పట్టువదలని విక్రమార్కుడు బెదురు చూపులతో ముందుకు నడవసాగాడు. చెట్టుమీద వేలాడుతోన్న శవాన్ని తెంచి భుజాలకెత్తుకున్నాడు.అయితే అంతా ఏదో ఆలోచిస్తూ..భయపడుతూ..యాంత్రికంగా చేసుకుపోతున్నాడు. విక్రమార్కుని చూడగానే బేతాళుడికి జాలేసింది."ఏం విక్రమార్కా? ఏమైందేంటి? బాగా బెదిరిపోయినట్లు కనిపిస్తున్నావు. ఏం ఎక్కడన్నా ఏ దెయ్యాన్నయినా చూసి జడుసుకున్నావేంటి? పోనీ తాయెత్తు కట్టుకోలేకపోయావా?" అంటూ అడగసాగాడు. విక్రమార్కుడికి బాగా కోపం వచ్చేసింది." భూత ప్రేత పిశాచాలు రోజూ కబడ్డీ ఆడుకునే ఇక్కడికి వచ్చీ పోయేవాడిని.. నాకు దెయ్యాలను చూస్తే భయమేస్తుందా ఏంటి? తాయెత్తులూ అవీ నాకు కావు.. ఎవరైనా పిరికి వాళ్లుంటే వాళ్లకి ఇయ్యి .. అయినా నువ్వే ఓ ప్రేతాత్మవి. నువ్వు తాయెత్తులు ఇవ్వడమేంటి విడ్డూరం కాకపోతే" అని విక్రమార్కుడు బదులిచ్చాడు.విక్రమార్కుడి కోపం చూసి బేతాళుడికి నవ్వొచ్చింది."సారీ విక్రమార్కా. నిన్ను చులకన చేయాలని అలా అనలేదు. నువ్వెందుకో భయపడ్డట్లు నీ బెదురు చూపులే చెబుతున్నాయి ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృతతోనే అడిగాను తప్ప మరోటి కాదు. ఇంతకీ ఏం జరిగింది?" అని బేతాళుడు ఆరా తీశాడు."ఏం లేదు బేతాళా. పొద్దున్నే ఉల్లిపాయలు కొందామని వెళ్లాను. అక్కడ రేటు వినేసరికి బతుకంటేనే భయమేసేసింది. రోజంతా ఉల్లిపాయల గురించి ఆలోచిస్తూనే గడిపాను తప్ప కొనలేదు. చీకటి పడ్డాక కూడా ఇప్పటికీ ఆ రేటు నన్ను భయపెడుతోంది.ఆ భయంలోనే ఇక్కడకి వచ్చేశాను. అదీ సంగతి" అని వివరించాడు.బేతాళుడు నవ్వి..." చోద్యం కాకపోతే ఉల్లిపాయలు తినకపోతే కొంపలు అంటుకుపోతాయా ఏటి?" అన్నాడు.దానికి విక్రమార్కుడు నొచ్చుకుని " నీకంటే ఏ బాదర బందీ లేదు..మామూలు మనుషుల తిండీ తిప్పలతోనూ నీకు పనిలేదు. కానీ మాకు ఉల్లిపాయ లేందే ముద్దదిగదయ్యా బాబూ. నీకు తెలుసో లేదో ఈ ఉల్లిపాయే.. వాజ్ పాయ్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపేసింది. అదీ ఉల్లి పవర్ అంటే" అని విక్రమార్కుడు హుషారుగా చెప్పుకుపోతున్నాడు.బేతాళుడు ఆశ్చర్యపోయి సరేలే ఇక ఉల్లి గొడవ పక్కన పెట్టు. పాయింట్ కి రా. ఇప్పుడు నీకో కథ చెబుతాను. సావధానంగా విను అని కథ చెప్పడం మొదలు పెట్టాడు." విక్రమార్కా 2014 ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని తెలుగుదేశం, బీజేపీ పెద్దలు ఉమ్మడిగా తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చారు. హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా..ముందుగా హామీ ఇస్తే సరిపోతుందని టిడిపి నేత చంద్రబాబు నాయుడు గీసిన స్కెచ్ మేరకు బిజెపి హామీని ఇచ్చేసింది. ఆ మాటలు నమ్మి తెలుగు ఓటర్లు బిజెపిని కేంద్రంలో, తెలుగుదేశాన్ని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయినా మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రత్యేక ప్యాకేజీ అయినా సాధించుకుంటామంటూ టిడిపికి చెందిన కేంద్రమంత్రులు అంటున్నారు. బిజెపి మాత్రం ప్రత్యేక ప్యాకేజీ మీద దోబూచులాడుతోంది.