చెంబుడు మట్టి..చెంబుడు నీళ్లు...

జనం చెవిలో చంద్రబాబు పూలు
------------------------
పట్టువదలని విక్రమార్కుడు  నెమ్మది నెమ్మదిగా  అడుగులో అడుగేసుకుంటూ స్మశానంలో సాగిపోతున్నాడు. పరధ్యానంగా వెళ్తోన్న విక్రమార్కుని చూడగానే బేతాళుడికి  నవ్వొచ్చింది.
"ఏంటి విక్రమార్కా  ఏంటి నిద్రట్లో నడుచుకుంటూ వెళ్తోన్నట్లు అలా  వెళ్తున్నావేంటి ఓ ఉలుకూ పలుకూ లేకుండా" అని ఆరా తీశాడు.
"ఏం లేదు బేతాళా   రెండు రోజులుగా అస్సలు నిద్రలేదు. నిన్ను చూసి చాలా కాలమైంది కదా అని  ఇలా వచ్చేశాను. నీ కథ వినేస్తే ఓ పనైపోతుంది కదా అందుకే ఇలా వచ్చానన్నమాట" అన్నాడు.
బేతాళుడు  గొంతు సవరించుకుని
"అయితే  విను విక్రమార్కా..!  మొన్నామధ్య  దసరా పండగ రోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి శంకుస్థాపన అని చెప్పి చాలా   పెద్ద కార్యక్రమం నిర్వహించారు కదా. అపుడు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వచ్చారు. చంద్రబాబు కు   ఓ  చెంబుతో పార్లమెంటు మట్టి..ఇంకో చెంబుతో యమునా నది నీళ్లూ కూడా తెచ్చి ఇచ్చారు. ఆ సమయంలోనే ప్రధానిని ప్రత్యేక హోదా ఇవ్వండని అడిగి ఉంటే   పని అయిపోయేది. కానీ చంద్రబాబు నాయుడు అప్పుడు అడగలేదు. ఈ విషయం మీడియాలో ఇష్యూ కాగానే...చంద్రబాబు నాయుడు ఏమన్నారు? ఇంకో పది పదిహేను రోజుల్లో నీతి అయోగ్  నివేదిక ఇచ్చేస్తుంది
..అప్పుడు ప్రత్యేక హోదా వచ్చేస్తుంది అని అన్నారు. పైగా ప్రత్యేక హోదాతో పాటు  ప్రత్యేక ప్యాకేజీ కూడా తెస్తామన్నారు. మరి  అది జరిగి నెలరోజులైపోయింది కదా... ఇంతకీ నీతి అయోగ్ మీటింగ్ కాలేదా?  లేక నీతి అయోగ్  నివేదిక ఇవ్వలేదా? లేక అసలు ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఎవరూ పట్టించుకోవడం లేదా? ఈప్రశ్నలకు సమాధానాలు తెలిసీ కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి ముక్కలైపోతుంది " అని బేతాళుడు  కథ ముగించాడు.
విక్రమార్కుడు  ముసి ముసి గా నవ్వుకుని 
"బేతాళా   ఇంత కాలం నుంచీ చూస్తూనే ఉన్నా నీకు ఇంకా చంద్రబాబు నాయుడు అర్ధం కాలేదన్నమాట.సరే చెబుతాను విను. అమరావతి శంకుస్థాపన అయిన కొద్ది రోజులకే నీతి అయోగ్ మీటింగ్ జరగింది. దానికి  మన పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వెళ్లి తమ రాష్ట్రానికి కావల్సినవి అడిగారు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం తడి గుడ్డేసుకుని కూల్ గా కూర్చున్నారు. ఎందుకంటే  ప్రత్యేక హోదా అనేదానికి అసలు  అడ్డమే చంద్రబాబు నాయుడు. ఆయనకు ప్రత్యేక హోదా  రాకూడదనే ఉంది. ప్రత్యేక హోదా వస్తే తన హోదా ఏమీ పెరగదని ఆయన ఉద్దేశం. అదే ప్రత్యేక ప్యాకేజీ   వచ్చిందనుకో... డబ్బులు డైరెక్ట్ గా వస్తాయి కాబట్టి. ఆపనులు.. ఈ పనులు చేశామని చెప్పి..టెండర్ల గోల్ మాల్ చేసి.. పట్టిసీమ  ప్రాజెక్టులో మాదిరిగా వందల కోట్లు మిగుల్చుకోవచ్చు. అదే ప్రత్యేక హోదా వస్తే  రాష్ట్రం బాగుపడుతుంది కానీ తనకేమీ లాభం ఉండదని చంద్రబాబు ఆలోచన. అందుకే అమరావతి శంకుస్థాపనకు ప్రధాని వస్తానని అనగానే  మట్టి..నీరు తీసుకురండని చంద్రబాబు  పిలుపునిచ్చారు. చంద్రబాబు  అడిగితే హోదా ఇద్దామని  ప్రధాని ఎదురు చూశారు. కానీ చంద్రబాబు నాయుడు వేదికమీదే  ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండన్నారు. ప్రత్యేక హోదా గురించి అడగలేదు. అందుకే ప్రధాని సైతం  చేయడానికి ఏమీ లేక  శంకుస్థాపన  సభ కాగానే  విమానం ఎక్కి తిరుపతికి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు. చంద్రబాబు కూడా తను కోరుకున్నట్లు హోదా రాలేదు కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు. " అని విక్రమార్కుడు  ముగించాడు. ఆ సమాధానాలకు సంతృప్తి చెందగానే బేతాళుడు  అమాంతం విక్రమార్కుడి భుజాలపై నుంచి మాయమై ..తిరిగి చెట్టువైపుకు సాగాడు.
--------------------
-వీర పిశాచి
Back to Top