బాబెందుకు బుకాయిస్తున్నారు?

  • పట్టువదలని విక్రమార్కుడు  తనలో తానే నవ్వుకుంటూ స్మశానంలో చెట్టువైపుకు సాగుతున్నాడు.
  • విక్రమార్కుడి నవ్వు చూసి బేతాళుడు కూడా నవ్వాడు.
  • "ఏం విక్రమార్కా ఏంటి  నీలో నువ్వే నవ్వుకుంటున్నావు  నాక్కూడా చెబితే నేను కూడా  నవ్వుతాను కదా" అన్నాడు.
  • దానికి విక్రమార్కుడు మరో సారి నవ్వి..
  • "ఏం లేదు బేతాళా...కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఉన్నారు కదా...ఆయన వరంగల్ జిల్లాలో మందినందరినీ మస్తు నవ్వించారు"  అన్నాడు.
  • "ఏం నవ్వించాడో విషయం చెప్పు విక్రమార్కా" అన్నాడు బేతాళుడు.
  • "ఏం లేదు బేతాళా వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఆ ఎన్నికల్లో కానీ ప్రజలు  కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే...తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆంధ్ర ప్రదేశ్ లో కలిపేస్తాం జాగ్రత్త అని  బలరాం నాయక్  వార్నింగ్ ఇచ్చారు. ఇక చూసుకో  మిగతా కాంగ్రెస్ లీడర్లంతా ఇదేం వార్నింగ్ రా నాయనా అని తలలు పట్టుకుని ఆయన్ని వారించారు. అది తలచుకున్నప్పుడల్లా నాకు నవ్వాగట్లేదు" అన్నాడు.
  • బేతాళుడు కూడా నవ్వేసి...
  • "సరే మరి ఇక కథ మొదలు  పెడతాను. సావధానంగా విని నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్దువుగా"ని అని కథ చెప్పడం మొదలు పెట్టాడు.
  • "విక్రమార్కా...ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో  చాలా హామీలు ఇచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు..ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపు...పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దాని నిర్మాణాన్ని కేంద్రమే తలకెత్తుకోవడం మొదలుకుని...ఏపీ రాష్ట్రంలో పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు..విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చింది. ఏపీలో వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కూడా అంది. టిడిపి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు ప్రత్యేక హోదా పై కేంద్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.  పైగా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని వెంకయ్యనాయుడులాంటి కేంద్ర మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేయించుకోవలసిన టిడిపి నేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇపుడు మాట మార్చేశారు. ప్రత్యేక హోదా తోనే అన్నీ జరిగిపోవంటున్నారు. ప్రత్యేక హోదా ఎందుకు..కేంద్రం నుండి  ప్రత్యేక  ప్యాకేజీలు సాధించుకుంటాం కదా అని చంద్రబాబు నమ్మబలుకుతున్నారు.అటు వెంకయ్యనాయుడుతో సహా టిడిపి కేంద్ర మంత్రులు కూడా  ఏపీకి బోలెడు విద్యాసంస్థలు..ఇతరత్రా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేటాయించాం కదా..ఒక్కొక్కటిగా అన్నీ చేస్తున్నాం కదా అని అంటున్నారు. ఈ సంస్థల ఏర్పాటు కూడా విభజన చట్టంలో ఇచ్చిన హామీ పరిధిలోనిదే. మరి అది తెలిసుండీ కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కోసం ఎందుకు పట్టుబట్టడం లేదు?  హోదా తో పాటు ఇచ్చిన  హామీలో ఒకటీ అరా పథకాలు అమలు చేస్తోంటే ఏదో ఘనకార్యం సాధించేసినట్లు  ఎందుకు గొప్పలు చెప్పుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసీ కూడా చెప్పకపోయావా... నీ తల వెయ్యి చెక్కలైపోతుంది" అని బేతాళుడు  ముగించాడు.
  • విక్రమార్కుడు ఒక్క క్షణం ఆలోచించి...
  • " బేతాళా  విభజన  చట్టంలోనే  ఏపీకి రెండు ప్రధాన హామీలు ఇచ్చారు. ప్రత్యేక హోదా తో పాటు ప్రత్యేక ప్యాకేజీకూడా అందులోనే ఉన్నాయి. ఇపుడు టిడిపి ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదా అవసరం లేదు..ప్రత్యేక ప్యాకేజీ ఒక్కటే చాలు అంటూ ప్లేటు ఫిరాయిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.
  • చంద్రబాబు నాయుడు ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు మునిగిపోయారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఆ కేసు ను కానీ కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే తన ముఖ్యమంత్రి పదవికే ఎసరొస్తుందని చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు.అందుకే ప్రత్యేక హోదా ఏపీ హక్కు అయినా కూడా  కేంద్రం వద్ద చేతులు కట్టుకుని దేబిరించాల్సిన పరిస్థితి దాపురించింది. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పగానే..సరే అని తలూపుకుంటూ బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా  ఒక్కటే సంజీవని కాదన్నారు.హోదా విషయంలో ప్రధాన ప్రతిపక్షమైన జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తుండడంతో చంద్రబాబు నాయుడికీ..ఆయన మంత్రులకీ కంటిమీద కునుకుండడం లేదు. హోదా విషయంలో ఏపీ ప్రజలు టిడిపి వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారని  నిఘా బృందాలు కూడా తెలపడంతో  టిడిపి కొత్తరాగం అందుకుంది. అసలు హోదా తో పనే లేదంటోంది.
  • విన్నావుగా బేతాళా ఇదీ పరిస్థితి. చంద్రబాబు నాయుడు తన సొంత ప్రయోజనాలకోసమే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి రెడీ అయిపోయారు.
  • 5కోట్ల మంది ఆంధ్రుల హక్కు సాధించుకోడానికి జగన్ మోహన్ రెడ్డి దీక్ష కు దిగారు.)
  • అని విక్రమార్కుడు చెప్పడం ముగించగానే...బేతాళుడు సంతృప్తి చెంది విక్రమార్కుడి భుజం మీంచి మాయమై..తిరిగి చెట్టుకు వేలాడాడు.
--------------------
-వీర పిశాచి
Back to Top