మన వాళ్లు ఉత్త వెధవాయిలోయ్ !


మనవాళ్లు ఉత్తి వెధవాయిలోయ్....ఈ మాటన్నది కన్యాశుల్కంలో గిరీశం అనుకునేరు. అప్పుడు ఆయన అన్నాడు కాని ఇప్పుడు పదే పదే జెసి దివాకర్ రెడ్డి అంటున్నాడు. మా పార్టీలో ఉన్నవాళ్లు waste fellows కనకే ఒక్క పథకం సరిగ్గా లేదు. రాష్ట్రానికి దమ్మిడీ ఉపయోగం లేదు అని తేల్చి అవతల పారేశాడు. గిరీశం తర్వాత గిరీశం అంతటోడు మన జెసి అనుకుంటున్నారు తెలుగు ప్రజలు. 
అనంత పురంలో జెసి మళ్లీ ఫైరింగ్ చేసాడు. ఎమ్.పిల ఒక్క రోజు దీక్షలో తోటి ఎంపిలను ఎమ్మెల్యేలను ఉతికారేసాడు. టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపిలు అందరూ పనికిరానివారే అని తేల్చి పారేశాడు. టిడిపిలో అందరూ వేస్టే అంటూ ఫైరైపోయాడు జెసి. అందుకే ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదని అన్నాడు. చంద్రబాబు చేస్తున్న పథకాలన్నీ కొరగాకుండా పోతున్నాయని కుండ బద్దలు కొట్టాడు. రేషన్ షాపుల్లో ఇస్తున్న ఒక రూపాయికి కిలో బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిపోతోందని కూడా విమర్శించాడు. తనకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడని, ఇచ్చినా ఉంచడని ఎద్దేవా చేసాడు. సిఎం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు అని తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు సచివాలయంలో ఉన్నవాళ్లంతా నా దగ్గర పనిచేసినవాళ్లే అన్నాడు జెసి.  పనిలో పనిగా కమ్యూనిస్టులపైనా విరుచుకుపడ్డాడు చేసి. జెసి దివాకర్ రెడ్డి విమర్శల ఫైరింగ్ కు వేదిక మీదున్న టిడిపి నేతలు ముఖాలు మాడిపోయాయి. ఎప్పుడూ సొంత పార్టీనే ఇరుకున పెట్టేలా మాట్లాడే జేసిని ఏమీ అనలేక మల్ల గుల్లాలు పడిపోయారు. 
చంద్రబాబును మోసగాడని, సిఎమ్ రమేష్ దీక్ష శుద్ధ దండగని, లోకేష్ సిఎమ్ గా ఎందుకు పనికిరాడని, మోదీ ఉండగా రాష్ట్రానికి బెల్లం ముక్క కూడా రాదని జెసి ఏది మాట్లాడినా సంచలనమే. కాకపోతే ఆ సంచలనాలన్నీ తెలుగు తమ్ముళ్ల మతి చలనానికి కారణం అవుతున్నాయి. 

Back to Top