పచ్చ కాంగ్రెస్

పచ్చ చొక్కా వేసుకున్న
కాంగ్రెస్ మనిషి చంద్రబాబు అని బిజెపి నేత సొము వీర్రాజు అనడంలో అతిశయోక్తి లేదు. తమ తెగతెంపులు చేసుకున్నాడన్న
అక్కసుతో బిజేపీ నేతలు ఈమాటలు అన్నారనడానికి లేదు. బాబు కాంగ్రెస్ ల బంధం తడికెల చాటు నుంచి తెరమీదకు
రానే వచ్చింది. బాబు పార్టీల పొత్తు లీల గురించి ప్రతిపక్ష పార్టీ బాహాటంగానే కొర్రు కాల్చి
వాత పెడుతోంది. నిస్సుగ్గు రాజకీయాలు, పొత్తులపై చంద్రబాబును చీల్చి చెండాడుతున్నారు వైఎస్
జగన్. ఎంతమందితో సంసారం చేస్తావు బాబూ అంటూ మహా ఘాటుగా విమర్శిస్తున్నారు.

రాజకీయ గ్రంధసాంగుల
జాబితాలో చంద్రబాబు ముందు వరసలో ఉంటారు. పచ్చపార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో బహిరంగంగానే
కలిపేస్తున్నారు. నిజానికి చంద్రబాబు పార్టీలో ఇప్పుడున్నవారంతా తలో పార్టీ తానులోని గుడ్డ
ముక్కలే. టిఆర్ఎస్, కాంగ్రెస్ లనుంచి అత్యధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారిని
కూడా తెచ్చుకుని సాగుతున్న పార్టీ టిడిపి. సకల జన సమూహం లాగా, నానాజాతి సమితి లాగా, వివిధ పార్టీల వారంతా
కలిసి పేనిన అతుకుల గుడ్డ టిడిపి. అయితే అతుకుల బొంత చీలకలు, పేలికలు అయ్యే అవకాశాలే
ఎక్కువ కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ వర్గమూ చంద్రబాబును నమ్మడం లేదు. అధికారంలోకి రాక ముందు
మారిన మనిషిని అంటూ సాధుజీవిలా నాటకం ఆడిన బాబు బండారం కొన్నాళ్లకే బట్టబయలైంది. మేకవన్నె పులిలాగా ఎన్నికల
వేళ బాబు వేసిన వేషాన్ని నమ్మి దగాపడ్డ తెలుగు ప్రజలు, ఇప్పుడు దుడ్డుకర్రతో
బాబు నడ్డి విరగ్గొట్టాలని కాలం కోసం కాచుకుని కూర్చున్నారు. బాబు అసమర్థత, బిజెపి చేసిన మోసం రెండూ
ఆంధ్రరాష్ట్రానికి తీరని అన్యాయమే చేసాయి. ప్రజా వ్యతిరేకతకు దడిసి బిజెపి నుంచి దూరమయ్యామని
చెప్పిన బాబు, ఎన్నికల్లో మళ్లీ వీపు ఆనుకునేందుకు మరో పార్టీ గోడను వెతుక్కుంటున్నాడు. రాష్ట్రాన్ని విభజించిందని, అన్యాయం చేసిందని తిట్టిపోసిన
కాంగ్రెస్ పార్టీతోనే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. రాహుల్ గాంధీతో ముసిముసి
నవ్వులు, హస్తం గుర్తు చూపిస్తూ పొత్తు సంకేతాలు, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయడం, కాంగ్రెస్ అధ్యక్షుడి
సమావేశానికి కోడలిని పంపడం, హోదాను ఇచ్చేది కాంగ్రెస్సే అని నమ్ముతున్నామని చెప్పడం...ఇవన్నీ కాంగ్రెస్ లో
కలిసిపోతున్న పచ్చ పార్టీ ప్రదర్శిస్తున్న రంగులు.

ఢిల్లీ నుంచి ఇలా కబురందగానే
చంద్రబాబు ఉన్నపళాన పార్టీ ముఖ్యలతో భేటి అయ్యారు. కాంగ్రెస్ తో పొత్తు ఖరారు అనే సంకేతాలు పార్టీ నేతలకు
సవివరంగా ఇచ్చేసారు. జాతీయ పార్టీతో పొత్తు లేకుండా, జాతీయ పార్టీల అండ లేకుండా రాష్ట్రం గెలవడం చంద్రబాబుకు
ఎప్పుడూ ఆసాధ్యమే. ఇప్పుడూ అదే కథ రిపీట్ అవుతోంది. పుట్టినప్పటి నుంచీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోని
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించడానికి చంద్రబాబుకు జాతీయ పార్టీల అండ తప్పనిసరి
అవుతోంది. గత ఎన్నికల్లోనూ చంద్రబాబు ఇదే పంథా అనుసరించారు. ఈసారి బద్ధశత్రువు అన్న
నోటితోనే కాంగ్రెస్తో పొత్తు అంటున్నారు. ఇకపై తమ పార్టీని చంద్ర కాంగ్రెస్ గా పిలవాలని ఆయన
చెప్పకనే చెప్పినట్టైంది. 

Back to Top