తలచినదే జరిగినదా??

చంద్రబాబు చాతుర్యాన్ని మెచ్చుకుని తీరాలంటున్నారో సీనియర్ నాయకుడు. ఎందుకని ఆరాతీద్దుం కదా తిమ్మిని బమ్మిని చేసి మాట్టాడే చంద్ర బాబు విద్యను చూసి మూర్ఛపోయినంత పనైందని చెప్పుకొచ్చాడా నాయకుడు. నవ నిర్మాణ దీక్షలు, నీరు చెట్టు, రచ్చబండ, ప్రాజెక్టుల శంకుస్థాపనల పేరుతో ప్రజల్లోకి వెళ్లిన చంద్రబాబుకు ప్రజల అసంతృప్తి, నిరసనల తెగ మహా వేడిగా తాకింది. దాంతో తనకు ఎదురౌతున్న నెగిటివ్ ఇష్యూలను డైవర్టు చేయాలని చంద్రబాబు తెగ తాపత్రయ పడుతున్నాడు. ఈ విషయం మీడియావాళ్లు పసిగడతారనుకున్నాడేమో ‘ఏ ఊరు వెళ్లినా తిరిగి రాబుద్ధి కావడం లే’దంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. వెళ్లిన చోటల్లా చంద్రబాబును దిగ్భంధించి మరీ సమస్యల గురించి నిలదీస్తున్న ప్రజల తీరును బాబుగారు ఇలా పొలైట్ గా చెప్పుకుంటున్నారని అన్నారా సీనియర్ పొలిటీషియన్.
రాజధాని నిర్మాణాలు లేకపోయినా, రాష్ట్రంలో చెప్పుకోదగ్గ నిర్మాణాలు జరక్కపోయినా ఏటా నవనిర్మాణ దీక్షలు, ప్రతిజ్ఞలు అప్రతిహతంగా సాగిపోతున్నాయి. నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ దీక్షలకు రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలకు కరువొచ్చింది. సభల్లో జనాలు ఉండటం లేదు. స్వయంగా చంద్రబాబు పర్యటనలు చేసిన చోట, నీరుచెట్టు, రచ్చబండ కార్యక్రమాలకు కూడా పెద్దగా స్పందన ఉండటం లేదు. అధికారులు తంటాలు పడి, కొందర్ని తీసుకు వస్తే వారేమో చంద్రబాబును ముఖానే కడిగి పారేస్తున్నారు. ఇలా రెండు మూడు అనుభవాలు కాగానే చంద్రబాబు నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించాడు. ప్రతి ఊరూ అభివృద్ధి చెందిందని, మౌలికావసరాలన్నీ తీరి ఊళ్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయనే కలరింగ్ ఇచ్చేందుకు తెగ ట్రైచేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు తనకు ఊళ్లలో ఎదురౌతున్న అవమానాలను కవర్  చేసుకోవడానికి కొత్త స్క్రప్టు రాసుకోవాల్సి వచ్చింది. ప్రతి ఊరు అందంగా, అద్దంలా, రోడ్లతో ముద్దుగా ఉందని, వెళ్లిన చోటునుంచి తిరిగి రాబుద్ధి కాలేదని చెప్పుకుంటున్నాడు. రోడ్లు, పారిశుధ్యం, డ్రైనేజీ అంతా బావున్నాయని తనకి తానే కితాబిచ్చుకున్నాడు కూడా. మరి అభివృద్ధి అంత బావుండి, ఊళ్లన్నీ అంత గొప్పగా ఉంటే వెళ్లిన చోటల్లా చంద్రబాబును ప్రజలు చేటలో వేసి ఎందుకు చెరుగుతున్నట్టో? ప్రజల్లో తనపై ఉన్న వ్యతిరేకతను కూడా అనుకూలతలా చెప్పుకోవడానికి బాబు పడుతున్న తంటాలు చూసి ’తలచినదే జరిగినదా దైవం ఎందులకూ’  అంటూ పాటేసుకుంటున్నార్ట తెలుగుతమ్ముళ్లు. 

 
Back to Top