‘మద్యా’నందప్రదేశ్

ఆనంద నగరం అంటే ఎలా ఉండాలి?
ఇంకెలా ఉండాలి అమరావతిలా ఉండాలి?
ఇంతకీ అమరావతి అంటే ఇంద్రుడిదా..? చంద్రుడిదా?
అక్కడ ఆ ఇంద్రసేనుడిది...ఇక్కడ ఈ నారాశూరుడిది..!!
ఓహో మరి ఆనందనగరం అలియాస్ అమరావతి నగరం ఇంకా కట్టనేలేదుగదా? అంటే రాజధానిలో శాశ్వత నిర్మాణం అనేదొక్కటీ లేదుగదా? మౌలిక వసుతులు లేవుగదా? పరిపాలనా భవనాలు లేవుగదా? ఆఫీసులు, కోర్టు, రోడ్లు, నీళ్లు, నిర్మాణాలు ఇలా ఏం లేకుండా అమరావతి ఆనంద నగరం ఎలా అయ్యింది?
ఎందుకవ్వదు...అహా ఎందుకవ్వదూ అంట?రాజధాని పేర 20వేల ఎకరాల భూముంది...అది కొన్ని లక్షల కోట్ల విలువ చేస్తుంది! అంటే అత్యంత సంపన్నరాజధాని అన్నమాట. నగరంలో బుర్జుకలీఫాలాంటి టవర్లు అరడజనొస్తాయి. అంటే అధునాతన నగరం అన్నమాట. సిటీ అంతా స్మార్ట్ గా ఉంటుంది. ప్రభుత్వం స్మార్ట్ పనులు చేస్తుంటుంది. ప్రజలు కూడా స్మార్ట్ గా ఆలోచిస్తుంటారు. అందువల్ల ఇది స్మార్ట్ సిటీ కూడాను. మౌలిక సదుపాయాలంటారా మనుషులన్నప్పుడు కదా వాటి అవసరం. ఇప్పుడు దానికి కంగారు లేదు. 
సరే ఆనంద నగరంలో ఏముంటాయో?
పిచ్చి ప్రశ్న ఆనంద నగరంలో ఆనందం తప్ప ఇంకేం ఉండదు. రైతులు తమ భూములిచ్చేసి వ్యవసాయం చేసే శ్రమ లేకుండా ఆనంద నగరంలో ఆనందంగా బతికేస్తారు. కుటుంబానికో ఉద్యోగం ఇస్తామని చెప్పాం గనక యువకులు ఉద్యోగాలు లేవని నిరాశపడకుండా నిశ్చింతగా గుండెల మీద చేతులేసుకుని హాయిగా గడిపేస్తుంటారు. పిల్లలు, పెద్దలు అందరూ త్వరలో అమరావతిలో కట్టబోయే ఉద్యానవనాల్లో సీతాకోక చిలుకల్లా తిరుగుతూ ఆనందంగా జీవిస్తుంటారు. 
ఇదంతా రాజమౌళి గ్రాఫిక్ లాగా అనిపిస్తోందే..?
రాజమౌళితోనే రాజధాని డిజైన్ల డిస్కషన్ చేసినప్పుడు అమరావతి ఆనంద నగరం అలాగే కదా ఉంటుంది.
ఇన్ని చెబుతున్నా మీకు ఆంధ్రప్రదేశ్ ఆనందప్రదేశ్ గా అనిపించడం లేదా? అయితే కాచుకోండి.. ఇది చెప్పాక మీరు అవునని తప్ప కాదని అనలేరు.మద్యం అమ్మకాల్లో రాష్ట్రం మొత్తం మీద అమరావతే నెంబర్ వన్ గా ఉంది. ఆనందంతో మందు తాగుతూ, మందుతాగుతూ ఆనందిస్తున్న ఈ నగరం ఆనంద నగరమే కదా. ఎవరో గిట్టనివాళ్లు ఈమధ్య ఆనందాంధ్రప్రదేశ్ ను ‘మద్యానందప్రదేశ్’ అంటున్నారు...చూసారా అందులోకూడా మధ్యలో ఆనందం ఉంది. ఈ చంద్రసూక్ష్మం తెలుసుకోగలిగిన ప్రతిఒక్కరూ ఆనందంగా బతకలరు. మన నగరాన్ని ఆనంద నగరంగా మార్చగలరు. 
ఇది విన్న అందరికీ ఆనందంతో అశృవులు ధారలుగా కారి, కృష్ణానదిలో కలిసిపోయి, వరదలొచ్చేసాయి. 
సమాప్తం. 


Back to Top