హోదా కృష్ణార్ప‌ణం

విదేశీ బ్యాంకు సుజ‌నా చౌద‌రి కంపెనీకి ఇచ్చిన భారీ రుణం ఎలా రాబ‌ట్టుకోవాలో తెలీయ‌క నోటీసులు, కోర్టులు, డెడ్ లైన్లు అంటూ సామ‌, దాన‌, భేద, దండోపాయాల‌న్నీ ప్ర‌యోగిస్తోంది కానీ, ఇప్ప‌టిదాకా అయితే ఏమీ పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేదు. అస‌లు ఆ అప్పుతో త‌న‌కు సంబంధ‌మే లేద‌ని మ‌ల్లెపువ్వులా న‌వ్వుతూ తొణ‌క‌కుండా, బెణ‌క‌కుండా సుజ‌నా చౌద‌రి చెబుతున్నారు కాబ‌ట్టి ఇక నిజ‌మేమిటో తేలే నాటికి యుగాలు దొర్లిపోతాయి. కార్పొరేట్ వేష భాష‌తో టీడీపీని పూర్తిగా ప్ర‌యివేట్ కంపెనీగా కార్పొరేటీక‌రించ‌డంలో సుజ‌నా చౌద‌రి పాత్ర త‌క్కువేమీ కాదు. ఆ త‌రువాత ట్వ‌ట్టేష్ బాబుగా పేరు ప్ర‌ఖ్యాతులు పొందిన లోకేష్ బాబు టీడీపీ ప్ర‌యివేట్ కంపెనీ వ్య‌వ‌హారాల‌ను మ‌రో మెట్టు పైకి తీసుకెళ్లాడు. 
          ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా అన్న ర‌స‌వ‌త్త‌ర నాట‌కంలో సుజ‌నా చౌద‌రిది హీరో వేష‌మా? లేక విల‌న్ వేష‌మా? కామెడీ పాత్ర‌నా? అతిథి న‌టుడా? లేక ఇవ‌న్నీనా?  కాక‌పోతే ఇవేవీ కాదా? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు ప్రేక్ష‌కుల‌కు అర్థం కాని ప్ర‌శ్న‌. కుట్ర‌చేసి, సాంకేతిక కార‌ణాల‌ను సాకుగా చూపి రాజ్య‌స‌భ స‌భ్యుడు కేవీపీ ప్ర‌వేశ పెట్టిన ప్ర‌యివేటు బిల్లును లోక్ స‌భ స్పీక‌ర్ కు పంప‌గానే బీజేపీ స‌భ్యుల‌తో పాటు బ‌ల్ల‌లు చ‌రిచి హ‌ర్ష‌మోదాలు వ్య‌క్తం చేసిన సుజ‌నా చౌద‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు హీరోనా విల‌నా అన్న‌ది ప్ర‌జ‌లే తేల్చుకోవాలి. ఆర్థిక మంత్రి జైట్లీ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ముగాక ఇవ్వం అని నిర్మొహ‌మాటంగా చెప్పిన త‌రువాత కూడా హోదా సాధించే వ‌ర‌కు గోదా వ‌ద‌లం అని ఢిల్లీలో, విజ‌య‌వాడ‌లో మీడియా పేరంటాల్లో చెప్పే సుజ‌నా చౌద‌రికి 2016 ఉత్త‌మ హాస్య‌న‌టుడి అవార్డు వ‌చ్చినా రావ‌చ్చు. హాస్యం పండించ‌డంలో ఆయ‌న చాలా సీరియ‌స్ గా ఉన్న‌ట్లున్నారు. చంద్ర‌బాబు చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు అని ఒక హాస్య‌గుళిక‌ను కూడా మీడియా గొట్టాల‌పై విసిరారు. చంద్ర‌బాబు వ‌ల్ల పుట్టి, చంద్ర‌బాబు వ‌ల్ల ప్ర‌వ‌హించి, చంద్ర‌బాబు ముఖ్య మంత్రి కావ‌డం వ‌ల్ల వ‌చ్చిన కృష్ణా పుష్క‌రాల‌కు రావాల్సిందిగా ఢిల్లీలో చెట్టుపుట్ట‌ను కూడా తిరుప‌తి ప్ర‌సాద పాలిథిన్ క‌వ‌ర్ స‌హిత ఆహ్వానం చేతిలో పెట్టి పిలిచారు. పార్ల‌మెంటు, క్యాంటీన్, ప్ర‌ధాన మంత్రి, మంత్రులు, స‌మావేశ మందిరాలు, మెట్లు, కారిడార్లు ఇక్క‌డ అక్క‌డ అన్న తేడా లేకుండా పుష్క‌రం ఆహ్వానాల‌ను పంచారు. ఇక్క‌డ మీడియాలో ప్ర‌త్యేక హోదా ప‌నులపై చంద్ర‌బాబు ఢిల్లీలో బిజీబిజీ అంటూ బ్రేకింగ్ లు, స్కోలింగ్ లు, లైవ్ లు, ప్ర‌త్యేక వార్త‌ల వంట‌కాలు.
                       ప్ర‌ధాన మంత్రిని క‌లిసిన త‌రువాత విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త అంటూ ఆధ్యాత్మికోప‌న్యాసం కూడా చేశారు. ఈలోపు ప‌చ్చ‌మీడియాలో ల‌క్ష‌కోట్ల ప్యాకేజీ రెడీ అంటూ ప‌సుపు, కారం, పోపు వేసి లీకు వంట‌కం రెడీ. అమ‌రావ‌తి  శంకుస్థాప‌న‌ప్పుడు ప్ర‌ధాన మంత్రి క‌నీసం ఒక చెంబుడు య‌మున నీళ్లు, ఒక గుప్పెడు మ‌ట్టి అయినా ఇచ్చారు. కృష్ణా పుష్క‌రాల‌కు ఏమిస్తారో?  కృష్ణ‌మ్మ‌కే ఎరుక‌. అయినా స‌మీప భ‌విష్య‌త్తులో పెన్నా పుష్క‌రం, తుంగా పొంగు, భ‌ద్రా రంగు, చిత్రావ‌తి చిత్రం, కుముద్వ‌తీ ప‌రిణ‌యం, నాగావ‌ళి నృత్యం, వంశ‌ధార అసిధార‌వ్ర‌తం, గోదావ‌రి మ‌ధ్య పుష్క‌రం, కృష్ణా అంత్య పుష్క‌రం, హంస‌లదీవి ఠీవి, బోయ‌పాటి కృష్ణార్ప‌ణం ఇలా ఇంకా ఎన్నో అవ‌కాశాలు, సంద‌ర్భాలు ఉన్నాయి. వీట‌న్నిటికీ బాబు ఆహ్వాన ప‌త్రాల‌తో పాటు తిరుప‌తి ప్ర‌సాదం తీసుకుని ఢిల్లీ వెళ్లాలి. పేరుపేరునా పిల‌వాలి. హోదా ఒక్క‌టి త‌ప్ప రోజూ పండ‌గ జ‌ర‌గాలి. జ‌నం నిజం మ‌ర‌చి అబ‌ద్దాల ప్ర‌వాహంలో మునిగి తేలాలి. పాపం గోబెల్స్ చ‌చ్చిపోయి బ‌తికిపోయాడు. బ‌తికి ఉంటే బాబుతో పోటీ ప‌డ‌లేక చచ్చిపోయేవాడు.
Back to Top