రైతుల త్యాగాలపై రాజధాని పునాదులు

అమరాపురి రాజ్యానికి రాజు చంద్రసేనుడు.
రాజుకి తన కోట ఉన్న ప్రాంతం నచ్చలేదు.
రాజధానిని మార్చాలనుకున్నాడు.కొత్త కోట కట్టుకోవాలనుకున్నాడు.
రాజ్యం మధ్యలో మూడు పంటలు పండే సస్యశ్యామల ప్రాంతంపై  రాజు కన్నుపడింది.
రాజధాని కడితే ఇక్కడే కట్టాలనుకున్నాడు.రాజు తలచుకుంటే కొదవేముంది?  వెంటనే మంత్రులు రంగంలోకి దిగిపోయారు.కొత్తరాజధాని నగరం కోసం మూడు పంటలు పండే ఆ బంగారు భూములు   స్వచ్ఛందంగా ఇచ్చేయండహో అని దండోరా వేయించారు.ఆ భూముల్లో రైతులకు  గుండెల్లో  భయం పట్టుకుంది. భూములు ఇచ్చేస్తే  కుటుంబాలతో సహా అంతా వీధిన పడాల్సి వస్తుంది.
ఎలారా భగవంతుడా అని అందరూ కలిసి మా భూముల జోలికి రాకండి మహాప్రభో అని చేతులెత్తి ప్రాధేయ పడ్డారు. అధికారులు పట్టించుకోలేదు.మంత్రులు పట్టించుకోలేదు.రాజు తనకేమీ వినపడనట్లు నటించాడు. ఆ మరుసటి రోజున ఆ భూముల్లోకి సైన్యం చొరబడింది. మర్యాదగా భూములిస్తే..ఎంతో కొంత పరిహారం పడేస్తాం. లేదంటే భూములు లాక్కుని...అడ్డొచ్చిన వారిని కారాగారంలోకి తోస్తాం అంటూ బెదిరించారు. రైతులు భయపడిపోయారు. బెంగపెట్టుకున్నారు.ఇక తమజీవితాలు నాశనమైపోయినట్లేనని ఏడ్చారు.అయితే  అప్పటికీ మెజారిటీ రైతులు భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.
ఈ విషయం ఆ నోట ఆ నోట రాజుగారికి తెలిసింది. చేతకాని దద్దమ్మల్లా అలా ఊరుకుంటారేంట్రా..భూములు గుంజుకోండని హుకుం జారీచేశాడు రాజు. మర్నాటికల్లా రైతుల పొలాలను సైనికులు స్వాధీనం చేసుకున్నారు. అడ్డొచ్చిన వారిని కుళ్లబొడిచారు.నెత్తురు కారేట్లు కొట్టారు.దెబ్బలు తిన్న రైతులైతే.. మా ప్రాణాలు తీసేసినా బావుణ్ను...మా పొలాలు తీసేసుకుని మమ్మల్ని జీవచ్ఛవాలు చేసి వదిలారు అని రోదించారు.
రైతుల నుండి భూములు గుంజుకోవడం అన్యాయమని రైతుల తరపున  కొందరు పోరాడారు.అయితే రాజు వారిని రాజద్రోహులని  ముద్రవేశాడు.
కొద్ది రోజుల తర్వా కొత్త రాజధాని నగర నిర్మాణానికి భూమి పూజ చేయాలని నిర్ణయించారు.ఇతర రాజ్యాల ప్రముఖులను ఆహ్వానించారు.ఆర్భాటంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సందర్భంగా చంద్రసేన మహారాజు మాట్లాడుతూ...వేలాది ఎకరాల భూములను  తమంతట తాముగా వచ్చి ఇచ్చారు. వారి త్యాగాలను మరవలేం అని కొనియాడారు. సభావేదికకు దూరంగా కూర్చున్న  బాధిత రైతులు రాజు మాటలు విని ఆశ్చర్యపోయారు.
