నో క్లూ


అమరావతి అభివృద్ధి కనిపించటం లేదా అని అడుగుతున్నాడు మంత్రి నారా లోకేష్. ఎన్నో పత్రికలకు కనిపించిన అమరావతి అభివృద్ధి కేవలం ఒకే ఒక్క పేపర్ కు కనిపించడం లేదని వాపోయారు. అరడజను పత్రికలు, డజను టివి ఛానెళ్లూ నిత్యం భజన చేస్తుండగా ఈ ఒక్క పేపరు మాత్రం ఎందుకు చేయదూ అంటూ ఆడిపోసుకుంటున్నారు. 
అమరావతి అభివృద్ధి కనిపించడం లేదా అంటూ ఇప్పటికి నారా లోకేషే కాదు ఆ పార్టీ నేతలు చాలామంది అడిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సార్లు ప్రజలకు, ప్రతిపక్షానికి అమరావతి అభివృద్ధిని కళ్లకు కట్టినట్టు చూపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసారు. ఇప్పటికే ఎన్నో సార్లు అమరావతిని, అద్భుతమైన దాని అభివృద్ధినీ  గ్రాఫిక్స్ లో చూపించి తరింప చేసారు. బాహుబలి గ్రాఫిక్స్ ను తలదన్నేలా ఉండాలని రాజమౌళిని సంప్రదించి మరీ అమరావతి డిజైన్ ను పేపర్లమీద, సీజీ లోనూ ప్రదర్శించారు. ఇంత చేసినా అమరావతి అభివృద్ధి చెందిందని గుర్తించకపోతే ఎలా అని వాపోతున్నారు.
మంత్రి దేవినేని కూడా చాలా సార్లు అమరావతి అభివృద్ధి ఎందుకు కనిపించడం లేదని ప్రతిపక్షాన్ని అమాయకంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు.  ఆకాశాన్ని తాకే నిర్మాణాలు కనిపించడం లేదా, లక్షలాది ఉద్యోగాలు కనిపించడం లేదా, రోజుకోటిగా పుడుతున్న పరిశ్రమలు కనిపించడం లేదా, వారికి ప్రభుత్వం రాసిచ్చిన భూములు కనిపించడం లేదా అంటూ ఆక్రోశించారు దేవినేని. 
నారా లోకేష్ తమ గొప్పతనంగా చెప్పుకుంటూ, పచ్చ పత్రికలతో పొగిడించుకుంటున్న ఫ్లెక్స్ ట్రానిక్స్ సంస్థకు రాయితీలన్నీ కేంద్రం నుండి లభించేవే. రాష్ట్రంలో ఏం జరుగుతోందో వారికి క్లూ కూడా లేదు అని ఉన్నమాటను ఒప్పుకున్నారు నారా లోకేష్. నిజమే పచ్చపత్రికలు, పచ్చమీడియాకు లీకులు అందినట్టుగా సదరు పత్రికకు లీకులు వచ్చే అవకాశం లేదు. కానీ ప్రభుత్వంలో జరుగుతున్న లొసుగులన్నిటినీ బయటకు లాగి, అభివృద్ధి అని చెప్పుకుంటున్న గొప్పల వెనుక నిజాలను ఆ పత్రిక బైటపెడుతోంది. ప్రసార మాధ్యమాలన్నిటినీ దాదాపుగా పసుపు మయం చేసిన తెలుగు దేశం నేతలకు ఎదురుతిరుగుతూ నిజాలను నిర్భయంగా ప్రజల ముందుంచుతున్న ఆపత్రిక పట్ల వారికున్న అక్కసు ఇంతా అంతా కాదు. ఎన్ని విధాల ప్రయత్నించినా పాఠకుల ఆదరణ తగ్గని ఆ పత్రిక అన్నా, ఛానల్ అన్నా అధికార పక్షానికి అదురు నానాటికీ పెరుగుతోంది. తమ అనుకూల వార్తలు, ఆర్భాట ప్రచారాలకు మాత్రమే ఉన్న మిగతా మీడియాలాగా తమ భజన చేయనందుకు నారా లోకేష్ కు సదరు పత్రికమీదున్న అక్కసంతా ట్విట్టర్ ద్వారా ఇలా తీర్చుకుంటున్నాడన్నాడంటున్నారు విశ్లేషకులు.  ఇంతకీ నాలుగేళ్లుగా అభివృద్ధి, ప్రపంచస్థాయి రాజధాని, 2050 విజన్ ముఖ్యమంత్రి గారిని నమ్మి 2019లో తెలుగు ప్రజలు టిడిపి ఓటేస్తారా అంటే నో క్లూ...


 
 
Back to Top