అయ్యబాబోయ్... చంద్రబాబు..ప్రత్యేక హోదానా!

కటిక చీకటిలో అడుగులో అడుగేసుకుంటూ విక్రమార్కుడు చెట్టు వైపుగా వెళ్తున్నాడు. ఒరలోని కత్తి నెత్తుటి కంపు కొడుతూ ముక్కుపుటాలదరగొట్టేస్తోంది. ఛఛ అని రెండు సార్లు అనుకుని జేబులోంచి అత్తరు గులాబీ తీసి కత్తిపై చల్లాడు. కాస్త హాయిగా అనిపించి చెట్టువైపు నడుస్తున్నాడు. చెట్టు దగ్గరకు రాగానే శవంలోని బేతాళుడు  ముందుగానే విక్రమార్కుని పలకరించాడు. "ఏంటి రాజా ఎప్పుడూ లేనిది నీ దగ్గర మంచి పరిమళం వస్తోంది " అన్నాడు బేతాళుడు భయంకరంగా నవ్వుతూ.అత్తరు పరిమళంతో  గుబాళిస్తోన్న కత్తిని తీసుకుని చెట్టుపై శవాన్ని దింపి భుజాలకెత్తుకున్నాడు విక్రమార్కుడు. 
 • "విక్రమార్కా ఏంటి ఈ రోజు బాగా హుషారుగా కనిపిస్తున్నావు ఏంటి సంగతి "అన్నాడు భేతాళుడు.
 • విక్రమార్కుడు ఓ మారు నవ్వి భేతాళుడి కేసి చూశాడు. భేతాళా ఈ సారి  వెరైటీగా ఓ పని చేద్దాం. ఈ సారి నేను కథ చెబుతాను. నువ్వు సమాధానం చెప్పు.ముందు నేను చెప్పే కథను సావధానంగా విను  అని విక్రమార్కుడు కథ చెప్పడానికి సమాయత్తమవుతున్నాడు.
 • అంతలో భేతాళుడు కల్పించుకున మరి నేను సమాధానం చెప్పలేకపోయాననుకో వెయ్యి వ్రక్కలు కావడానికి నాకు తలే లేదు కదా మరెలాగ అని భేతాళుడు కొంటెగా  ప్రశ్నించాడు.
 • దానికి విక్రమార్కుడు కొంచెం కంగు తిన్నా..అంతలోనే తేరుకుని..."దాందేముంది...నువ్వు సమాధానం చెప్పలేదనుకో...నువ్వు  ఈ చెట్టుకి వెయ్యేళ్ల పాటు అతుక్కుని ఉండిపోతావు. నీకు విముక్తే ఉండదు. "అన్నాడు.
 • ఈ కండిషన్ వినగానే భేతాళుడు భయపడ్డాడు. "అయ్యబాబోయ్ వెయ్యేళ్లపాటు ఈ చెట్టుకే ఉండిపోవాలా? అయితే కథ త్వరగా చెప్పు సమాధానం చెప్పి  ఆ ప్రమాదం లేకుండా చూసుకుంటాను "అని భేతాళుడు శ్రద్ధగా వినడానికి చెవులు రిక్కించాడు.
 • విక్రమార్కుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు.
 • భేతాళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో ....జరిగిన చర్చలో...బిజెపి నాయకుడు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు.
 • అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది ....కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే.
 • యూపీయే కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట మాత్రంగా హామీ ఇచ్చింది.
 • పార్లమెంటు సాక్షిగా దేశంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదాకు అనుకూలంగా మాటిచ్చాయి. ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఖాయం అని అందరూ అనుకున్నారు.
 • అయితే..రాష్ట్ర విభజన జరిగిపోయి..ఎన్నికలు పూర్తయ్యాక...కేంద్రంలో సీన్ మారింది. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే స్థానంలో బిజెపి సారధ్యంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చింది.
 • ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీతోనే ఇక్కడ ఏపీలో బిజెపి...తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది.14 నెలలు గడచిపోయాయి. ఇంతకాలం ప్రత్యేక హోదా గురించి ప్రయత్నం చేస్తున్నాం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చిన బిజెపి నేతలు..అసలు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం విభజన  చట్టంలోనే ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి ఉండాల్సిందని అలా చేయకపోవడం వల్లనే  ప్రత్యేక హోదా కష్టమవుతోందని కొత్త కథ వినిపించడం మొదలెట్టారు.
 • విభజన సమయంలో ఏపీ  ప్రజల అభ్యంతరాలను కానీ..ఆందోళనలను కానీ ఏ మాత్రం పట్టించుకోని కాంగ్రెస్  ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో పెట్టలేదు. ఇపుడు అదే పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ  మొన్నటికి మొన్న అనంతపురంలో పర్యటించి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు పోరాడతామని అల్టిమేటం జారీ చేశారు.
 • విభజన సమయంలో ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన బిజెపి ఇపుడు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి పారేసింది. దేశంలో ఇప్పట్లో ఏ కొత్త రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి  చెప్పేసింది."
 • విక్రమార్కుడు కథ చెప్పడం ముగించి...భేతాళా అప్పుడు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన బిజెపి ఇపుడు  ప్రత్యేక హోదా ఇవ్వలేం అంటోంది. అపుడు ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టకుండా ఆదరా బాదరాగా విభజన బిల్లును ఆమోదించుకున్న కాంగ్రెస్ ఇపుడు ప్రత్యేక హోదా కోసం పోరాడతాం అంటోంది.ఈ రెండు పార్టీల వైఖరులను చూస్తే  నీకేమనిపిస్తోంది? రాజకీయ పార్టీలు అప్పుడలా..ఇప్పుడిలా వ్యవహరించడానికి కారణాలేంటంటావు?  అని ప్రశ్నించాడు.
 • భేతాళుడు పగలబడి నవ్వుతున్నాడు.
 • విక్రమార్కునికి కోపం వచ్చింది. అయితే ప్రత్యేక హోదా మీద పలు సార్లు బాకా ఊదిన తెలుగుదేశం మౌనానికి కూడా జవాబు చెప్పాల్సిందే అంటూ మరో ప్రశ్న సంధించాడు. 
 • దానికి భేతాళుడు మరో సారి నవ్వి లేదు విక్రమార్కా నువ్వు చెప్పిన కథ చాలా బాగుంది.
 • ఈ కొత్త ప్రశ్న వేయకపోయినా నేను జవాబు చెప్పే వాడిని.
 • బీజేపీ దీన్ని లైట్ గా తీసుకోడానికి రాష్ట్రంలోని తెలుగుదేశమే కారణం. ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, ఆయన మంత్రులు కానీ ప్రత్యేక హోదా గురించి పట్టించుకోలేదు. ప్యాకేజీల మీదే ఆసక్తి చూపించారు. దీంతో కేంద్రం అంతటితో సరిపెట్టింది. ఇక, కాంగ్రెస్ కు రాష్ట్రంలో పట్టు కావాలి. అందుకే  ఈ మార్గాన్ని ఎంచుకొంది. అంతకు మించి ఈ పార్టీలకు ప్రత్యేక హోదా మీదకానీ, ప్రజల అవసరాల మీద కానీ ఆసక్తి లేదు.
 • ఈ రాజకీయ పార్టీల్లాగే అవసరాన్ని బట్టి మాటలు మార్చే గుణమే ఉంటే నేను భేతాళ లోకానికి ఎప్పుడో రాజయ్యేవాడినని అనిపించగానే అలా నవ్వేశానంతే. అని మరో సారి పగలబడి నవ్వాడు.
 • అహ ఎంత చక్కగా చెప్పావు బేతాళా అని విక్రమార్కుడు పొగుడుదామనుకుంటోన్నంతలోనే...భుజాల మీది శవం అమాంతం ఎగిరి చెట్టుకొమ్మకు వేలాడింది.
-వీర పిశాచి
Back to Top