పెచారం కోసం పేనాలు తోడేశారు

బోయపాటి సినిమా సీదేసిందండీ అన్నాడు గోపాత్రుడు.

అదేంట్రా...మొన్న
సింహ సూపర్ హిట్ అయ్యింది...నిన్నటికి నిన్న లెజండ్  కూడా హిట్ అయ్యింది
కదరా.  ఏ సినిమారా ఫ్లాప్ అయ్యింది అని  గట్టిగానే అడిగేశాను.నిజానికి
గోపాత్రుడికి సినిమా నాలెడ్జ్ ఎక్కువ. నాకు సినిమాల్లో మిడి మిడి
జ్ఞాన‌మే.అయినా  బోయపాటి సినిమా సీదేసిందని గోపాత్రుడు  పప్పులో ఎలా
కాలేశాడా అని ఆశ్చర్యపోతూనే...వాడికి బదులిచ్చాను.
పొట్ట చెక్కలయ్యేలా నవ్వేశాడు గోపాత్రుడు.
నవ్వు ఆపుకోలేకపోతున్నాడు.కళ్లల్లోంచి నీళ్లు కారేలా నవ్వుతూనే ఉన్నాడు.
నాకు
వళ్లు మండింది. సీరియస్ గా మాట్లాడుతోంటే  ఆ ఎర్రినవ్వేట్రా ఎదవనాయాలా అని
 క్లాస్ తీసుకున్నా. కాసేపటికి  వాడు తమాయించుకుని..అది కాదు గురూగోరూ
మీకు   సినిమా నాలెడ్జే కాదు...జనరల్ నాలెడ్జ్ కూడా   లేదండీ బాబూ అని
మళ్లీ నవ్వందుకున్నాడు.
చెప్పొద్దూ..నాకు మండుకొచ్చింది.
నా శిష్యుడే నన్ను వేళాకోళం చేయడాన్ని భరించలేకపోయాను.
గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లు..నాకు జనరల్ నాలెడ్జ్ లేదని చెప్పడానికి నీకెన్ని గుండెలురా అని మండి పడ్డాను.
నా
కోపాన్ని చూసి గోపాత్రుడు తగ్గాడు. చెమించండి గురూగోరూ... నేను
నవ్వాపుకోలేక నవ్వాను కానీ..మీరంటే గౌరవం లేక కాదండీ అని లెంపలు
వాయించుకున్నాడు. మరి బోయపాటి సినిమా సంగతేట్రా అని అడిగాను.
అదేనండీ
బాబూ మొన్న సెంద్రబాబునాయుడుగోరు బోయపాటి శీనును పిలిచి  మీ సినిమావాళ్లకి
కలర్స్ బాగా తెలుస్తాయి..నువ్వు  ఓ మంచి సినిమా తీయాలోయ్ అని  అన్నారటండి.
అన్నాడు.
 ఏటి..మా చంద్రబాబునాయుడు  గారు సినిమాలు కూడా
తీస్తున్నారా  అని  ఆశ్చర్యపోయాను.అయినా వాళ్ల బావగారు బాలకృష్ణ... తమ్ముడి
కొడుకు నారా రోహిత్ కూడా సినిమా జనమే కాబట్టి  ఆ కళ చంద్రబాబుగారికి కూడా
అంటుకుందేమోనని సరిపెట్టుకున్నాను. 
ఇంతకీ ఏ సినిమారా గోపాత్రుడూ? ఎవరు హీరో?  హీరోయిన్ ఎవరు?  అని ప్రశ్నలపై ప్రశ్నలు వేసేశాను ఆతృత పట్టలేక.
గోపాత్రుడు మళ్లీ విరగబడి నవ్వడం మొదలు పెట్టాడు.
ఇంకో సారి నవ్వావంటే  నాలిక సీరేస్తాను ఎదవా అని తిట్టాను.
లేకపోతే
ఏటండీ గురూగోరు... సెందరబాబుగోరు  తీయమన్నది నిజం సినిమా కాదండీ బాబూ.
