నాయుణ్ని మించిన నాయుడు

సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రి లో ఒకే రూమ్ లో  వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు చెరో బెడ్ మీద కూర్చున్నారు. ఇద్దరు నర్సులు ఇద్దరి వీపులకూ ఆయింట్ మెంట్ రాస్తున్నారు. ఇద్దరూ బాధ భరించలేక మూలుగుతున్నారు. ఇద్దరి వీపులూ నెత్తురోడుతున్నాయి. ఇంతలో డ్యూటీ డాక్టర్ వచ్చాడు. ఇద్దరి వీపులూ చూశాడు. మరీ ఇంత రక్తాలు కారేలా...ఏంటండీ బాబూ అని..నర్సులని పిలిచి శుభ్రంగా బెంజీన్..అయోడిన్..హైడ్రోజిన్ పెరాక్సైడ్  వేసి వీపులు  క్లీన్ చేసేయండి నేనిప్పుడే వస్తా అని మరో రూమ్ కి వెళ్లాడు.
బెంజీన్ వీపు మీద పడగానే చంద్రబాబు ఒక్క సారిగా గట్టిగా అరిచారు.
చంద్రబాబునే చూస్తోన్న వెంకయ్య నాయుడు బెంజీన్ రాయకుండానే గట్టిగా అరిచేసరికి నర్సు బెదిరిపోయింది.
ఇద్దరూ బాధ తట్టుకోలేకపోతున్నారు.
డ్యూటీ డాక్టర్ వచ్చాడు.
ఏంటండీ బాబూ  ఏమైందసలు అని అడిగాడు.
ఇద్దరూ మాట్లాడలేకపోతున్నారు. కళ్లంపట నీళ్లు కారుతూనే బాధగా మూలుగుతూ చేతులతో ఏదో సైగ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటో డాక్టర్ కి అర్ధం కావడం లేదు.  
ఇహ లాభం లేదనుకుని  వెంకయ్యనాయుడిని, చంద్రబాబు నాయుడినీ ఆసుపత్రికి తీసుకొచ్చిన వాళ్లని ఓ సారి రమ్మనమనండి అని పిలిపించారు. బిజెపి మంత్రి కామినేని శ్రీనివాసరావు..టిడిపి ఎంపీ సుజనా చౌదరి వచ్చారు. 
వాళ్లని చూడగానే డాక్టర్ " ఏంటండీ ఇది? ఏమైంది ఇద్దరు నాయుళ్లకీ?  ఎవరీ పని చేశారు? ఎందుకు చేశారు? ఇంత రక్తాలు కారేలాగా? అని  ప్రశ్నల వర్షం కురిపించేసరికి సుజనా చౌదరి కామినేని కూడా ఒక్కసారిగా నవ్వేశారు.
డాక్టర్ కి ఆశ్చర్యంతో పాటు కోపం పుట్టుకొచ్చింది.
ఇదేమన్నా జోకా ? మీ నేతలు నెత్తురోడుతూ ఉంటే మీరేంటండీ బాబూనవ్వుతారు అని సీరియస్ గానే అన్నాడు డాక్టర్. దానికి వాళ్లిద్దరూ తమాయించుకుని సారీ డాక్టర్ మేం నవ్వేది అందుక్కాదు. మీరు ఎవరు చేశారిలా అంటే మాకు నవ్వొచ్చిందే తప్ప..వీళ్ల ఏడుపులు చూసి మేం నవ్వడం లేదు అన్నారు.
మరేమయ్యిందో అదయినా చెప్పండి అని డాక్టర్ అడిగాడు.
అపుడు ఇద్దరూ గొంతు సవరించుకుని..మరేం లేదండీ బాబూ.. వెంకయ్య నాయుడుగారు నాలుగో సారి రాజ్యసభ కు ఎన్నికయ్యారు కదా అంచేత  ఆయనకు ఆత్మీయంగా ఓ సన్మానం చేశాం. అపుడు చంద్రబాబు నాయుడు  మా వెంకయ్య నాయుడు ఎంత గొప్పవారో  గుక్క తిప్పుకోకుండా  చెప్పుకుంటూ పోతూ వెంకయ్యనాయుడి వీపు గోకేశారు.
