పప్పేష్ పాఠం మాస్టారికి గుణపాఠం


పప్పేష్ పదనిసలు సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ కంటే  ఉషారుగా పోతున్నాయి. ఎప్పుడు ఏ మైకు ముందు, ఏ అపస్వరం పలుకుతాడో అని బాబుగారి గుబులైతే, దాన్ని పట్టుకుని నాదస్వరం ఎలా ఊదాలా అని సోషల్ మీడియా కాసుక్కుర్చుంది. గత కొన్నాళ్లుగా పప్పేష్ గప్ చుప్ గా ఉంటున్నాడు. అసలెక్కడా ప్రసంగాలు చేయడం లేదు. విషయం ఏమిటని ఆరాతీస్తే పప్పేష్ క్లాసుల్లో ఉన్నాడట. ఏం క్లాసులనుకుంటున్నారా...తప్పులు లేకుండా తెలుగు మాట్లాడటం ఎలా అనే విషయం మీద పాఠాలు చెప్పించుకుంటున్నాడట. పప్పేష్ కి ట్రైనింగ్ ఇచ్చేందుకు, ఆ ఇచ్చిన ట్రైనింగ్ ఎంత వరకూ సక్సెస్ అయ్యిందో తెల్సుకునేందుకు సదరు మాస్టారు పప్పేష్ తో బాటే ప్రతి చోటకూ తిరుగుతున్నార్ట. పాఠాల తర్వాత తన స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ స్వయంగా చూడాలని పప్పేష్ ప్రసంగిస్తున్న బహిరంగ సభకు వెళ్లాడట ఆ మాస్టారు. ఎంతో చక్కగా ప్రసంగాన్ని రాసి, బట్టీపట్టించి తప్పులు పోకుండా అప్పజెప్పమని దీవించి స్టేజ్ మీదకు పంపి, ఆయనెళ్లి గుంపులో నిలబడ్డారు. 
మైకు మీద రెండు మొట్టికాయలు మొట్టి, గొంతను ఓ దగ్గుతో సవరించుకుని పప్పేష్ తన ప్రసంగం మొదలెట్టాడు.  ప్రజలందరికీ నమస్కారం. నేను మీకోసమే వచ్చాను. మా నాన్న పంపిస్తే వచ్చాను. గ్రామాల్లో తాగు నీటి ఇబ్బంది ఏర్పాటు చేస్తాను. తాగునీటి సమస్య సృష్టించడమే నా లక్ష్యం అని తెలియజేస్తున్నాను అని నమస్కరించాడు. అంతా విన్న మాస్టారు నెత్తి కొట్టుకున్నారు. 
ఇలా లాభం లేదని ఆలోచించి నాయనా పప్పం...నువ్వు నేరుగా మైకు ముందు నిల్చుని మాట్లాడొద్దు..మీ నాన్నగారి పంచరైన సైకిలెక్కి ప్రయాణం చేస్తూ మాట్లాడు. ఏం మాట్లాడినా ఆ ఆయాసంలో కొట్టుకు పోతుంది అని సలహా ఇచ్చాడు మాస్టారు. 
పప్పేష్ సైకిల్ యాత్ర మొదలైంది. మీరీ సైకిల్ యాత్ర ఎందుకు చేస్తున్నట్టు అడిగాడు విలేఖరి మరో సైకిల్ మీద పప్పేష్ ను తరుముతూ...
ప్రత్యేక హోదా ఉద్యమానికి ఏదో ఒకటి చేయాలిగదా...నాలుగేళ్లుగా ఎదుచూసి, ఒకటికి పదిసార్లు మాట్లాడి..అయినా రాష్ట్ర విభజన చేయకపోతే చిరాకొచ్చి ఇలా సైకిల్ తొక్కుతున్నా...అన్నాడు.
వెనకాలే సైకిల్ మీద వస్తున్న మాస్టారు అది విని సడన్ బ్రేకు వేసి సైకిల్ బెల్లు మీద నెత్తి బాదుకున్నారు.
కొన్నాళ్ల తర్వాత పప్పేష్ కి పాఠాలు చెప్పిన మాస్టారికి కృతజ్ఞతగా మంచి కొత్త ఉద్యోగం ఇచ్చారు. రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోవాలో చెప్పేందుకు ప్రణాళికలు వేయమని ఆ మాస్టారికి పదవి ఇచ్చి, జీతమిచ్చి, కారు ఇచ్చి, ఇద్దరు అసిస్టెంట్లను ఇచ్చి కూర్చోబెట్టారు. ప్రణాళిక సంఘం ఎప్పుడు సమావేశమైనా రాష్ట్రానికి మంచినీళ్ల ఇబ్బంది ఏర్పాటు చేసే ప్రణాళిక, రోడ్లను తవ్వించేసే ప్రణాళిక, పేదలకు ఇళ్లు లేకుండా చేసే ప్రణాళికా చెబుతున్నాడట ఆ మాస్టారు.
 
Back to Top