మొన్న పుష్కరాలు మొదలయ్యాయి కద.  పుస్కరాల మొదటి రోజున...గోదావరి
ఒడ్డున...చంద్రబాబుగోరు...ఆయన  ఇంటావిడ భువనేశ్వరి గోరు  కలిసి అక్కడ పూజ
చేశారండీ బాబూ. ఆ పూజతో పాటు  పుస్కరాలకు    వచ్చిన జెనాన్ని...కలిపి ఓ
డాక్యుమెంట్రీ లాంటిది తీయమన్నారటండీ. బోయపాటి గోరు వచ్చి  సినిమా  షూటింగ్
 మొదలు పెట్టాడు.
ఇంతకీ ఈ డాక్యుమెంటరీ సినిమా ఎందుకోసం తీయమన్నార్రా అని అడిగాను.
అయ్ బాబోయ్ ఆ మాత్రం తెలీదాండీ మీకు..సింగపూర్..జపాన్...చైనా..మలేసియా...దేశాల
వాల్లు మన ఏపీలో  కంపెనీలు పెట్టాలంటే వాళ్లని ఆకట్టుకోవాలి కదండీ
బాబూ.అందుకే ఈ సినిమా తీయించి విదేశీ టీవీల్లో వేయాలని చంద్రబాబుగోరు
అనుకున్నారు అన్నాడు గోపాత్రుడు.
నేను అర్ధోక్తిగా ఆలోచిస్తూ ఉండగానే...గోపాత్రుడు అందుకున్నాడు.
 బోయపాటి
గోరు షూటింగ్ చేత్తా ఉండగానే సినిమా సీదేసిందండీ బాబూ అన్నాడు.షూటింగ్
లోనే సీదేయడమేంట్రా నీ మొకం ఏం జిరగిందో చెప్పు అన్నాను.
షూటింగ్
 కొంత కాంగానే...స్నానాలకోసం గంటల తరబడి  ఎదురు చూస్తోన్న జనాన్ని
ఒక్కపాలిగా వదిలేరండీ. ఇక  చూసుకోండి జెనం  ఒక్కపాలిగా   ఒకరినొకరు
తోసుకుంటూ  గోదావరి దాకా వచ్చేసారండి. పాపం ముసలోళ్లు...చిన్నపిల్లలు  ఆ
తోపులాటలో ఊపిరాడక  పేనాలు వదిలేశారండి.
అందరూ సంతోషంగా  స్నానాలు చేద్దామనుకుంటే..
అక్కడంతా ఏడుపులు పెడబొబ్బలూనండీ  గురూగోరు. అని గోపాత్రుడు చెప్పుకుపోతున్నాడు.
అయినా  చంద్రబాబునాయుడు లాంటి విఐపీల కోసం ఘాట్ లు కట్టకపోవడమేంట్రా   అని అడిగాను.
కట్టకపోవడమేటండీ
 బాబూ.  చాలానే ఉన్నాయి. కాకపోతే మామూలు ఘాట్ కాడ అయితే జెనం ఎక్కువగా
ఉంటారు కదా. సినిమా రిచ్ గా వస్తుందని చంద్రబాబుగోరు..బోయపాటి శీనుగోరు
అనుకుని ఉంటారండీ అన్నాడు గోపాత్రుడు.
డాక్యుమెంటరీ కోసం    ఓ 32 మంది ప్రాణాలు బలితీసుకుంటార్రా అని అడిగాను.
ఏటి చేత్తారండీ? వాళ్లేమో సినిమా తీద్దామనుకున్నారు.
అదేమో  ట్రాజెడీ సినిమా అయిపోయింది. అన్నాడు గోపాత్రుడు.
ప్రభుత్వ బాకా కోసం...ప్రజల ప్రాణాలు  పణంగా పెట్టడం తప్పు కాదురా? అని గోపాత్రుణ్ని నిలదీశాను.
గోపాత్రుడు సమాధానం చెప్పలేదు.
 ఓ వెర్రి నవ్వు నవ్వాడు.
అంతకన్నా వాడు మాత్రం ఏం చేస్తాడు.?ఏం చెప్తాడు?

-కవికాకి

తాజా వీడియోలు

Back to Top