కేంద్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని ప్రభుత్వం వివరించింది కూడా. ఈ సమయంలోనే బీహార్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ... ప్రత్యేక ప్యాకేజీ..అదనపు గ్రాంట్ల పేరిట ఏకంగా ఒక లక్షా అరవై అయిదు వేల కోట్ల రూపాయల నిధులను బీహార్ కు ఇస్తామని హామీ ఇచ్చారు."ఇపుడు చెప్పు విక్రమార్కా " ఆల్ రెడీ మాటిచ్చిన ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ప్రత్యేక ప్యాకేజీకి డబ్బులు లేవంటున్నారు.మరి బీహార్ కి లక్షా అరవై అయిదు వేల కోట్ల రూపాయల హామీని ఎలా ఇచ్చారు? దానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? దీని మర్మమేంటో తెలిసీ కూడా చెప్పకపోయావా...అని బేతాళుడు అంటూ ఉండగానే విక్రమార్కుడు కల్పించుకుని ఇక చాలు మాకు తెలుసు ఏమవుతుందో? అని సమాధానం చెప్పడానికి ఉపక్రమించాడు."బేతాళా నువ్వు సత్తెకాలపు ప్రేతాత్మవి. నీకు మాయలు మర్మాలు తెలీవు.రాజకీయాలు ఎత్తుగడలు తెలీవు. ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని టీడీపీ, బిజెపి హామీ ఇచ్చాయి నిజమే. అయితే ఎందుకోసం హామీ ఇచ్చింది. టిడిపి తో పొత్తు కుదుర్చుకుంది కాబట్టి..టిడిపి తో సీట్ల సద్దుబాటు చేసుకుంది కాబట్టి...టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి ఒత్తిడి మేరకు హామీ ఇచ్చింది. అసలే విభజనతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కోపంగా ఉన్నారు కాబట్టి. ప్రత్యేక హోదా ఇస్తే ఓట్లు గుద్దేస్తారని టిడిపి నమ్మబలకడంతోనే బిజెపి హామీ ఇచ్చింది. . ఇపుడు బీహార్ కు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి..అక్కడ ఓటర్లకు గేలం వేయాలి కాబట్టి లక్షా అరవై అయిదు వేల కోట్ల హామీ ఇచ్చారు. హామీలన్నీ ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకోడానికే తప్ప వాటిని అమలు చేసేయాలన్న ఆలోచనలు వెర్రి మొర్రివని చాలా రాజకీయ పార్టీలు అనుకుంటాయి. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి హామీనే తీసుకో. మొన్న ఎన్నికల్లో తమని గెలిపిస్తే..రైతులు ..డ్వాక్రామహిళలకు రుణమాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక సవాలక్ష సాకులు వెతికారు. తోచిన కొర్రీలు పెట్టారు. చివరకు రైతు నెత్తిన కుచ్చుటోపీ పెట్టారు. రుణమాఫీని పక్కన పెట్టారు. రాజకీయ పార్టీల హామీలంటే ఇలాగే ఉంటాయి మరి. " అని విక్రమార్కుడు చెప్పగానే ఈ సారి బేతాళుడు బెదురు చూపులు వేశాడు. విక్రమార్కుడికి నవ్వొచ్చింది. "ఏంటి బేతాళా నా భుజం మీంచి మాయమవ్వడం కూడా మర్చిపోయి అంతలా బెదిరిపోతున్నావేటి" అని ప్రశ్నించాడు. దానికి బేతాళుడు వణుకుతూనే..."మా దెయ్యాలూ..భూతాల కన్నా మీ రాజకీయ నాయకులే భయంకరుల్లా ఉన్నారు .వాళ్ల మాటలు వింటేనే నాకు భయమేస్తోంది" అని చెప్పి మాయమై తిరిగి చెట్టుకు వేలాడాడు.-వీర పిశాచి