సెల్ఫ్‌గోల్‌

‘‘నన్ను ప్రత్యేకంగా ఎవరూ ఓడించక్కర్లేదు. నన్ను నేనే ఓడించుకుంటాను’’అన్నాడు చంద్రబాబు. విలేకరులంతా ఆశ్చర్యపోయారు.
‘‘అదేంటి మరెప్పుడూ విక్టరీ అంటూ రెండు వేళ్ళు చూపించేవాళ్ళు’’ అని అడిగారు
‘‘అన్నింట్లో వేలు పెడితే వున్నవేలు లేకుండా పోతుంది. నోట్ల రద్దు నా ఆలోచన అన్నందుకు జనం నన్ను నానా తిట్లు తిడుతున్నారు. అందుకే వైరాగ్యమొచ్చేసింది. సెల్ఫ్‌గోల్‌ నా టార్గట్, ఇప్పుడు మోడీ కూడా అదే రూట్‌లో వున్నారు. బీజేపీలో కలిస్తే ఒకసారి అధికారం, ఇంకోసారి ప్రతిపక్షం ఎలాగూ తప్పవు. గతంలో కూడా అదే జరిగింది అన్నాడు బాబు.
‘‘గతం నుంచి మీరు గుణపాఠాలు ఎందుకు నేర్చుకోరు?’’
‘‘గుణంమంచిదైతే  గుణపాఠం నేర్చుకుంటాం. ప్రజల్ని ఏమార్చడం నా లక్షణం. అందుకే ఈసారి ప్రజలు కనిపెట్టారు’’
‘‘ఇంకా ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి కదా’’?
‘‘ఎంత దూరం ఉన్నా ఫలితం ఒక్కటే’’
‘‘బీజేపీతో మీ సహచర్యం ఎలా ఉంది?’’
‘‘ఇద్దరం కలిసి మునిగిపోతున్నాం. ఈదడం రానివాళ్ళు  ఒకర్నొకరు పట్టుకుంటే ఏమవుతుంది?’’
‘‘కేంద్రం నుంచి మీకు మద్దతు లభిస్తుందా?’’
‘‘ఈ రాష్ట్రానికి వాళ్ళేం చేయరని నాకు తెలుసు. నేను కూడా ఏమీ చేయనని వాళ్ళకి తెలుసు. పరస్పరం ఈ గేమ్‌ ఆడుతూ ఉంటాం. దేశాన్ని ఏదో చేస్తానని మోడీ అంటూ ఉంటాడు. రాష్ట్రాన్ని స్వర్గం చేస్తానని నేను అంటూ ఉంటాను. రెండూ జరిగేవి కావని ఇద్దరికీ తెలుసు’’
‘‘మీరు నిజాలు కూడా మాట్లడతారా?’’ ఆశ్చర్యంగా అడిగారు విలేకరులు
‘‘నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు?’’
‘‘గతంలో మీరు డిజిటల్‌ అనేవాళ్ళు, ఇప్పుడు గాలి బీజేపీకి సోకిందా?’’అని అడిగారు విలేకరులు
‘‘వ్యవసాయం దండగ కంప్యూటర్లు పండగ అన్నందుకు జనం నన్ను పదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు మోడీ ఉన్న డబ్బుల్ని మాయం చేసి, లేని డబ్బులతో డిజిటల్‌ అంటున్నాడు. దేశం మొత్తాన్ని ఒక్కసారిగా క్యాష్‌ లెస్‌ చేయడం ఆయనకే చెల్లింది. టీవాలా కంట్రీని చేసేశాడు.’’
‘‘అంటే ఇప్పుడు బీజేపీతో విడిపోతారా?’’
‘‘కలిసున్నా జనం నమ్మరు. విడిపోయినా నమ్మరు’’
‘‘అమరావతి నిర్మాణం ఎంతవరకూ వచ్చింది’’
‘‘గూబలదాకా వచ్చంది. ముందు నుయ్యి, వెనుక గొయ్యి, ఏదో నాలుగు బిల్డింగులు కట్టి, రైతుల దగ్గర భూమి లాక్కుని ప్రభుత్వమే రియల్టర్‌ అవతారం ఎత్తాలని అనుకుంది. నోట్లరద్దు దెబ్బకి జీతాలకే ఆదాయం లేదు. ఇక అమరావతి అయినట్టే’’
‘‘అయితే మీ తదుపరి కార్యక్రమం’’
మాయ చేసినంతకాలం మాయ చేయడం, తరువాత ఓడిపోవడం’’
‘‘అయినా జనం దగ్గర డబ్బు లేకపోతే, ఇక ఆన్‌లైన్‌ వాళ్ళకేం అర్థమవుతుంది.’’
‘‘అర్థం కాని వాటి గురించి మాట్లాడుతూ వుండడమే రాజకీయం. గత 40 ఏళ్ళుగా  నా రాజకీయం నాకే అర్థం కాలేదు. ఇక మీకేం అర్థమవుతుంది’’ అని ముగించాడు బాబు.
Back to Top