చంద్రబాబంతటి నాయకుడే తన వీపు గోకడంతో  సిగ్గుపడిపోయిన వెంకయ్యనాయుడు బాగుండదని చెప్పి తాను కూడా చంద్రబాబు నాయుడి వీపు గోకేశారు.
 వెంకయ్య నాయుడి వల్లనే 1983 లో ఎన్టీఆర్ వెన్నుపోటు డ్రామాకు  చెక్ చెప్పగలిగాం అని చంద్రబాబు నాయుడు పొగిడారు. అసలు వెంకయ్య నాయుడి వల్లనే ఏపీ అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. 
దాంతో వెంకయ్యనాయుడు  సిగ్గుతో తలవంచుకుని మరీ పొగిడేస్తున్నారు అని లోపల అనుకుని..నదుల అనుసంధానంతో చంద్రబాబు నాయుడు దేశానికే ఆదర్శంగా నిలిచారని పొగిడారు.
ఇహ  అపుడు చంద్రబాబు నాయుడు ఆనందంతో ఒళ్లు మర్చిపోయారు. ఇలా ఒకరినొకరు పొగుడుకుంటూ  ఒకరి వీపులు ఒకరు గోకేసుకున్నారు. చాలా కాలం నుంచీ గోళ్లు తీయకపోవడం వల్ల ఇద్దరి వీపులూ చర్మాలూడి రక్తాలు కారిపోయాయి. అయినా ఇద్దరు నాయుళ్లూ  పొగడ్తల ఆనందంలో  తమ వీపుల నుంచి నెత్తురోడ్డాన్ని గుర్తించలేదు.
మీటింగ్ అయిపోయి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లాక వీపు ఒకటే బాధ పెట్టేయడంతో ఇద్దరూ  కుయ్యో మొర్రో మన్నారు. సరిగ్గా ఆసమయానికి మేం  అందుబాటులో ఉన్నాం కాబట్టి సమయానికి మీ ఆసుపత్రికి తీసుకొచ్చాం " అని ఇద్దరూ చెప్పడం ఆపి ఆయాసంతో  రొప్పారు.
డాక్టర్ కి విషయం అర్ధమైంది.
అదన్న మాట సంగతి. అయితే మరేం ఇబ్బంది లేదు. ఈ  సారి నుంచి ఇద్దరినీ ఒక వేదికపైకి ఎవరూ పిలవకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఒక వేళ తప్పన సరి అనిపిస్తే..ఇద్దరి చేతివేళ్ల గోళ్లూ మొదలుకంటా ఊడబెరికి అపుడు పిలవండి. అదీ కుదరకపోతే వేదిక ఎక్కాక ఇద్దరి చేతులూ వెనక్కి పెట్టి కట్టేసి అపుడు మాట్లాడమనండి అపుడు ఇలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాడు.
డాక్టరంటే మీలా ఉండాలండీ. ఇట్టే పట్టేశారు. నివారణ మార్గం ఇట్టే తేల్చేశారు. అసలు అందరు డాక్టర్లూ మీలా ఉంటే  ఆసుపత్రులన్నీ కళ కళ లాడతాయండి అని పొగిడారు.
పొగడ్తలకి డాక్టర్ సిగ్గుపడిపోయాడు.
కామినేని,సుజనా ఇద్దరూ కూడా డాక్టర్ కి థ్యాంక్స్ చెప్పి తమ నేతలను తీసుకుని వెళ్లిపోయారు.
వాళ్లు వెళ్లగానే డాక్టర్ కి ఏదో బాధగా అనిపించింది.
వెనక నుంచి వచ్చిన నర్సు ఏంటి డాక్టర్  మీ వీపంతా రక్తాలు కారుతున్నాయి అని కంగారుగా అడిగింది. 
డాక్టర్ బాధగా మూలుగుతూ  కామినేని..సుజనా వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాడు.
Back to Top