రోడ్డున పడ్డ రోజులు


చంద్రబాబు జ్ఞాపక శక్తి పూర్తిగా క్షీణించింది. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వ్యాధి కానీ వచ్చిందేమో ఓ సారి డాక్టరునైనా సంప్రదించారో లేదో...ఇలా అనుకుంటున్నారు తెలుగు ప్రజలు. చంద్రబాబు వద్దకు ఏవో వినతులు తెచ్చిన ఓ సామాజిక వర్గానికి హామీలకు బదులు చీవాట్లు, బెదిరింపులు దక్కాయి. కోపంలో ఎదుటి వారిపై ఒంటికాలిమీద లేచే సమయంలో కూడా చంద్రబాబు స్వీయోత్కర్షను మానలేరు. ఇది కూడా ఓ విధమైన డిజార్డరే అని ఓ డాక్టర్ సెలవిచ్చారు. తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా ఎవ్వరూ రోడ్డెక్కలేదు. మీరేమిటి వచ్చి నన్ను నిలదీస్తారు. హామీల గురించి గుర్తు చేస్తారంటూ తోక తొక్కిన తాచులా లేచారు ముఖ్యమంత్రి. 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా గతంలో తొమ్మిదేళ్లు చేసారు సరే. ఈ తడవ నాలుగేళ్లను ఎలా మర్చిపోయారబ్బా అనుకుంటున్నారు ఆ మాటలు విన్న జనాలు. అసలు ఆ తొమ్మిదేళ్లలోనే బాబుగారి దయవల్ల రోడ్డున పడ్డ ప్రజల మాట ఎలా మర్చిపోయారబ్బా అని కూడా ఆశ్చర్యపోతన్నారు.
 బషీర్ బాగ్ లో చంద్రబాబు కాల్పులు జరిపింది ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డు మీదకు వచ్చినప్పుడే కదా? పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులపై కాల్పులు జరిగింది రోడ్డు మీద ఉద్యమిస్తున్నప్పుడు కాదా? అంగన్ వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కించింది కూడా వారు నడిరోడ్డు మీద నిరసన ప్రదర్శిస్తున్న సమయంలోనే గదా? కార్మికులపై లాఠీ ఛార్జిలు చేయించింది కూడా ఇళ్లలో కాదే. నట్టనడి బాజరులోనేనే!!  

తొమ్మిదేళ్లనాటి కథలే ఎందుకు? ఈ నాలుగేళ్ల పాలనలో మాత్రం ప్రజలు ప్రశాంతంగా ఇళ్లలో ఉండగలుగుతున్నారా?  రెండేళ్ల క్రిందట వసతి గృహాలు మూసేయద్దంటూ,మెస్ ఛార్జీలు పెంచాలంటూ విద్యార్థులు చేపట్టిన దీక్షలు కూడా రాజధాని నడిబొడ్డున రోడ్డుపైనే గదా! పోలీసుల జులుంతో విద్యార్థులపై లాఠీ ఛార్జీలు చేయించింది కూడా అవే రోడ్ల మీద గదా? మద్యపానానికి వ్యతిరేకంగా మహిళలు చేసిన ఆందోళనలు కూడా రోడ్డు మీద లెక్కకు మిక్కిలి ఉన్న మద్యపాన దుకాణాలమీదే కదా? అతివల పోరాటాన్ని కూడా చంద్రబాబు నిర్దాక్ష్యణ్యంగా అణిచేసింది కూడా అదే రోడ్డు మీద అని మరిచిపోయాడా? ఆక్వా బాధితులు, రాజధాని భూముల బాధితులు, కాపు ఉద్యమకారులు, హోదా కోసం పోరాడుతున్న ప్రజలు ఒక్కరేమి ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం, న్యాయం కోసం రోడ్డెక్కుతున్నవారే? తన నియంత పాలనలో ప్రజలను ఖైదీల్లా బయటకు రాకుండా చేయాలనే చంద్రబాబు వైఖరే ఇలాంటి అంహకారపూరిత మాటలకు కారణం. ప్రజలు రోడ్డుమీదకు రాకపోవడం అంటే పోలీసులతో, బలగాలతో వారి గళాలను అదమడం కాదు, ఉద్యమాలను అణచటం కాదు. ప్రజలు రోడ్డున పడే పరిస్థితి రాకుండా చూడటం. బాబు హయాంలో అది ఎప్పుడూ జరగలేదు. జరగదు కూడా!!!
 
Back to Top