సింగపూర్ సిత్రం సూపే బాబు


చాలామంది అన్నట్టు చంద్రబాబుకు సింగపూరుకూ అవినాభావ సంబంధం ఉంది. బాబుకు సింగపూరంటే అమితమైన ప్రేమ ఉంది. నల్ల కుబేరులందరికీ ఆ ప్రేమ ఉండనే ఉంటుంది. బ్లాక్ మనీకి స్వర్గధామంగా ఉన్న సింగపూరును బాబు ఆరాధించడమే కాదు, అన్ని వ్యవహారాలు దానితోనే ముడిపెడుతున్నాడు. ఎవ్వరెంత మొత్తుకున్నా రాజధాని నిర్మాణం సింగపూరే చేస్తుంది అని ఖరారు చేసాడు. వేల ఎకరాలు డెవల్ చేసి, రియలెస్టేట్ చేసేందుకు గంప గుత్తిగా సింగపూరు సంస్థల చేతిలో పెట్టాడు. రాజధాని కోసమంటూ రైతులు ఇచ్చిన ఆ భూములను అమ్మకంతో సహా సర్వాధికారాలను వాళ్లకి కట్టబెట్టేశాడు. 

ఇలా సింగపూరు ప్రేమ సాగడమే కాదు, కొనసాగడానికి దారులు కూడా వేస్తున్నాడు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విజయవాడ సింగపూర్ల మధ్య వారానికి రెండుసార్లు విమాన సర్వీసులు నడపాలంటూ ప్రకటనలు జారీ చేసింది చంద్రబాబు సర్కార్. సింగపూర్ కు విజయవాడకు మధ్య సులభమైన ప్రయాణ దూరం ఉంటేనే చంద్రబాబుకు బాగా కలిసొస్తుందనుకుంటా. 

నష్టాలొచ్చినా పర్లేదంటూ
సింగపూరుకు విమానాలు నడపండి, నష్టాలొచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని పూడుస్తుందంటూ ప్రకటన వెలువరిచింది ఏపీ ప్రభుత్వం. ఆర్.ఎఫ్.పి అంటే ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిప్రకారం వయబులిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వడానికి  కూడా సర్కార్ సంసిద్ధంగా ఉందని తెలియజేసింది. అంటే సింగపూరు విజయవాడల మధ్య విమాన యాన సంస్థలు సర్వీసులు నడిపినప్పుడు నష్టం కలిగితే వాటిని ప్రభుత్వమే సర్దుబాటు చేస్తుందన్నమాట. 

రాష్ట్ర సమస్యలు గాలికొదిలి

అసలే పేద రాష్ట్రం, ఆదాయం లేదు, లోటు బడ్జెట్ అని కల్లబొల్లి ఏడుపు మాటలు మాట్లాడతాడు చంద్రబాబు. కానీ చేతల్లో ఖజానాను ఖాళీ చేసే దుబారాలకే ప్రాధాన్యత ఇస్తాడు. సమావేశాల పేరిట కోట్లు, విదేశీ ట్రిప్పులకు వందల కోట్లు, ఆడంబరాలకు, ఉత్సవాలకు పేద రాష్ట్ర బడ్జెట్ నుంచి వేల కోట్లు ఖర్చు చేయడం చంద్రబాబుకే చెల్లింది. నిజానికి ఆర్టీసీ ఎన్నో కష్టాల్లో ఉంది. గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. కొన్ని ప్రాంతాలకు రవాణా సదుపాయాలు మృగ్యంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల కొరత ఉంది. వీటన్నిటినీ పట్టించుకోకుండా చంద్రబాబు సింగపూరుకు విమాన సర్వీసుల కోసం ఉవ్విళ్లూరుతున్నాడు. రాష్ట్రం అంతర్జాతీయ సర్వీసులను సాధించుకోవడం తప్పు కాదు. కానీ అందుకోసం ప్రైవేటు ఫ్లైట్ ఆపరేటర్లకు నష్ట పరిహారాన్ని కూడా భరిస్తాననడం మాత్రం మూర్ఖమైన నిర్ణయం. కాదంటారా?
 
Back to Top