పంచ్ పేలాల్సిందే..!

వెంకయ్య నాయుడు ఏం చెప్పిన కత్తిలా చెప్తారు.
అసలు ఆయన ఏం మాట్లాడినా పంచ్ పేలాల్సిందే.
ఇపుడంటే పంచ్ అనగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెబుతున్నారు కానీ..
కొన్నేళ్ల క్రితం వరకు ..అంటే  మా వెంకయ్యనాయుడు మాంచి వయసులో ఉన్నప్పుడు పంచ్  అంటే వెంకయ్య నాయుడే మరి.
నిన్నా మొన్నటి వరకు కూడా వెంకయ్య  పంచ్ లు అదుర్సే.
కానీ ఆరు నెల‌లు తిరిగితే వారు వీర‌వుతార‌ని చెబుతారు. కానీ ఆరారు సంవ‌త్స‌రాలు క‌లిసి తిరుగుతున్నందున చంద్ర‌బాబు నాయుడు ల‌క్ష‌ణాలు చాలా వ‌ర‌కు వెంక‌య్య నాయుడికి వ‌స్తున్నాయ‌ని బీజేపీ నేత‌లే అంటున్నారు. ఇటీవ‌ల కాలంలో చంద్ర‌బాబు క‌నిపిస్తే చాలు వెంక‌య్య నాయుడు అదేప‌నిగా పొగిడేయ‌టం, ఢిల్లీలో క‌న్నా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే ఎక్కువ తిరుగుతుండ‌టంతో బాబు రూటును వెంక‌య్య నాయుడు ఫాలో అవుతున్నార‌న్న మాట వినిపిస్తోంది. 
నిన్నటికి నిన్న వెంకయ్య నాయుడు ఏమన్నారంటే  రాజకీయ పార్టీలు  రుణమాఫీ హామీని ఇవ్వనే ఇవ్వకూడదని అన్నారు. అది అస్సలు మంచి పద్ధతి కాదని ఆయన  హితవు పలికారు. రైతులు తాము తీసుకున్న రుణాలను బాధ్యతగా తిరిగి చెల్లించేలా చూడాలే తప్ప ..వారిని సోమరులను చేసేలా రుణమాఫీ పధకాలు ప్రకటించడం దారుణమని వెంకయ్య నాయుడు సీరియస్ గానే ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఆయనంటే గిట్టని వాళ్లు మాత్రం వెంకయ్య నాయుణ్ని ఆడిపోసుకుంటున్నారు.
వాళ్లంతా ఏమంటున్నారంటే.. రెండేళ్ల క్రితం  ఆంధ్ర ప్రదేశ్ లో  తెలుగుదేశం  పార్టీ ఎన్నికల్లో  రైతులు, డ్వాక్రామహిళలకు పూర్తిగా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు  ప్రతీ ఎన్నికల సభలోనూ ఈ హామీ ఇస్తూనే వచ్చారు. రుణమాఫీ విషయంలో ఎవరూ అనుమానాలు పెట్టుకోవద్దని పదే పదే చెప్పారు. చంద్రబాబు అలా హామీ ఇచ్చిన అన్ని సభల్లోనూ వెంకయ్య నాయుడు అదే వేదికపై కూర్చుని అంతా విన్నారు. ఆయన చంద్రబాబు అంతటి గొప్ప నాయకుడు ఏపీకి మరొకరు దొరకరని  నిర్మొహమాటంగా పొగిడారు కూడా. అప్పుడు రుణమాఫీ హామీ ఇచ్చినపుడు వెంకయ్య నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని గిట్టని వాళ్లు ఇపుడు నిలదీస్తున్నారు.
అంతే కాదు చంద్రబాబుకి పోటీగా  వెంకయ్య నాయుడు  తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యక హోదా తెస్తామంటూ అది తన బాధ్యతే నంటూ  మైకు పుచ్చుకుని చెప్పుకొచ్చారు.
తీరా అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా ఏది మాస్టారూ? అని అడిగితే వెంకయ్యనాయుడు  నీళ్లు నములుతున్నారు. ఇషయం ఏంటంటే  ఏపీకి ప్రత్యేక హోదా రావడం అసలు చంద్రబాబునాయుడికే ఇష్టం లేదట. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే తనకేమీ లాభం ఉండదని చంద్రబాబు అనుకుంటున్నారట. అదే ఏ ప్రత్యేక హోదాయో సాధించుకుంటే తనతో పాటు తన కుమారుడు లోకేష్ బాబుకి కూడా చిన్నవో చితకవో ప్యాకేజీలు వస్తాయని ఆయన అనుకుంటున్నారట. బాబు మనసులో మాటను కనిపెట్టిన వెంకయ్య నాయుడు అందుకే ప్రత్యేక హోదా విషయంలో ఏమీ మాట్లాడ్డం లేదట.పైగా  చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక  వెంకయ్య నాయుడు ఏ స్టేజ్ ఎక్కినా ఏపీకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఆంధ్రుల అదృష్టం అని ఒకటే వీపు గోకేస్తున్నారట.నాయుడు ..నాయుడు దోస్తులు కాబట్టి  కొద్దిగా పొగుడుకుంటే ఫరవాలేదు కానీ మరీ ఇంతలా పొగడాలా అని ఏపీ బిజెపి నేతలే  చెవులు కొరుక్కుంటున్నారని కర్ణ పిశాచుల భోగట్టా.
ఇంతకీ రుణమాఫీ హామీ ఇవ్వకూడదని వెంకయ్య నాయుడు అనడానికి కారణం  గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు హామీ గురించి వెంకయ్య  నాయుడు  మర్చిపోయారా లేక ఇపుడు రుణమాఫీని ఎగ్గొట్టడానికి చూస్తోన్న చంద్రబాబుకు వత్తాసుగానే రుణమాఫీ హామీ ఉండకూడదని అంటున్నారా అన్నది మేథావులకు సైతం అంతు చిక్కడం లేదని ఢిల్లీ వర్గాల భోగట్టా.
అనుమానాలెందుకు? ఓ పాలి వెంకయ్య నాయుడిగోరిని అడిగేస్తే పోలా?





Back to Top