సింగ్ ఈజ్ రాంగ్‌

సింగ‌పూర్ కంపెనీల‌కు అన్ని ప‌నులు అప్ప‌జెప్పిన‌ప్ప‌టి నుంచి చంద్ర‌బాబు భాషే మారిపోయింది. ఒక విలేక‌రి ఇంట‌ర్వ్యూ చేస్తే స‌మాధానాలు ఇలా చెప్పాడు.
మీకు న‌చ్చిన సినిమా - సింగం
ఎందుక‌ని - అందులో మాట‌కు ముందు హీరో నాన్ దా సింగం అంటూవుంటాడు. సింగ‌మంటే సింహం అని అర్థం. సింగ‌పూర్ ప్ర‌జ‌ల‌కు సింహ‌మంటే చాలా ఇష్టం. దాని కోసం ఎన్నో గుళ్లు గోపురాలు కట్టించారు. సింగ‌పూర్ త‌ర‌హా అభివృద్ధి కోసం నేను కూడా సింహాల‌కు గుళ్లు క‌ట్టిస్తాను. 
సింహాల వ‌ల్ల ప్ర‌యోజ‌న‌మేంటి? అవి జింక‌ల‌ని తింటాయి క‌దా?
జింక‌ల‌ని తిన‌డం ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌తీక‌. సింహాలు జింక‌ల‌ను తిన‌క‌పోతే న‌దిలో గేల‌మేసి చేప‌ల్ని తింటాయా? ఏం ప్ర‌శ్న‌ల‌య్యా ఇవి?
చంద్ర‌బాబు త‌న పిఏని పిలిచి మ‌న‌కి వ్య‌తిరేకంగా వార్త‌లు రాసేవాళ్ల‌ని ప్ర‌శ్న‌లు అడిగేవాళ్ల‌ని ఒక కంట‌క‌నిపెట్టు. ఛాన్స్ దొరికిన‌ప్పుడు క‌ల్చుకు తిందాం అని చెప్పారు.
మీరు చెప్పారు కాబ‌ట్టి రెండు క‌ళ్ల‌తో క‌నిపెడుతా అన్నాడు పీఏ
విలేక‌రి ఇంకో ప్ర‌శ్న వేసాడు.
మీకు ఇష్టామైన ఇంకో సినిమా పేరు చెప్పండి
ల‌వ్ ఇన్ సింగ‌పూర్‌
అదెప్పుడొచ్చింది?
ఎప్పుడొచ్చామ‌న్న‌ది కాదు, ఆ సినిమాలో సింగ‌పూర్ వుందా లేదా అన్నది ముఖ్యం. మ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ల‌వ్ చేసుకోవ‌డానికేముంది. మురికివాడ‌లు త‌ప్ప‌. మురికివాడ‌ల్లో ముక్కు మూసుకుంటాం కానీ, ల‌వ్ చేసుకుంటామా? అందుకే రాజ‌ధాని నిర్మాణాన్ని మొత్తం సింగ‌పూర్ కంపెనీల‌కి ఇచ్చాం. అదే మ‌న కంపెనీల‌కిస్తే మురికివాడ‌లు క‌డ‌తారు. పుట్టుక‌తో వ‌చ్చిన బుద్ది పుట్టుక‌ల‌తో కానీ పోదు. 
అదేంటిసార్ మ‌న వాళ్లు కూడా విదేశాల్లో ఎన్నో ప్రాజెక్టులు క‌ట్టారు క‌దా
అవ‌న్నీ క‌ట్టుక‌థ‌లు. మ‌న‌వాళ్ల‌కి ఇసుక‌లో ఎంత సిమెంట్ క‌ల‌పాలో కూడా తెలియ‌దు. అయినా నేను చెప్పింది నువ్వు వినాలి కానీ, ప్ర‌శ్న‌లు వేయ‌కూడ‌దు. 
నెక్ట్స్ క్వ‌శ్చ‌న్‌
మీకిష్ట‌మైన రాజు
సింగ‌భూప‌తి
ఆయ‌నెవరు?
ఎవ‌రైతేనేమి పేరులో సింగ వుందా లేదా?
మీకిష్ట‌మైన పుస్త‌కం
బోయింగ్ ఏ సింగల్‌
ఎవ‌రు రాసారు?
ఎవ‌రు రాస్తేనేం పేరులో సింగి వుందా లేదా
మీకిష్ట‌మైన నియోజ‌క‌వ‌ర్గం
సింగ‌న‌మ‌ల‌
మీకిష్ట‌మైన పాట‌
సింగిల్ సింగిల్ లిటిల్‌స్టార్‌
అది ట్వింకిల్ ట్వింకింల్ క‌దా
నాకు న‌చ్చిన పాట‌ని నాకిష్ట‌మొచ్చిన‌ట్టు పాడుకుంటా
మీకిష్ట‌మైన పాత్ర‌
గబ్బ‌ర్‌సింగ్‌
సింగ‌పూర్ నామ‌స్మ‌ర‌ణ‌లో ప్ర‌జ‌ల్ని ఏం చేయ‌బోతున్నారు
సింగిల్ హ్యాండెడ్‌గా పాప‌ర్‌ప‌ట్టిస్తా
ఆ త‌రువాత ప్ర‌శ్నల‌డిగిన విలేక‌రిపై కేసుపెట్టి లోప‌ల‌వేసారు
Back to Top