని ఎలక్షన్లు జరిపిస్తున్నాం. మరీ గొడవ చేసారంటే అసలు ఓట్లే వేయనీకుండా చేస్తా. అసలు ఎన్నికలే పీకి పారేస్తా. ఖబడ్దార్ ఏమనుకున్నారో’ అని వేదిక దిగి వెళ్లిపోయారు.
ఇక ఆ రాష్ట్రం, ఆ రాష్ట్రం ఆలోచించడం మొదలెట్టింది. తన అనుభవాలన్నీ గుర్తు చేసుకుంది. ఏం చేయాలో నిర్ణయించుకుంది. ఒక్కో అడుగూ ముందుకేస్తూ మార్పుదిశగా నడవడం మొదలు పెట్టింది.

Back to Top