మాయలోడు

మాయల ఫకీరు బాబు  ఎర్రబుగ్గ కారులో, నల్ల కోటు సైన్యంతో బిలబిలా వచ్చి దిగాడు
ఓం హాం ఫట్
హీం గీం ఝఠ్ అన్నాడు. 
బర్రుమని శబ్దం మెదలైంది. 
ఏదో మాయో మంత్రమో చేస్తున్నాడు ఫకీరు బాబు గారు అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు.
పెద్ద పెద్ద గొట్టాల మధ్యలోంచి గుర్రు బర్రు మని శబ్దాలు వస్తున్నాయి.
అదిగో ఆకాశంలో చూడండి మబ్బుల గుంపు అన్నాడు ఫకీరు బాబు.
అందరూ ఆ వంక  చూశారు.
చుర్రుమంది ఎండ. 
అందరూ కళ్లు నులుముకునేలోపు, 
జఠ్ జఠ్ ఫట్ ఫట్ అంటూ గుప్పెళ్ల కొద్దీ పసుపూ కుంకాలు విసిరాడు ఫకీర్ బాబు.
అవి ఎగిరి అక్కడున్న అందరి ముఖాల మీద పడ్డాయి. 
కిందకి చూడండి అన్నాడు బాబు. 
ఏం మాయ జరిగిందో అని ఆత్రంగా కిందకు చూసారు జనాలు మళ్లీ కళ్లు తుడుచుకుంటూ.
అదిగో జల వాహిని. సుజల తరంగిణి. జల జలా గల గలా ముందుకు పోయిందీ అన్నాడు చేతులు అంత దూరానికి చూపిస్తూ.
ఎక్కడ ఫకీరు బాబూ కనిపించలేదే అన్నారు ప్రజలు కళ్లల్లో కొట్టిన రంగులు ఇంకోసారి దులుపుకుని. 
మీ కళ్లకు పొరలు కమ్మాయి. ఆ నీళ్లను చూసి కన్నీళ్లొచ్చి ముందేముందో మీకేం కనిపించడం లేదు. ప్రవాహంలా పోతున్నజలధార మీకు కనిపించలేదా…? గలగలా అంటూ చేసే గోదారి సడి మీకు వినిపించలేదా…అన్నాడు.
కళ్ళు సరిగ్గా ఆనటం లేదేమో అనుకుని చెవులు రిక్కించారు అందరూ.
బుర్రు…గుర్రు అని వినిపిస్తోంది. ఇది నీళ్లసడా…ముళ్లపంది చప్పుడా అని బుర్రగోక్కోడం మొదలెట్టారు. 
చెప్పినట్టే నా మంత్రదండంతో మూడు ఝాముల్లో ముఫై యోజనాలు నీటిని పారించాను. నా యావత్ శక్తినీ ఈ యజ్ఞానికి ధారపోసాను. ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న మీ కల నిజం చేసాను. ఇంక నీటి కొరత లేదు మీకు. ఏటా ఇలాగే ఏదో ఒక’’పురుషోత్తమ’’మైన పని చేస్తాను అని చెప్పి తన సైన్యంతో వెళ్లిపోయాడు ఫకీరు బాబు. 
ఫకీరు బాబు వెళ్లిన కాసేపటి దాకా బుర్రు గుర్రు అని వచ్చే శబ్దం వైపే చూస్తూ ఉండిపోయారు అక్కడ నిలబడ్డ వారు.
కాసేపటికి ఆ శబ్దం ఆగిపోయింది. 
ఏంటబ్బా అనుకుంటూ ఆ శబ్దం వచ్చిన వైపుగా వెళ్లారు. 
అక్కడ ఫకీరు బాబు గడ్డం పట్టుకు వేళ్లాడే కొందరు శిష్యులున్నారు. మోటారు పరికరాలను విప్పి సర్దుతున్నారు.
ఏంటయ్యా ఇది అడిగారు వాళ్లు.
పక్క పొలంలో నీళ్ల మోటరు. అరగంట ఖాళీగా ఆడించి తీసుకుపొమ్మన్నారు. ఆడించాం తీసుకు పోతున్నాం అని చక్కా పోయారు శిష్యులు.
ఆశ్చర్యంతో నోరు తెరుచుకున్న వాళ్లకి ఫకీరు బాబు కళ్లల్లో కొట్టిన రంగులు తుడుచుకుందామన్నా అక్కడ చుక్క నీరు కనిపించలేదు. 
Back to Top