 " ఏంటీ మనం త్యాగాలు చేశామా? ఇదెక్కడి ఘోరం. మన మెడలు వంచి..మన వీపులు చితక్కొట్టి..ఇవ్వకపోతే మనల్ని కారాగారంలోకి నెట్టేస్తామని బెదిరించి బూవులు లాక్కుని..ఇపుడు మనవే  ఇచ్చామని అంటారేంట్రా అని ఓ యువరైతు కోపంగా అరిచాడు. వెనకనున్న ముసలి రైతులు అతన్ని వారించి ఊరుకోరా బాబూ..ఇపుడు పొలాలే పోయాయి..నువ్వు గట్టిగా అరిచావనుకో  పేనాలు కూడా తీసేస్తార్రా నాయనా " అని వారించారు.
యువ రైతుకు మండిపోతోంది. ఈ పెద్దోళ్లెప్పుడూ ఇంతే  అన్నిటికీ నోరు మూసుకోమంటారు అని లోలోన కుత కుత లాడిపోతున్నాడు.అతని వాలకాన్ని వేగులు  కనిపెట్టి రాజు చెవిలో ఏదో ఊదారు. కొద్ది క్షణాల తర్వాత రాజు వేదికపైనుండి మాట్లాడుతూ... రాజధాని కోసం బూవులు ఇచ్చిన రైతు  దంపతులందరికీ పట్టుబట్టలు ఇస్తున్నాం ఒకరి తర్వాత ఒకరు రండని పిలిచారు. రాజు ప్రకటించడమే తరువాయి సైన్యం ఒకరి తర్వాత ఒకరిగా రైతును..అతని భార్యను బలవంతంగా వేదిక ఎక్కించి పట్టుబట్టలు ఇప్పించి కిందకు దింపేశారు.
రాజధానికోసం తనకున్న  రెండెకరాలూ లాగేసుకోవడంతో కోపంమీద ఉన్న యువ రైతు ..అతని భార్య కూడా  అయిష్టంగానే పట్టుబట్టలు తీసుకున్నారు.
రాజు ఆ యువరైతు భుజం తట్టి నాయనా రాజధాని కోసం మీరందరూ భూములు ఇచ్చినందుకు  చాలా కృతజ్ఞతలు నాయనా అన్నాడు.యువరైతుకు మండిపోయింది. మేం ఇవ్వడమేంటి మహారాజా నువ్వూ..నీ సైనికులూ బలవంతంగా  మా భూములు గుంజుకుని..మా బతుకుల్లో నిప్పులు పోసి ఏమీ తెలీనట్లు ఇపుడు నాటకాలాడుతున్నారు అంటూ  ఆగ్రహంగా అరిచాడు.ముసలి రైతులు  అతన్ని వారించడానికి ప్రయత్నించినా అతను వినలేదు.
కార్యక్రమం ముగిశాక ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.
తెల్లారేసరికి యువరైతు దంపతుల శవాలు రాజధాని సమీపంలోని మర్రిచెట్టుకు వేలాడుతూ కనిపించాయి.
రైతులంతా శవం దగ్గర గుమిగూడారు.సైనికులు అది చూసి మంత్రులకు చెప్పారు.మంత్రులు రాజుకి చెప్పారు. రాజు అక్కడికి వచ్చి..రాజధాని నగర నిర్మాణం కోసం యువరైతు దంపతులు చేసిన త్యాగం మరువలేనిది అని  వారి శవాలకు దండలు  వేసి దండం పెట్టాడు. అనంతరం రాజు మందీ మార్బలంతో వెళ్లిపోయాడు.
అక్కడే ఉన్న సైన్యాధ్యక్షుడు వంకరగా నవ్వి  రైతుల్లారా ఇక త్యాగాలు చేయకండి... ఈ త్యాగాలు చాలు...ఇది రాజాజ్ఞ అని చెప్పి   తానూ కదిలాడు.
పొలాలు పోయిన రైతులు రాజధాని నగర నిర్మాణంలో కూలిలుగా మారిపోయారు.
కొత్త రాజధాని నిర్మాణం శరవేగంగా సాగిపోతోంది.
---------------------
-రాజద్రోహి

తాజా ఫోటోలు

Back to Top