పవర్ కోసం పవన్ పోరాటం

ప్రత్యేక హోదా విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంత పవర్ ఫుల్ గా పోరాడటం లేదని తెలుగు ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.
ఈ విషయం బహుశా  ఆ చెవిని..ఆ చెవిని..దాటి  పవన్ కళ్యాణ్ ని కూడా చేరి ఉంటుందని అనుకోవాలి.
అందుకే  ఇకపై పవర్ ఫుల్ గా తయారు కావాలని  పవన్ కళ్యాణ్ డిసైడైపోయారు.
పవర్ ఫుల్ కావాలంటే చేతిలో పవర్ ఉండాలి.
పవర్ రావాలంటే ఎన్నికల బరిలో దిగాలి.
అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లాలో ప్రకటించారు.
ఎవరినీ నొప్పించడం ఆయనకు ఇష్టం ఉండదు.
అంత సున్నిత మనస్కులు ఆయన.
ప్రత్యేకించి తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడిని పల్లెత్తు మాట అనాలంటే  పవన్ కళ్యాణ్ కి బెంగ వచ్చేస్తుంది. చంద్రబాబు ఎక్కడ నొచ్చుకుంటారో ఏమోనని ..పవన్ కళ్యాణ్ నోరు  కట్టేసుకోవలసి వస్తోంది.
ఈ విషయంలో పాపం పవన్ కళ్యాణ్ ని చూస్తే  నాకు చాలా జాలేస్తోంది.
ప్రత్యేక హోదా సాధించని చంద్రబాబంటే  ఒళ్లు మండిపోతూ ఉంటుంది పవన్  కళ్యాణ్ కి.
కానీ చంద్రబాబును ఏమనడానికీ మనసొప్పదు.
అందుకే ..చంద్రబాబును అనాల్సిన  నాలుగు మాటలనూ సుజనా చౌదరినీ..మురళీమోహన్నీ.. లేదంటే ఢిల్లీలో ఉన్న అశోక్ గజపతి రాజునీ అనేస్తూ ఉంటారు.
వాళ్ల వల్లనే  ప్రత్యేక హోదా రాలేదని రగిలిపోతూ ఉంటారు.
పార్లమెంటు తలుపులు మూసేసి.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేసి ఆంధ్రులను  అష్టకష్టాల పాలు చేసిన కాంగ్రెస్ పై ఆయనకు మండిపోతూ ఉంటుంది. కానీ  అప్పుడు కాంగ్రెస్ లో  మంత్రి పదవిని చక్కగా అనుభవిస్తూ..సోనియా గాంధీకి వంగి వంగి దండాలు పెడుతూ విభజనను అడ్డుకోడానికి ఏమీ చేయని తన అన్న చిరంజీవిని మాత్రం పల్లెత్తు మాట అనాలంటే పవన్ కళ్యాణ్ కు గుండె మండిపోతుంది.
అది చాలా కష్టమైన పని కదా. అందుకే లోలోనే ఆయన బాధతో కాలిపోతూ ఉంటారు.
ప్రత్యేక హోదా ఇస్తామని హామీనిచ్చి ఇపుడు వెనక్కి పోయిన బిజెపిని ఏమనాలన్నా పవన్ కళ్యాణ్ మనసుకి కష్టంగా ఉంటుంది. అందుకే బిజెపిని.. మోదీని ఏమీ అనలేక.. వెంకయ్యనాయుడిని జాడించి పారేస్తూ ఉంటారు. 
ఇలా  కొందరిని తిట్టాలని ఉన్నా తిట్టలేకపోవడం..
కోపంతో కడిగేయాలని ఉన్నా..కోపాన్ని దిగమింగుకోవలసిరావడం..
తిట్టాల్సిన వారిని తిట్టలేకపోవడం వల్ల..  ఎవరో ఒకరిని టార్గెట్ చేసుకుని కసితీరా తిట్టేయడం
ఇలాంటి.. మానసిక సంఘర్షణలతో పవన్ కళ్యాణ్ పాపం నలిగిపోతున్నారు.
అయినా సరే..ప్రత్యేక హోదా కోసం తాను పోరాడుతూనే ఉంటానని ఓ భరోసా ఇచ్చారాయన.
రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కి అనుభవం లేకపోవచ్చు.
కానీ రాజకీయాల్లో కాకలు తీరిన వారు సైతం అసూయపడేంతటి స్థిత ప్రజ్ఞత  సాధించేశారు పవన్  కళ్యాన్.
సివరాఖరుగా వెనుక బడ్డ అనంతపురం జిల్లా నుండే  ఎన్నికల బరిలో దిగాలని ఆయన నిర్ణయించుకోవడం మాత్రం చాలా గొప్ప నిర్ణయమని గుర్తు తెలియని అభిమానులు ఎవరికీ తెలీకుండా రహస్యంగా చెవులు కొరుక్కుంటోన్నట్లు  కర్ణపిశాచుల భోగట్టా.
ఎన్నికల్లో ఓడినా గెలిచినా.. తాను మాత్రం పోటీ చేస్తానన్నారాయన.
ఎన్నికల్లో ఆయన గెలుస్తారా ఓడిపోతారా అన్న బెంగ నాకు లేదు.
నేను మాత్రం ఒక్క ఓటయినా ఆయనకు వేస్తాను.
ఎందుకంటే 2019లో ఆయన గెలిస్తే.. అప్పుడైనా ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేదో చంద్రబాబును నిలదీయకపోతారా అని నేననుకుంటున్నాను. ఆయన నిలదీస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన  మాటిస్తే ఆడి తప్పరట కదా.
--------------------
-కవికాకి
Back to Top