ఒక ఐడియా...సిఎం పీఠాన్నే మార్చేస్తుంది

"ఇక మూసేశారూ అనుకున్న  ఓటుకు కోట్లు కేసు మళ్లీ కదలడం అన్యాయం.
ప్రత్యేక హోదా కావాలంటూ..ప్రతిపక్ష వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నిరాటంకంగా పోరాటం కొనసాగిస్తూ ఉండడం దుర్మార్గం.
ప్రత్యేక హోదా ఇక లేదని మా సుజనా చౌదరి చేత నిజాయితీగా చెప్పిస్తే.. తెలుగు ప్రజలను మేం మోసం చేశామనడం అరాచకం.
ఎన్నికల్లో ఓట్లకోసం అన్ని రకాల రుణాలనూ పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చినంత మాత్రాన.. ఆ హామీని ఇపుడు అమలు చేయాలని  అడగడం దారుణం.
ఎన్నికల్లో కావల్సిన ఖర్చులకు డబ్బులు సమకూర్చిపెట్టిన వారికి నాలుగు డబ్బులు వెనకేసుకునేలా చేయడం కోసం... రాజధాని నగరాన్ని నచ్చిన చోట కట్టుకుంటూ ఉంటే... దానిపై ఫిర్యాదులు చేయడం...ఘోరాతి ఘోరం.
పార్టీకి..ప్రభుత్వానికి పనికొచ్చే  కొందరు పెద్దలకోసం రైతుల భూములు మర్యాదగా లాక్కుంటే... కొంపలంటుకుపోయినట్లు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో పాటు మిగతా పార్టీలన్నీ నానా యాగీ చేయడం మహాపాపం.
కాపుల ఓట్లకోసం ఎన్నికల్లో ఏదో మాట ఇచ్చాం కదా అని....దాన్ని నెరవేర్చమంటూ వెంటపడ్డం ముద్రగడకు పాడి కాదు. ముద్ర గడ దీక్షకు కాపులందరూ మద్దతు పలకడం దేశ ద్రోహం.కాపులకు ప్రతిపక్షాలు అండగా నిలవడం ఘోరాతి ఘోరం.
కోట్లకు కోట్లు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచిన మంత్రులు..ఎమ్మెల్యేలు తాము ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి సంపాదించుకోడానికి ఇసుక అక్రమ రవాణా , కాల్ మనీ రాకెట్ వంటి కుటీర పరిశ్రమలు పెట్టుకుని ముందుకు పోతూ ఉంటే  ప్రోత్సహించాల్సింది పోయి.. వారిని అవినీతిపరులన్నట్లుగా  ఆరోపణలు చేయడం క్షమించరాని నేరం.
స్విస్ ఛాలెంజ్ తో రాజధాని నిర్మాణ పనులు కానిచ్చేద్దాం అనుకుంటే.. కోర్టులో సవాల్ చేసి దానిపై మొట్టికాయలు కొట్టించడం కౄరాతి కౄరం.
మాకు అన్ని విధాల అండగా నిలబడుతూ..ప్రత్యేక హోదా విషయంలో  మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా..మేం చాలా కష్టపడుతున్నాం అని కితాబు నిచ్చిన ప్రాణమిత్రుడు పవన్ కళ్యాణ్   ను అందరూ ఆడిపోసుకోవడం అమానుషం. ఎమ్మెల్సీ  ఎన్నికల్లో బలం లేదుకాబట్టి.. నాలుగు డబ్బులు ఇవ్వందే ఎవరూ ఓటు వేయరు కాబట్టి పెతిపక్షానికి చెందిన నేతలను కోట్లు పెట్టి కొని కష్టపడి గెలిస్తే..అక్రమం జరిగిందని అల్లరి చేయడం అన్యాయం"....
అమరావతిలో తన ఛాంబర్ లో కూర్చుని చంద్రబాబు ముత్యాలకోవలాంటి దస్తూరీతో ఇలా రాసుకుపోతూ ఉన్న తరుణంలో.. ఎప్పుడొచ్చాడో కానీ.. వెనుక నుంచి లోకేష్ బాబు ప్రతీ అక్షరం పొల్లుపోకుండా చదువుతూ కనిపించడంతో..చంద్రబాబు ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు.
"నాన్నారూ..చాలా బాగా రాస్తున్నారు. మరి నాకు మంత్రి పదవి ఇవ్వాలని మీకు ఉన్నా.. కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడాల్సి రావడం కూడా ఘోరమని రాయండి నాన్నారూ" అని లోకేష్ బాబు ముసి ముసిగా నవ్వుతూ అన్నారు.
చంద్రబాబు తనయుని వంక ఆప్యాయంగా చూసి...ముందు  ఈ ఓటుకు కోట్లు కేసు గొడవ ఓ కొలిక్కి రానీరా నాయనా..ఆ తర్వాత ఏం కావాలంటే అది చేస్తాను ఊరికే కంగారు పడిపోకు" అని అనునయించారు.
లోకేష్ కళ్లు మెరిశాయి.
"నాన్నారూ ఓ మంచి అయిడియా" అన్నాడు లోకేష్ బాబు.
చంద్రబాబు సంతోషాన్ని పట్టలేకపోయారు.
మా బాబే. నీక్కూడా మంచి అయిడియాలు వచ్చేస్తున్నాయంటే ఇక మనకన్నీ మంచి రోజులేరా.. ఏంటా అయిడియా " అని  ఆసక్తిగా అడిగారు.
లోకేష్ బాబు మొహం మతాబులా వెలిగిపోతోంది.
"నాన్నారూ...ఇపుడు ఓటుకు కోట్లు కేసు మళ్లీ విచారిస్తారు కదా. ఒక వేళ మీరు అరెస్ట్ అయ్యారనుకోండి.. అపుడు  మీరు ఎలాగూ ముఖ్యమంత్రిగా ఉండడానికి వీలుండదు కదా. అంచేత మీ తర్వాత ముఖ్యమంత్రిని నేనేనని రాసేయండి. బోడి మంత్రి పదవికోసం కక్కుర్తి పడ్డం ఎందుకు  ఏకంగా సిఎం పోస్టే వచ్చేస్తే చాలా బాగుంటుంది" అన్నాడు.
లోకేష్ బాబు తెలివితేటలకు చంద్రబాబు మొహంలో కత్తివేటుకు నెత్తుటి చుక్కలేదు.
---------------------

Back to Top