తొందరపడి ముందే ముఖ్యమంత్రి తన సొంత చేతులతో ఇటుక ఇటుక పేర్చి నిర్మించిన హైదరాబాద్ వదిలి వెళ్లిపోవడానికి ఆయన కారణాలు ఆయనకు ఉండవచ్చు గానీ, ఉద్యోగులకు కూడా అలాంటి కారణాలే ఉండాలని ఆయన అనుకోవడం మాత్రం సంసార లంపటాలున్న వారికేవరికీ అర్థం కావడం లేదు. `` మనవాళ్ళు బ్రీఫ్‌డ్ మీ`` అన్న ఒక్క మాటకు కట్టుబడి ధర్మబాబు కట్టుబట్టలతో హైదరాబాద్ వదిలి వెళ్లారు. కానీ ఉద్యోగులు బ్రీఫ్‌డ్‌మీ అని ఒక్క మాట ఉదారంగా అనలేకపోతున్నారు. ఉద్యోగులు కూడా మనుషులే. భార్య, పిల్లలు, వాళ్ల చదువులు, ఇల్లూ వాకిలి, ఆ ఇంటి మీద అప్పులు, ఇన్‌స్టాల్మెంట్స్ ఇలా ఎన్నో ముడిపడి ఉంటాయి. ముఖ్యమంత్రికయితే చిటికె వేస్తే జూబ్లీహిల్స్ ఇల్లు కూలుతుంది. వెంటనే కొత్త ఇంటి గోడలు లేస్తాయి. అద్దె ఇంట్లోకి వెనువెంటనే మారిపోతారు. వాస్తు అనో, పరవాస్తు భవనం అనో ఫాంహౌస్‌కు వెళతారు. తన సొంతమైన, ప్రత్యేకమైన ఫాంహౌస్ ప్రశాంతత భంగం కాకూడదని మరుక్షణం స్టార్‌హోటల్ సూట్‌లో దిగుతారు. ఎక్కితే విమానం, దిగితే హెలిక్యాప్టర్ లాంటి అతిసాధారణ ప్రయాణ వసతులేవో ఆయనకు వద్దన్నా ఉంటాయి. మరి ఉద్యోగులు భవబంధాలు తెంచుకుని వెలగపూడి భవననిర్మాణం దీక్షా కంకణం కట్టుకోవాలంటే అంత సులభంకాదని ఉద్యోగ సంఘాల వారే టీవీ తెర ముందు, తెర వెనుక చెబుతున్నారు. ముఖ్యమంత్రి మాత్రం చావుగీత (డెడ్‌లైన్) గీశాను. వస్తారో చస్తారో మీ ఇష్టం అనడంతో ఉద్యోగుల గొంతులో వెలగపూడి పచ్చి వెలక్కాయ పడింది. సందట్లో సడేమియా అంటూ రాబోయే రాజధాని చుట్టు పక్కల ఇళ్ల అద్దెలు అమాంతంగా ఆకాశాన్ని తాకాయి. మాట వరసకు చావుగీతలోపు ఉద్యోగులందరూ వెలగపూడి వెళ్లారనే అనుకుందాం. అందర్నీ పక్కన కూర్చోబెట్టుకుని మళ్లీ సి.ఎం బాబు రెండు గంటలు తక్కువ కాకుండా మాట్లాడేవి వీడియో కాన్ఫరెన్సులోనే కదా- అదెదో ఇలాగే కానిస్తే కాస్త ఊపిరి పీల్చుకుని తాపీగా వచ్చే వాళ్లు కదా అన్నది ఉద్యోగుల గుసగుస. నిజానికి విభజన చట్టం అనుమతించిన పదేళ్లు అయ్యాక కూడా హైదరాబాద్ వదిలి వెళ్లాలని బాబుకు మొదట్లో లేదు. ఒక్క బ్రీఫ్‌డ్ వల్ల వచ్చిన అనర్థమిది అని ఆయన ఉద్యోగులకు ఎలా చెప్పగలరు ? చెప్పుకోలేని చోట చెప్పుకోలేని బాధ అది. వెలగపూడి వెలక్కాయ మింగలేరు- కక్కకూడదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత ఉద్దండరాయా....!