మనోళ్లే చూసుకుంటారులే

పట్టువదలని విక్రమార్కుడు అడుగులో అడుగేసుకుంటూ స్మశానంలో ముందుకు సాగుతున్నాడు.

ఎక్కడి నుంచో నక్కల ఊళలు  వినిపిస్తున్నాయి. కీచురాళ్లు గీ...అంటూ చెవులు గింగిర్లు తిరిగేలా చప్పుడు చేస్తున్నాయి. పిల్ల పిశాచులు వెటకారంగా నవ్వుతున్నాయి. భయమన్నదే తెలీని విక్రమార్కుడు చెట్టుదగ్గరకు వచ్చాడు. చెట్టుకు వేలాడుతోన్న  బేతాళుడు విక్రమార్కుని చూసి పగలబడి నవ్వాడు. ఏంటి విక్రమార్కా ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం జరిగిందేంటి ? అని నిలదీశాడు. దానికి విక్రమార్కుడు  కల్పించుకుని ఏం లేదు బేతాళా కాస్తంత అలసటగా ఉందంతే అన్నాడు.
సరే అయితే కథ  చెప్పమంటావా అన్నాడు బేతాళుడు.
ఇంకెందుకు ఆలస్యం చెప్పేయ్. అన్నాడు విక్రమార్కుడు.
బేతాళుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో  కాల్ మనీ  రాక్షసులను చూస్తే మా భూతాలు కడా భయపడుతున్నాయి. ఎక్కువ వడ్డీలకు అప్పులు ఇచ్చి అవి తీర్చలేదని  అన్యాయంగా ఆడబిడ్డల మానాలతో చెలగాటమాడే కీచకుల వ్యవహారం చాలా దారుణం. అంతటి  నీచ వ్యవహారంలో దొరికిపోయినా కూడా  తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోడ ప్రసాద్  ఎలాంటి భయమూ..పశ్చాత్తాపమూ లేకుండా ..అంత ప్రశాంతంగా ఎలా ఉన్నాడో నాకైతే అర్ధమే కావడం లేదు. ఇలాంటి నేరాలకు తీవ్రమైన శిక్షలు ఉండవా మీలోకంలో?   అలాంటి శిక్షలన్నా కూడా అతనికి భయం లేకపోవడానికి కారణం ఏంటి? మరో పక్క  టిడిపి ప్రభుత్వం..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తమ ఎమ్మెల్యే చేసిన ఘాతుకానికి కంగారు పడతారేమో..సిగ్గుతో తలదించుకుని ఏం చేయాలిరా అని తలపట్టుకుంటారేమో అని అనుకున్నాను. తీరా చూస్తూ వాళ్లూ అంతే ప్రశాంతంగా ఉన్నారు.దీనికి కారణాలు ఏంటంటావు? వీటికి సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి చెక్కలైపోతుంది " అని బేతాళుడు కథ ముగించాడు.
విక్రమార్కుడు ఒక్క క్షణం ఆలోచించి చెప్పడం మొదలు పెట్టాడు.
"బేతాళా..!  ఆడవాళ్ల పై అకృత్యాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు విధించే చట్టాలు లేకపోలేదు. చాలా ఉన్నాయి. నిర్భయ చట్టాన్ని కూడా దీనికి ఉపయోగించుకోవచ్చు. అయిదే విషయం అది కాదు. బోడ ప్రసాద్ కానీ.. టిడిపి మంత్రులు కానీ..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ   ...ఎలాంటి కంగారు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి కారణాలున్నాయి.
టిడిపి ఎంపీ  సుజనా చౌదరి తెలుసు కదా. ఆయన మారిషస్ బ్యాంకుకు టోకరా వేసిన కేసు కోర్టుల్లో నడుస్తోంది. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ను పిలిచి ఏంటిది అని అడిగిన పాపాన పోలేదు సరికదా..  కేంద్ర మంత్రి వర్గంలో సుజనా చౌదరికి చోటు ఇవ్వాల్సిందిగా సిఫారసు చేశారు.
ఇక దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విషయం నీకు తెలిసిందే. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారని చెప్పి మహిళా తహసిల్దార్ వనజాక్షిపై ఏకంగా చెయ్యి చేసుకోవడమే కాకుండా వినడానికి వీల్లేని బూతులు తిట్టారు. అలాంటి చింతమనేనిని చంద్రబాబు ఏమీ అనకపోగా..వనజాక్షిని పిలిచి నీ హద్దులు దాటావు మంచి పద్ధతి కాదని మందలించి పంపారు.
నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి కేసులోనూ  ప్రధాన నిందితుడైన ప్రిన్సిపాల్ బాబూరావుపై ప్రభుత్వం ఈగను కూడా వాలనివ్వకుండా కాపాడుకుంటూ వచ్చింది.
పట్టిసీమ కుంభకోణం లోనూ ఎవరికీ ఏమీ కాలేదు.
పది లక్షల లంచం తీసుకున్న కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన పీతల సుజాత పై చర్యలు లేవు.
చివరాఖరికి ఓటుకు కోట్లు కేసులో సాక్షాత్తూ చంద్రబాబు నాయుడే దోషి అని అన్ని రకాల సాక్ష్యాలూ చెబుతున్నా..ఆయన కూడా తాను నిర్దోషినే అన్నట్లు నటిస్తున్నారు. ఆయన్ను పార్టీ యావత్తూ కాపాడుకుంటూ వస్తోంది.
ఇంతమందిని కాపాడుకొచ్చిన పార్టీ తనను కూడా రక్షిస్తుందని ధీమా ఉండబట్టే  బోడ ప్రసాద్  ధైర్యంగా ప్రశాంతంగా ఉన్నారు."అని విక్రమార్కుడు ముగించాడు.
విక్రమార్కుని సమాధానం తో సంతృప్తి పడగానే బేతాళుడు విక్రమార్కుని భుజాలపై నుంచి మాయమై  తిరిగి చెట్టువైపు దూసుకుపోయాడు.
----------------------
-వీర పిశాచి


Back to Top